Showing posts with label bindu madhavi. Show all posts
Showing posts with label bindu madhavi. Show all posts

Saturday, October 15, 2011

రివ్యూ: పిల్ల జమీందార్

'అలా మొదలైంది' తర్వాత హీరోగా నాలుగు మెట్లు పైకెదిగిన నాని ఇప్పుడు 'పిల్ల జమీందార్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. 'ఎ మిలియనీర్స్ ఫస్ట్ లవ్' అనే కొరియన్ సినిమాని ఆధారం చేసుకుని, దానికి మన నేటివిటీని జోడించి ఈ సినిమాని రూపొందించాడు నూతన దర్శకుడు అశోక్. టైటిల్‌కి తగ్గట్లు కథంతా నాని పోషించిన ప్రవీణ్ జయరామరాజు అనే పాత్ర చుట్టూ నడుస్తుంది ఆ పాత్రని సహసిద్ధమైన శైలిలో సునాయాసంగా చేసుకుపోయాడు నాని. రూ. 5000 కోట్ల ఆస్తికి వారసుడైనప్పటికీ ఆ ఆస్తి దక్కాలంటే తాత పెట్టిన కండిషన్లని ఎదుర్కోడానికి అతడు చేసే ప్రయత్నాలు, చేష్టలు మంచి వినోదాన్నిచ్చాయి. చదువంటే ఆమడ దూరం పరిగెత్తేవాడిగా, ఆవేశపరుడిగా, అహంభావిగా నాని ప్రదర్శించిన నటనని మెచ్చుకోకుండా ఉండలేం.
దర్శకుడు అశోక్ కొత్తవాడైనప్పటికీ నాని నుంచి నటనను ఎలా రాబట్టుకోవాలో తెలిసినవాడి మల్లే అవుపించాడు. ఫస్టాఫ్‌లోని పూర్తిస్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ వల్ల ఇంటర్వల్ అప్పుడే వచ్చిందా అనిపించింది. కొన్ని కామెడీ సీన్లు పండకపోయినా ఎక్కువ సీన్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వించాయి. సెకండాఫ్‌లోనూ వినోదం ఉన్నా కథ మెలోడ్రామా వైపు మళ్లడంతో కొన్ని సీన్లు బరువుగా తోస్తాయి. కాలేజీ ఎలక్షన్లనేవి కథకి నప్పలేదు. వాటిని కథలో బలవంతంగా చొప్పించినట్లనిపిస్తుంది. మెలోడ్రామా ఎక్కువైనా క్లైమాక్స్ చిత్రీకరణ బాగుంది. చివర్లో ఓ చక్కని సందేశాన్ని కూడా దర్శకుడిచ్చాడు.
అయితే నాని, హరిప్రియ మధ్య కెమిస్ట్రీ సరిగా వర్కవుట్ కాలేదు. వాళ్లమధ్య రొమాంటిక్ యాంగిల్ మిస్సయ్యింది. సెకండాఫ్‌లో మెలోడ్రామా ఎక్కువైన విషయాన్ని దర్శకుడు గుర్తించలేకపోయాడు. అందువల్లే కొన్ని సీన్లు చికాకు కలిగించాయి. ప్రవీణ్ జయరామరాజు పాత్రకి నాని పూర్తి న్యాయం చేశాడు. అతని హావభావాలే అతనెట్లాంటి నటుడో తెలియజేస్తాయి. 'అలా మొదలైంది'లో నాని కంటే నిత్యమీనన్ ఎక్కువగా ఆకట్టుకుంటే 'పిల్ల జమీందర్' మాత్రం పూర్తిగా నాని సినిమానే. హరిప్రియని మెయిన్ హీరోయిన్‌గా ఎలా ఎంచుకున్నారో అర్థంకాదు. ఆమెలో గ్లామర్, ప్రతిభ రెండూ కనిపించలేదు. ఆమె బదులు మరో చక్కని హీరోయిన్ ఆ పాత్ర చేసినట్లయితే సినిమాకి మరింత ఆకర్షణ వచ్చి ఉండేది. బిందుమాధవి బాగున్నా ఆమెని దాదాపు గెస్ట్ ఆర్టిస్ట్‌కింద చూపారు. మిగతా ఆర్టిస్టుల్లో రావు రమేశ్, శివప్రసాద్, అవసరాల శ్రీనివాస్, ఎమ్మెస్ నారాయణ బాగా చేశారు.
సినిమాలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది చంద్రశేఖర్ రాసిన డైలాగులు. త్రివిక్రం శైలి కట్ డైలాగ్స్‌తో అతను బాగా నవ్వించాడు. మొత్తంగా చూస్తే 'పిల్ల జమీందర్'ని ఓసారి చూడ్డంలో వచ్చే నష్టమేమీ లేదు.

Sunday, October 2, 2011

న్యూస్: జమీందార్లు పోయినా 'పిల్ల జమీందార్' వదలట్లేదు!

మొత్తానికి 'పిల్ల జమీందార్' పాటలు విడుదలయ్యాయి. నాని సరసన అంతగా గ్లామర్‌లేని హరిప్రియ, బిందుమాధవి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి తమిళ సంగీత దర్శకుడు సెల్వగణేశ్ మ్యూజిక్‌నిచ్చాడు. ఈ సినిమా బాగా ఆలస్యం కావడానికి గల కారణాల్ని నిర్మాత డి.ఎస్. రావు ఆవేదనా రూపంలో వ్యక్తం చేశాడు. సమ్మెలతో పాటు పలు ఆటంకాలు కలగడం వల్లే సినిమా మేకింగ్‌లో ఇంత ఆలస్యం జరిగిందనీ, అయితే శ్రమకు తగ్గ ఫలితం దక్కిందనీ ఆయన చెప్పాడు. పదేళ్ల నుంచీ హిట్ కోసం మొహం వాచిపోయాననీ, ఈ సినిమాతో ఆ దాహం తీరుతుందనీ గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ఈ సినిమా ద్వారా అశోక్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. ఎప్పుడో రాష్ట్రంలో జమీందారీలకు కాలం చెల్లిపోయినా మన సినిమా వాళ్లు మాత్రం ఆ జమీందారీలని ఇంకా వదిలిపెట్టలేదనే దానికి ఈ సినిమా మరో ఉదాహరణ. యువకుడైన అశోక్ మరి ఇలాంటి కథని ఎందుకు ఎంచుకున్నాడో తెలీదు. పాటల చిత్రీకరణ, వాటి బాణీలు చూస్తే మాత్రం సెల్వ గణేశ్ బాగానే పనిచేసినట్లు అర్థమవుతుంది. అయితే నాని తప్ప ఈ సినిమాకి జనాన్ని తీసుకువచ్చే మరో ఆకర్షణ ఏదీలేని స్థితిలో పదేళ్లకైనా డి.ఎస్. రావు హిట్ కలని 'పిల్ల జమిందార్' తీరుస్తాడో, లేడో...

Friday, August 26, 2011

న్యూస్: 'పిల్ల జమీందార్'కి బిజినెస్ లేదు!

తెలుగులో ఇటు 'సెగ', తమిళంలో అటు 'వెప్పం' రెండూ ఫట్టయ్యాక ఇప్పుడు నాని తర్వాతి సినిమాపై అందరి దృష్టి మళ్లింది. ప్రస్తుతం అతను రాజమౌళి డైరెక్షన్‌లో 'ఈగ', కొత్త దర్శకుడు అశోక్ తీస్తున్న 'పిల్ల జమీందార్'లో హీరోగా నటిస్తున్నాడు. వీటిలో ముందుగా రాబోతోంది 'పిల్ల జమీందార్'. ఈ సినిమాలో నాని సరసన హరిప్రియ, బిందుమాధవి హీరోయిన్లు. ఆ ఇద్దరూ సాధారణ తారలే కావడం గమనార్హం. భూమిక నిర్మించిన ఫ్లాప్ సినిమా 'తకిట తకిట' ద్వారా హరిప్రియ పరిచయం కాగా, నాలుగైదు సినిమాలు చేసినా ఒక్కటీ హిట్టులేని తార 'బిందుమాధవి'. ఇలాంటి తారలతో నటిస్తున్నందువల్ల ఈ సినిమా పట్ల బిజినెస్ వర్గాలు పెద్దగా ఆసక్తి కనపరచడం లేదని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. శ్రీ శైలేంద్ర సినిమాస్ బేనర్‌పై డి.ఎస్. రావు ఈ సినిమా నిర్మిస్తున్నారు. "జమీందారుగా నటిస్తున్న నాగినీడు ('మర్యాద రామన్న' ఫేం), ఆయన మనవడు 'పిల్ల జమీందార్'గా నటిస్తున్న నాని మధ్య వచ్చే సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయి' అని ఆయన చెప్పారు.
ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన సంగతేమంటే అవసరాల శ్రీనివాస్ ఓ కీలక పాత్ర చేస్తుండటం. 'అష్టా చెమ్మా' ద్వారానే నాని, శ్రీనివాస్... ఇద్దరూ పరిచయమయ్యారు. తిరిగి వాళ్లు కలిసి చేస్తున్న సినిమా ఇది. ఇప్పటికే నాని వ్యవహార శైలి పట్ల సినీ వర్గాలు పెదవి విరుస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'పిల్ల జమీందార్' హిట్టయితేనే అతనికి విలువ. లేదంటే ఇబ్బందే.