Showing posts with label pokiri. Show all posts
Showing posts with label pokiri. Show all posts

Wednesday, October 12, 2011

ఇంటర్వ్యూ: మహేశ్

'దూకుడు'తో పోకిరి' ఇమేజ్ నుంచి బయటకొచ్చేశా 


'దూకుడు' వల్ల జరిగిన మంచేమిటంటే, 'పోకిరి' ఇమేజ్ నుంచి బయటకు వచ్చేశాను - అని చెప్పారు మహేశ్. ఆయన హీరోగా నటించిన 'దూకుడు' చిత్రం రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం విజయోత్సాహంలో ఉన్న మహేశ్ చెప్పిన సంగతులు ఆయన మాటల్లోనే...

శ్రీను వైట్ల చెప్పినట్లు ఇది యూనివర్సల్ స్క్రిప్టు. ఇంతవరకు నా కెరీర్‌లో ఇంత కంప్లీట్ స్క్రిప్టు వినలేదు. విన్నప్పుడే చాలా ఆనందం వేసింది. అందరం చాలా హ్యాపీగా ఉన్నాం, సినిమా ఇంత పెద్ద హిట్టయినందుకు. నేను చేసిన కేరక్టర్‌లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అందుకే ఐ లైక్ ద స్క్రిప్ట్. ఇందులో తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్ ఉంది, అదే సమయంలో ఓ పోలీస్ యాంగిల్ ఉంది, పొలిటికల్ యాంగిల్ ఉంది.. ఇలా మూడు యాంగిల్స్ ఉన్న మంచి కేరక్టర్. ఎప్పుడూ ఇలాంటి పూర్తి స్థాయి భావోద్వేగాలున్న సినిమాలు చేయడం కష్టం. ఇలాంటి స్క్రిప్టులు చాలా అరుదుగా వస్తుంటాయి. 'దూకుడు' వల్ల జరిగిన మంచేమిటంటే, 'పోకిరి' ఇమేజ్ నుంచి బయటకు వచ్చేశాను. 'దూకుడు'కంటూ ప్రత్యేకంగా ఎలాంటి ఇమేజ్ రాలేదు. ఎందుకంటే ఇది యూనివర్సల్ స్క్రిప్టు కావడం. అన్ని యాంగిల్స్ కవరయ్యాయి. 'పోకిరి' అనేది ఒక కేరక్టర్ బేస్ట్ సినిమా. ఇది అలా కాదు. దానికి చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని మాకందరికీ మొదట్నించీ చాలా నమ్మకంగా ఉండేది. ఆ నమ్మకంతోనే పనిచేశాం. ఫలితం సాధించాం.
నాన్న ఫోనే బెస్ట్ కాంప్లిమెంట్
నాకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ నాన్నగారు ఫోన్ చేయడమే. ఆ టైమ్‌లో నేనూ, శ్రీనూ ఒక్కచోటే ఉన్నాం. మార్నింగ్ షో చూసి ఫోన్ చేశారు. రూ. 80 కోట్లు వసూలు చేస్తుందని చెప్పారు. నాకైతే ఆయన మాటలు వెంటనే జీర్ణం కాలేదు.  ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది, 'దూకుడు' ఎంత ఇంపాక్ట్ కలిగిస్తున్నదో. అమెరికాలో తొలి రెండు, మూడు రోజుల కలెక్షన్ల ఫిగర్లు చూసి నేను నిజంగా నమ్మలేకపోయా. లాజ్ ఏంజిల్స్ టైమ్స్ ప్రత్యేక వ్యాసం రాయడం సెన్సేషనల్ న్యూస్. నా వరకు అమెరికా అనేది ఇంకో నైజాంలా అయిపోయింది.
ఒక్కటే సందేహం
శ్రీను స్క్రిప్టు చెప్పినప్పుడు ఒక్కటే సందేహం ఉండేది. 'పోకిరి'లో నేను పోలీస్ అనేది చివర్లోనే తెలుస్తుంది. ఇందులో ఇంట్రడక్షన్ సీన్‌లోనే పోలీస్ అని చెప్పేస్తాం. అలా చెప్పి పోలీస్ కేరక్టర్ నడపడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్. ఈ సందేహం నేను చెబితే అలాంటి డౌటేమీ పెట్టుకోవద్దనీ, మన సినిమా బ్లాక్‌బస్టర్ అని ఫిక్సయిపొమ్మని చెప్పారు శ్రీను. అదే జరిగింది. డైరెక్టర్‌తో కమ్యూనికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. పాత్రలో ప్రవేశించాలంటే అది చాలా అవసరం. ఈ విషయంలో శ్రీనుగారు ఈజ్ పర్‌ఫెక్ట్ ఫర్ మీ.
ఎమ్మెల్యే రోల్ హైలైట్
ఎమ్మెల్యే కేరక్టర్ రిస్క్ అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. హైలైట్ అవుతుందనే అనుకున్నాం. 'ఆ గెటప్‌లో మిమ్మల్ని చూడాల'ని శ్రీనుగారు అన్నారు. దాన్నాయన హైలైట్‌గా ఫీలయ్యారు. అంతేకానీ రిస్కనేది మైండ్‌లో రాలేదు. అఫ్‌కోర్స్. మెళ్లో పులిగోరనేది చివరలో జత కలిసింది. తెలంగాణ యాసని ఓవర్‌బోర్డ్‌గా వెళ్లకుండా నీట్‌గా చేసుకు వెళ్లాం. అది పే చేసింది. అందరూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతీకారం కథని వినోదాత్మకంగా చెప్పడం నాకు తెలిసి ఇదే తొలిసారి.
ప్రకాశ్‌రాజ్ పాత్ర ఇష్టం
నా పాత్ర కాకుండా ప్రకాశ్‌రాజ్ చేసిన పాత్ర బాగా ఇష్టం. శ్రీనుగారు చాలా బాగా దాన్ని డిజైన్ చేశారు. అది వెరీ స్పెషల్ కేరక్టర్. నిజ జీవితంలోనూ నేను మా నాన్నగారికి బాగా సన్నిహితం.
కామెడీని ఎంజాయ్ చేశా
బాంబేలో జగన్ చూసి ఇచ్చిన కాంప్లిమెంట్ మర్చిపోలేను. కామెడీ టైమింగ్ బాగుందనీ, కొన్ని సీన్లలో బ్రహ్మానందంగార్ని మించిపోయారనీ అన్నారు. అంతకంటే మంచి కాంప్లిమెంట్ వేరేముంటుంది. నిజంగానే సెకండాఫ్‌లో వచ్చిన కామెడీ సీన్స్‌ని బాగా ఎంజాయ్ చేశా. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ టెర్రిఫిక్ కామెడీ యాక్టర్లు. వాళ్లతో కలిసి చెయ్యడం చాలా సంతోషం.
స్క్రిప్టుకి ఇంప్రెస్సయ్యా
వచ్చే ఏడాది నావి మూడు సినిమాలు వచ్చే అవకాశముంది. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో చేస్తున్న 'బిజినెస్‌మ్యాన్' వచ్చే జనవరిలో వస్తుంది. ఇప్పటికే సగం సినిమా పూర్తయింది. 'దూకుడు'తో పోలిస్తే మరో భిన్నమైన పాత్ర. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు'లో వెంకటేశ్‌గారు, నేను బ్రదర్స్‌గా చేస్తున్నాం. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చెప్పిన స్క్రిప్టుకి బాగా ఇంప్రెస్ అయ్యా. వెంకటేశ్‌గారు చాలా మంచి యాక్టర్. ఆయనతో సన్నిహితంగా ఉంటా. హిందీలో చేసేంత టైమ్ లేదు. నేను ప్రయోగాలు చెయ్యను. మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తా.

న్యూస్: 'దూకుడు' 100 కోట్లు కలెక్ట్ చేస్తుందన్న కృష్ణ!

మహేశ్ 'దూకుడు' ఓవరాల్‌గా రూ. 100 కోట్లని వసూలు చేస్తుందని జోస్యం చెప్పారు సీనియర్ సూపర్‌స్టార్ కృష్ణ. అక్టోబర్ 10 రాత్రి హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్లో జరిగిన సినిమా సక్సెస్‌మీట్‌లో సతీసమేతంగా పాల్గొన్న ఆయన 'దూకుడు' గురించి ఒకింత ఉద్వేగంగా మాట్లాడారు. చాలా రోజుల తర్వాత ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన 'దూకుడు' సినిమా ఇంత హిట్టవడానికి చాలా కారణాలున్నాయన్నారు. "ఈ సినిమా చూసే వాళ్లలో క్లాస్ ఆడియెన్స్ ఉంటారు, మాస్ ఆడియెన్స్ ఉంటారు, యూత్ ఉంటారు, ముఖ్యంగా పిల్లలుంటారు, లేడీస్ ఉంటారు. అన్ని రకాల ఆడియెన్స్‌కి నచ్చింది ఈ సినిమా. కాబట్టే ఇంత పెద్ద హిట్టయింది. ఇందులో మ్యూజిక్ బాగుంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. డైరెక్షన్ చాలా బాగుంది. కెమెరా చాలా బాగుంది. ఎన్నో రికార్డులు బద్దలుకొట్టి విపరీతమైన కలెక్షన్లు ఇప్పటివరకు కలెక్ట్ చేసింది. ఇందులో ముఖ్యంగా పిక్చర్ మొదలు పెట్టిన దగ్గర్నుంచీ ఎండింగ్ వచ్చేవరకూ అందరి చేతా నవ్వించారు. సినిమా చూస్తున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాం. ఆర్టిస్టులంతా చాలా బాగా యాక్ట్ చేశారు. మహేశ్ అన్ని సినిమాల్లోకంటే ఈ సినిమాలో చాలా అందంగా ఉన్నాడు. చాలా బాగా చేశాడు. నాకు చాలా బాగా నచ్చిన చిత్రమిది. 'పోకిరి' సినిమా చూసిన వెంటనే అది 40 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పాను. 40 కోట్లూ కలెక్ట్ చేసింది ఆ సినిమా. 75 సంవత్సరాల రికార్డుల్ని బద్దలుకొట్టిన సినిమా 'పోకిరి'. ఇప్పుడు 'దూకుడు' మార్నింగ్ షో చూడగానే ఇంటికొచ్చి మహేశ్‌కి నేను ఫోన్‌చేశాను. అప్పుడు శ్రీను వైట్ల కూడా మహేశ్ పక్కనే ఉన్నాడు. ఆ ఇద్దరికీ కంగ్రాట్స్ చెప్పి 80 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేస్తుందని చెప్పాను. ఈ రోజున ఈ సినిమా ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, కర్ణాటకలోనూ, తమిళనాడులోనూ, ఒరిస్సాలోనూ, నార్త్ ఇండియాలోనూ, విదేశాల్లో కూడా రికార్డులు బద్దలుకొట్టింది. నేననుకున్నట్లు 80 కోట్లు కాదు, 100 కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేయబోతోంది. 80 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రని తిరగరాయబోతోంది కలెక్షన్ల విషయంలో" అని ఆయన చెప్పారు.

Monday, October 3, 2011

బిగ్ స్టోరీ: అప్పుడు 'పోకిరి' పోలీస్! ఇప్పుడు 'దూకుడు' పొలీస్!!

ఈ ఏడాది తెలుగు చిత్రసీమలో ఎన్నో సినిమాలు విడుదలైనా ఎప్పటిలా కొన్నే హిట్టయ్యాయి. ఆ సినిమాల నిర్మాతలను గట్టెక్కించాయి. అయితే ఏడాది మూడోవంతు పూర్తవుతున్నా టాలీవుడ్‌కు అతి పెద్ద హిట్టు రాలేదనే బాధ సినీ వర్గాల్లో వ్యక్తమవుతూ వచ్చింది. మరోవైపు బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్ సినిమాలు 'దబాంగ్', 'బాడీగార్డ్', అజయ్ దేవగన్ సినిమా 'సింగమ్' సినిమాలు రూ. వంద కోట్ల పైగా వసూళ్లతో సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో నిర్మాతల్నీ, డిస్ట్రిబ్యూటర్లనీ, ఎగ్జిబిటర్లనీ - అందర్నీ అమితానందపరుస్తూ వచ్చింది 'దూకుడు' చిత్రం. మహేశ్ కథానాయకుడిగా దర్శకుడు శ్రీను వైట్ల రూపొందించిన ఈ చిత్రం తొలి వారం కనీ వినీ ఎరుగని రీతిలో రూ. 35 కోట్ల షేర్ వసూలు చేసి, ట్రేడ్ పండితుల్ని సైతం ముక్కుమీద వేలేసుకునేట్లు చేసింది.
80 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇది అతిపెద్ద రికార్డు. ప్రపంచవ్యాప్తంగా 1600 పైగా థియేటర్లలో విడుదలైన 'దూకుడు' ప్రభంజనం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాక, దేశంకాని దేశమైన అమెరికాలోనూ సంచలన విజయం నమోదు చేయడం గమనార్హం. తొలివారం అక్కడ రూ. 5 కోట్లకు పైగా షేర్ సాధించడం అమెరికన్ ట్రేడ్ విశ్లేషకుల్నీ విస్మయ పరిచింది. అక్కడ ఇప్పటివరకు బాలీవుడ్ సినిమాని సైతం ప్రదర్శించని థియేటర్లలోనూ 'దూకుడు'ని ప్రదర్శించడం విశేషం. ఇక్కడ ఆసక్తికరమైన సంగతేమంటే మహేశ్ పోలీస్ పాత్రలు చేసిన రెండు సినిమాలూ వాటి కాలాల్లో బాక్సాఫీస్ రికార్డులు సృష్టించిన సినిమాలు కావడం.
2006లో తొలిసారి ఆయన పోలీస్ కేరక్టర్ చేసిన 'పోకిరి' సినిమా కలెక్షన్లలో అంతకు ముందున్న బాక్సాఫీసు రికార్డుల్ని తిరగరాసి రూ. 40 కోట్లకు పైగానే వసూలు చేసిన (అంచనా) తొలి తెలుగు సినిమాగా పేరు తెచ్చుకుంటే, ఐదేళ్ల తర్వాత మహేశ్ రెండోసారి 'పొలీస్' పాత్ర చేసిన 'దూకుడు' సైతం అంతకు మించిన కలెక్షన్లతో దూసుకుపోతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'పోకిరి'లో ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణమనోహర్‌గా మహేశ్ ప్రదర్శించిన నటన అందర్నీ ఆకట్టుకుంది. అందులో ఆయన చెప్పిన కట్ డైలాగ్స్ అలరించాయి. ఓ చోట 'ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఉప్మా తిని బతికేస్తున్నార్రా నాన్నా' అంటూ ఆయన చెప్పిన డైలాగ్ బాగా పేలింది. తండ్రి (నాజర్)ని విలన్ ప్రకాశ్‌రాజ్ చంపినప్పుడు తొలిసారి పోలీసాఫీసర్ వేషంలో మహేశ్ వేగంగా పరుగెత్తుకుంటూ తండ్రి శవం వద్దకు వచ్చే సన్నివేశం సినిమాకే ఆయువుపట్టుగా నిలిచింది.
ఇప్పుడు 'దూకుడు'లో ఐపీఎస్ ఆఫీసర్ అజయ్‌కుమార్‌గా మహేశ్ నటన ప్రేక్షకుల్ని ఎంతగా అలరిస్తున్నదో కలెక్షన్లే తెలియజేస్తున్నాయి. కోమా నుంచి బయటకు వచ్చిన తండ్రి (ప్రకాశ్‌రాజ్) ప్రాణానికి హాని ఉండటంతో ఆయన వద్ద ఎమ్మెల్యేగా నటిస్తూ, మరోవైపు ఆయనకు అలాంటి స్థితి కలగడానికి కారణమైన దుష్టుల్ని పోలీసాఫీసర్‌గా ఏరిపారేసే సన్నివేశాలు ప్రేక్షకుల్ని బాగా మెప్పిస్తున్నాయి. 'ఎవర్నువ్వు?' అని ఎవరైనా అడిగితే 'పో'లీస్ అని కాకుండా 'పొ'లీస్ అంటూ ఆయన సమాధానం చెప్పే తీరు జనాన్ని ఆకట్టుకుంటోంది. ఇలా రెండు మార్లు పోలీస్ పాత్రలు చేసి, రెండు సార్లూ రికార్డు కలెక్షన్లు సాధించడంతో మహేశ్ అభిమానులు ఆనంద పరవశులవుతున్నారు. అయితే రానున్న రోజుల్లో దీన్నో సెంటిమెంటుగా భావించి, రచయితలూ, దర్శకులూ ఈ తరహా పాత్రలతో ఆయన వద్దకు వెళ్లే అవకాశాలు లేకపోలేదు. కాకపోతే ఆ పాత్రల్లో మొనాటనీ లేకుండా చూసుకోవడం మహేశ్ వంతు.

Saturday, September 24, 2011

న్యూస్: దున్నేస్తున్న 'దూకుడు'

విడుదలకు ముందే అనేక రికార్డుల్ని సొంతం చేసుకున్న మహేశ్ 'దూకుడు' టైటిల్‌కి పూర్తి న్యాయం చేకూరుస్తూ తొలిరోజు కలెక్షన్ల పరంగా టాలీవుడ్‌లో సరికొత్త రికార్డుని సృష్టించినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ థియేటర్లలో విడుదలైన రికార్డుని సొంతం చేసుకున్న 'దూకుడుకి అన్ని చోట్లా పాజిటివ్ టాక్ రావడమే కాకుండా ప్రేక్షకుల స్పందన కూడా అనూహ్యంగానే ఉంది. తొలిరోజు 'మగధీర' రికార్డుల్ని 'దూకుడు' అధిగమించిందనేది ట్రేడ్ రిపోర్ట్. మహేశ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయిన 'పోకిరి' రికార్డుల్ని ఈ సినిమా మూడు నుంచి నాలుగు వారాల్లో అధిగమిస్తుందని అంచనాలు వేస్తున్నారు. జి. అజయ్‌కుమార్ ఐపియస్ పాత్రలో మహేశ్ ప్రదర్శించిన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా నిడివి 2 గంటల 50 నిమిషాలు ఉండటంతో కనీసం 15 నుంచి 20 నిమిషాల నిడివి తగ్గించాలని విమర్శకులు సూచిస్తున్నా ట్రెండ్ చూస్తుంటే లెంగ్త్ అనేది పెద్ద సమస్యగా కనిపించడంలేదు. 'పోకిరి' తర్వాత మహేశ్ సినిమాలు 'సైనికుడు', 'అతిథి', 'ఖలేజా' ఆడకపోవడానికి ప్రధాన కారణం వాటిలో ఎంటర్‌టైన్‌మెంట్ లోపించడమేనని భావించిన శ్రీను వైట్ల, అతని రచయితలు గోపీమోహన్, కోన వెంకట్ 'దూకుడు'ని హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మలచడంలో విజయం సాధించారు. స్వతహాగా రచయిత కూడా అయిన శ్రీను వైట్ల ఇందులో అనేక పంచ్ డైలాగుల్ని స్వయంగా రాశాడు. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ పాత్రలతో పాటు మహేశ్ సైతం కామెడీని పంచడంతో వినోదానికి కొదవ లేకుండా పోయింది. సినిమా ట్యాగ్‌లైన్ 'డేరింగ్ అండ్ డేషింగ్'కు తగ్గట్లు మహేశ్ కేరక్టర్ రూపొందింది. యాక్షన్ సీన్లలో అతని ఎనర్జీ మాస్ ఆడియెన్స్‌ని విపరీతంగా అలరిస్తోంది. ఆ పాత్రలో చెలరేగిన మహేశ్ సినిమానంతా తన భుజాల మీద మోశాడు. అతని డైలాగ్ డిక్షన్, మధ్య మధ్యలో హైదరాబాద్ హిందీలో, తెలంగాణ యాసలో మాట్లాడి బాగా ఆకట్టుకున్నాడు. ప్రకాశ్‌రాజ్, మహేశ్ మధ్య తండ్రీకొడుకుల అనుబంధం ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. ఫలితంగా 2011లో తొలి సూపర్ డూపర్ హిట్‌కు మార్గం సుగమమైంది. 'దూకుడు' ఏ స్థాయి రికార్డుల్ని సాధిస్తుందో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఓపికపట్టాలి.

Wednesday, September 14, 2011

న్యూస్: 'మొగుడు' మీద ఆశలెన్నో!

కె. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన 'ఝుమ్మంది నాదం' రిలీజయినప్పుడు తాప్సీ రూపంలో టాలీవుడ్‌కి మరో ఇలియానా పరిచయమయ్యిందనే టాక్ వచ్చింది. 'దేవదాసు', 'పోకిరి' సినిమాలతో ఇలియానా హాటెస్ట్ హీరోయిన్ అయిన విధంగానే తాప్సీ కూడా అమిత క్రేజ్ సంపాదించుకుంటుందని అనుకున్నారు. చిత్రంగా నాలుగు సినిమాలు రిలీజైనా ఆమెకి తెలుగులో అనుకున్నంత క్రేజ్ రాలేదు. 'పోకిరి' తరహా హిట్ ఆమెకి రాకపోవడమే దీనికి కారణమని చెప్పాలి. అందచందాల విషయంలో ఏమాత్రం వంకపెట్టలేని రీతిలో ఉండే ఈ పంజాబీ ముద్దుగుమ్మ 'ఝుమ్మంది నాదం' తర్వాత 'వస్తాడు నా రాజు', 'మిస్టర్ పర్ఫెక్ట్', 'వీర' సినిమాల్లో చేసింది. వీటిలో 'మిస్టర్ పర్ఫెక్ట్' ఒక్కటే హిట్టు. అందులోనూ ఆమె చేసింది సెకండ్ హీరోయిన్ కేరక్టరే. ఫలితంగా అనుకున్నంతగా ఆమె కెరీర్ ఊపందుకోలేదు. టాప్ హీరోల సరసన ఆఫర్లు రావడం లేదు. ప్రస్తుతం ఆమె తెలుగులో ఒకే సినిమా చేస్తోంది. ఆ సినిమా 'మొగుడు'. కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో ఆమె గోపీచంద్ సరసన నటిస్తోంది. నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న ఈ సినిమాపై తాప్సీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో గోపీచంద్, తాప్సీ మధ్య రొమాంటిక్ సీన్లు ఆడియెన్స్ మతులు పోగొడతాయని ఆ సినిమా యూనిట్ మెంబర్స్ అంటున్నారు. రొమాంటిక్ సీన్లు తీయడంలో కృష్ణవంశీది అందె వేసిన చెయ్యి కావడంతో తాప్సీ అందాలు ఈ సినిమాలో కనువిందు చేస్తాయని ఊహించవచ్చు. బాలీవుడ్‌లో 'చష్మే బద్దూర్' అనే సినిమాని సిద్ధార్థ్‌తో చేయబోతున్న తాప్సీకి 'మొగుడు' ఎలాంటి కానుకనిస్తాడో చూడాల్సిందే.

Thursday, September 8, 2011

న్యూస్: రెండు ఛాన్సులు కొట్టేసిన ఇలియానా

ప్రస్తుతం తమిళంలో శంకర్ డైరెక్షన్‌లో 'నంబన్' ('3 ఇడియట్స్' రీమేక్)లో నటిస్తోన్న గోవా బ్యూటీ ఇలియానా ఎట్టకేలకు రెండు తెలుగు సినిమాల్లో బుక్కయ్యింది. తెలుగులో పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో 'నేను నా రాక్షసి' చేశాక మళ్లీ మరో సినిమాలో ఆమె దర్శనమివ్వలేదు. సాధారణంగా ఇలియానా స్టార్ హీరోయిన్ ఇమేజ్‌కి ఎలాంటి గ్యాప్ లేకుండా కనీసం రెండు మూడు సినిమాలు చేతిలో ఉండాలి. కానీ ఆ సినిమా పూర్తి చేసిన ఆర్నెల్ల వరకూ ఆమె మరో తెలుగు సినిమా సెట్స్ మీద కాలుపెట్టలేదు. కోటి దాటిన ఆమె రెమ్యూనరేషనే దీనికి కారణమని ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఆమెకి ఇద్దరు డైరెక్టర్ ఫ్రెండ్స్ మళ్లీ అవకాశాలిచ్చారు. ఒకరు 'పోకిరి'తో ఆమెని స్టార్ హీరోయిన్‌ని చేసిన పూరి జగన్నాథ్ అయితే, మరొకరు ఆమెతో 'జల్సా' చేసిన త్రివిక్రం. రవితేజ హీరోగా జగన్ సంకల్పించిన 'ఇడియట్ 2'లో ఇలియానా హీరోయిన్‌గా ఎంపికైంది. ఇటు జగన్‌తో, అటు రవితేజతో ఆమెకి ఇది మూడో సినిమా కావడం విశేషం. అలాగే అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రం డైరెక్ట్ చేసే సినిమాలోనూ హీరోయిన్‌గా ఇలియానా కన్‌ఫామయ్యింది. నిజానికి ఇందులో తనకి జోడీగా మిస్ బ్యూటిఫుల్ స్కిన్ సమంతా కావాలని అర్జున్ పట్టుబట్టగా, త్రివిక్రం ఇలియానాకి ఓటేసి, అర్జున్‌ని కన్విన్స్ చేశాడనీ ఫిలింనగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా ఏవో అల్లాటప్పా చాన్సులు కాకుండా రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు దొరకడంతో ఇలియానా ఆనందంతో తబ్బిబ్బవుతోంది.

Friday, August 26, 2011

న్యూస్: మహా 'దూకుడు'మీదున్న పాటలు

మహేశ్ సినిమా 'దూకుడు' పాటలు అదరగొడుతున్నాయ్. శ్రీను వైట్ల డైరెక్షన్‌లో తయారైన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు. మహేశ్ సినిమాకి అతను పనిచేయడం ఇదే తొలిసారి. ఆగస్ట్ 18న అఫిషియల్‌గా విడుదలైన ఆడియో అప్పుడు మ్యూజిక్ చార్టుల్లో ముందుకు దూసుకుపోతోంది. ఇందులోని ఆరు పాటల్లో నాలుగు పాటల్ని రామజోగయ్యశాస్త్రి రాయగా, ఓ పాటని విశ్వా, ఇంకో పాటని భాస్కరభట్ల రవికుమార్ రాశారు. ముఖ్యంగా భాస్కరభట్ల రాయగా రంజిత్, దివ్య ఆలపించిన 'ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే' పాట శ్రోతల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. 'దూకుడు' ఆల్బంలో ఇదే నెంబర్ వన్ సాంగ్. ఈ పాటలో దివ్య గొంతులోంచి వచ్చిన 'దేత్తడి దేత్తడి' అనే మాటలు అలరిస్తున్నాయి. దీని తర్వాతి స్థానం టైటిల్ సాంగ్‌ది. "నీ దూకుడూ కాదెవ్వడూ' అంటూ సాగే ఈ పాటని విశ్వా రాయగా శంకర్ మహదేవన్ ఆలపించాడు. మిగతా పాటల్లో రాహుల్ నంబియార్ పాడిన సోలో సాంగ్ 'గురువారం మార్చి ఒకటీ', కార్తీక్, రీటా పాడిన డ్యూయెట్ 'చుల్‌బులీ నా చుల్‌బులీ', కార్తీక్, రామజోగయ్యశాస్త్రి, వర్ధని కలిసి పాడిన 'అదర అదరగొట్టు' పాట బాగున్నాయి. ఎన్.ఎస్. రమ్య, నవీన్ మాధవ్ పాడిన 'పువ్వాం పువ్వాం అంటాడు ఆటో అప్పారావు' పాట ఏమంత ఆకట్టుకునే రీతిలో లేదు. ఆల్బంలో ఇదొక్కటే వీక్ సాంగ్. ఇప్పటివరకు ఒకే రకంగా ట్యూన్స్ ఇస్తూ వస్తున్న తమన్ ఇందులోనూ అదే బాణీని అనుసరించాడు. 'ఇటు రాయే ఇటు రాయే', టైటిల్ సాంగ్ ఇందుకు ఉదాహరణలు. ఏదేమైనా పాటలు హిట్టవడంతో ఇక సినిమా రావడమే తరువాయి. 'పోకిరి' తర్వాత తమ హీరోకి సరైన హిట్టులేకపోవడంతో మహేశ్ ఫాన్స్ యమ ఆకలి మీదున్నారు. సినిమా ఏమాత్రం బాగున్నా పెద్ద హిట్టవడం ఖాయం.

Saturday, August 20, 2011

ప్రివ్యూ: బిజినెస్ మేన్

హీరో మహేశ్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా 'బిజినెస్ మేన్'. వాళ్ల తొలి సినిమా 'పోకిరి' అంతకు మునుపటి బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగరాసి, తెలుగులో తొలిసారిగా 40 కోట్ల రూపాయల కలెక్షన్లని సాధించిన సంగతి తెలిసిందే. 'బిజినెస్ మేన్'ని ఇటీవలి కాలంలో వరుసగా సినిమాలు నిర్మిస్తున్న ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సంస్థ తీస్తోంది. ఆ బేనర్‌లో చేయడం ఇటు మహేశ్‌కీ, అటు జగన్నాథ్‌కీ ఇదే తొలిసారి. డా. వెంకట్ నిర్మాతగా, వి. సురేశ్‌రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మహేశ్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. "ఇంతవరకు నేను డైరెక్ట్ చేసిన అన్ని సినిమాల్లోకి ఇందులో హీరో కేరక్టర్ ద బెస్ట్ అనిపించేలా ఉంటుంది. లవ్ అండ్ యాక్షన్ ప్రధానంగా సబ్జెక్ట్ నడుస్తుంది" అని జగన్నాథ్ చెప్పగా "ఈ కథ విన్నప్పట్నించీ ఎంతో ఎగ్జయిట్ అవుతున్నా. హీరో రోల్ అసాధారణంగా ఉంది. జగన్నాథ్ కాంబినేషన్‌లో అందరూ ఎక్స్‌పెక్ట్ చేసే రేంజిలోనే ఈ సినిమా ఉంటుంది" అని మహేశ్ తెలిపాడు.
2012 సంక్రాంతికి (జనవరి 12న) రిలీజయ్యే ఈ సినిమాకి సంగీతం: ఎస్.ఎస్. తమన్, సినిమాటోగ్రఫీ: శ్యాం కె. నాయుడు, ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్, ఆర్ట్: చిన్నా, ఫైట్స్: విజయ్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

Tuesday, July 26, 2011

న్యూస్: తాప్సీ ఆ సినిమా చేస్తుందా?

ఇలియానా తరహాలోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చాలామంది భావించిన పంజాబీ బ్యూటీ తాప్సీ పన్ను నాలుగు సినిమాల తర్వాత కూడా అలాంటి క్రేజ్‌ని సృష్టించలేక పోయింది. తొలి సినిమా 'ఝుమ్మంది నాదం'లో ఆమెని రాఘవేంద్రరావు చూపించిన తీరు చూసి మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ టాలీవుడ్ అంటూ తీర్మానించేసింది చిత్రసీమ. అయితే 'మిస్టర్ పర్ఫెక్ట్' మినహా ఆమె ఖాతాలో ఇంతదాకా మరో హిట్టు లేదు. ఆ సినిమాలోనూ ఆమెది సెకండ్ హీరోయిన్ రోలే. 'ఝుమ్మంది నాదం'తో పాటు 'వస్తాడు నా రాజు', 'వీర' ఫ్లాపయ్యాయి. ఇలియానా మాదిరిగా తొలి రెండు సినిమాలు 'దేవదాసు', 'పోకిరి' వంటివి తాప్సీకి తగిలుంటే ఆమె కూడా ఈపాటికే యువతరం కలల రాణిగా ఆవిర్భవించి ఉండేదని విశ్లేషకుల అభిప్రాయం. ప్రస్తుతం కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తున్న 'మొగుడు'లో గోపీచంద్ సరసన నటిస్తున్న ఆమె తాజాగా సునీల్ సరసన నటించేందుకు అంగీకరించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మాధవన్, కంగనా రనౌత్ జంటగా బాలీవుడ్‌లో వచ్చి సూపర్‌హిట్టయిన 'తను వెడ్స్ మను'కి ఇది రీమేక్. మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీప్రసాద్ డైరెక్టర్. అయితే ఈ సినిమాలో తాప్సీ నటించడం లేదనే ప్రచారం కూడా జరుగుతోంది. కమెడియన్ అయిన సునీల్ సరసన నటిస్తే టాప్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావని, ఇందుకు 'మర్యాద రామన్న'లో నటించిన సలోని మంచి ఉదాహరణంటూ ఆమె హితులు హెచ్చరించారనీ, అందుకే ఆమె ఆ సినిమా చెయ్యట్లేదనీ వినిపిస్తోంది. తాప్సీ నుంచి మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. నిజానికి తాప్సీ కంటే ముందు ఇద్దరు ముగ్గురు నేటి క్రేజీ హీరోయిన్లని నిర్మాతలు సంప్రదించారు కానీ వారు సునీల్‌తో చేయడానికి విముఖత చూపించారు. ఈ పరిస్థితుల్లో సునీల్ జోడీ తాప్సీనా లేక మరొకరు ఆ స్థానంలోకి వస్తారా?

Saturday, July 23, 2011

న్యూస్: 'ది బిజినెస్ మ్యాన్'కి రంగం సిద్ధం

రెండో బాలీవుడ్ సినిమా 'బుడ్డా.. హో గయా తేరా బాప్' (తొలి సినిమా 'బద్రి'కి రీమేక్ అయిన 'షర్త్') తర్వాత మహేశ్‌తో రెండో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ కాంబినేషన్‌లో తొలిగా వచ్చిన 'పోకిరి' బాక్సాఫీసు వద్ద ఇండస్ట్రీ రికార్డును సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ తెలుగు సినిమా 40 కోట్ల రూపాయలు పైగా వసూలు చేయడం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత రాజమౌళి, రాంచరణ్ కాంబినేషన్ మూవీ 'మగధీర' ఏకంగా దానికి రెట్టింపు వసూళ్లను సాధించి యావద్భారతీయ చిత్రసీమనే అబ్బురపరిచిన సంగతి మనకు తెలుసు. ప్రస్తుతానికి వస్తే మహేశ్‌తో జగన్ తీయబోతున్న 'ది బిజినెస్‌మ్యాన్' బిజినెస్ వర్గాల్లో హాట్ ప్రాజెక్ట్‌గా మారింది. ఆర్.ఆర్. మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'ద గన్స్ డోన్ట్ నీడ్ అగ్రిమెంట్' అనే ట్యాగ్‌లైన్ ఉపయోగిస్తున్నారు. ఇందులో టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తొలిసారిగా మహేశ్‌తో జతకట్టబోతోంది. నిజానికి మొదట ఆ పాత్రకి ఇలియానా, శ్రుతిహాసన్ పేర్లు వినిపించినా, చివరకి కాజల్‌కి ఆ ఛాన్స్ దక్కింది. తమన్ మ్యూజిక్ అందించే ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో మొదలు కాబోతోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందే ఈ మాఫియా బ్యాక్‌డ్రాప్ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. దీనితో పాటు రవితేజతో 'ఇడియట్ 2'ని కూడా తీయబోతున్నాడు జగన్.

Wednesday, July 20, 2011

విశ్లేషణ: మంచి కథకు మంచి నేపథ్యం తోడైతే సూపర్‌హిట్టే!

ఏ కథకైనా నేపథ్యం (బ్యాక్‌డ్రాప్) ముఖ్యం. మంచి కథకు మంచి నేపథ్యం తోడైతే సినిమా మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఒక ప్రాంతాన్ని నేపథ్యంగా హైలైట్ చేస్తూ తెలుగులో తీసిన సినిమాలు బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించిన సందర్భాలు అనేకం. గతంలో కాశ్మీర్, అమెరికా, సింగపూర్ తదితర ప్రాంతాల నేపథ్యంలో వచ్చిన సినిమాలు చెప్పుకోదగ్గ రీతిలో ప్రజాదరణ పొందాయి. ఈ మధ్య కాలంలో చెప్పుకోవాలంటే చిన్న సినిమా అయినా గోదావరి నేపథ్యంలో వంశీ రూపొందించిన 'గోపి గోపిక గోదావరి' పెద్ద మ్యూజికల్ హిట్టయ్యింది. గోపిక అనే లేడీ డాక్టర్ పేదలకు సేవ చేసే ఉద్దేశంతో గోదావరి గ్రామాల్లో పనిచేసే ఓ బోటు హాస్పిటల్లో పనిచేస్తుంటుంది. సెల్‌ఫోన్ ద్వారా పరిచయమైన గోపి అనే ఆర్కెస్ట్రా సింగర్‌ని ప్రేమిస్తుంది. అయితే ఓ యాక్సిడెంట్లో గోపి చనిపోయాడని విని హతాశురాలవుతుంది. చిత్రమేమంటే తలకి దెబ్బ తగిలి గతం మర్చిపోయిన గోపి ఆమె వల్లే కోలుకుని ప్రభుగా చలామణి అవుతాడు. చివరకు ఆ ఇద్దరూ ఎలా ఒక్కటయ్యారన్నది కథ. చక్రి సంగీతం సమకూర్చగా రామజోగయ్యశాస్త్రి రాసిన 'నువ్వక్కడుంటే నేనిక్కడుంటే' పాట ఏ నోట విన్నా వినిపించింది. చక్రి సంగీత మాయాజాలంతో పాటు గోదావరి తీరంలో వంశీ తీసిన సన్నివేశాలన్నీ జనాన్ని ఆకట్టుకోవడంతో 'గో గో గో' చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించింది.
దాని తర్వాత వచ్చిన పెద్ద సినిమా 'మగధీర' ఏ స్థాయి విజయాన్ని పొందిందో మనకు తెలుసు. అంతకు ముందు బాక్సాఫీస్ పరంగా నెంబర్‌వన్ స్థానంలో ఉన్న 'పోకిరి'ని వెనక్కినెట్టి ఏకంగా దానికి దాదాపు రెట్టింపు వసూళ్లతో అదరగొట్టింది. అలాంటి 'మగధీర'లోనూ ఓ ప్రాంతపు నేపథ్యం ఉంది. అది ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఉదయగఢ్ సామ్రాజ్యం. ఆ సామ్రాజం నేపథ్యంలో వచ్చే అన్ని సన్నివేశాలూ (ముఖ్యంగా రాంచరణ్-కాజల్, రాంచరణ్-దేవ్‌గిల్, రాంచరణ్-శ్రీహరి సన్నివేశాలు) ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఉదయఘడ్‌ని రక్షించే కాలభైరవ పాత్రలో రాంచరణ్ బ్రహ్మాండంగా ఆకట్టుకున్నాడు. ఉదయఘడ్‌ని కళా దర్శకుడు ఆనంద్‌సాయి తీర్చిదిద్దిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. రానున్న అరిష్టాన్ని పోగొట్టడానికి రాజకుమారి చేసే కాలభైరవ పూజా సన్నివేశాల చిత్రీకరణ, అక్కడ విలన్లతో హీరో కాలభైరవ పోరాడే తీరు అద్భుతమనిపించాయి.
అంతకుముందు గంగోత్రి, హరిద్వార్ నేపథ్యంలో వచ్చిన అల్లు అర్జున్ తొలి చిత్రం 'గంగోత్రి', చార్మినార్ నేపథ్యంలో వచ్చిన మహేశ్ 'ఒక్కడు', వరంగల్ నేపథ్యంలో వచ్చిన ప్రభాస్ 'వర్షం', కలకత్తా నేపథ్యంలో వచ్చిన చిరంజీవి 'చూడాలని ఉంది', రాయలసీమ నేపథ్యంలో వచ్చిన కొన్ని సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. వీటిలాగే ఘన విజయం పొందిన మరో సినిమా 'సింహాద్రి'. జూనియర్ ఎన్‌టీఆర్ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమాకు రాయలసీమతో పాటు కేరళను నేపథ్యంగా ఎంచుకున్నారు. 'ఇంద్ర'లో కాశీ, 'సింహాద్రి'లో కేరళ నేపథ్యాలు వాటి భారీ విజయాల్లో తమవైన పాత్ర పోషించాయి. 'వర్షం' సినిమా ప్రభాస్‌కు స్టార్‌డంను తీసుకొచ్చిందనేది వాస్తవం. శోభన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథకు నేపథ్యం వరంగల్. హీరో హీరోయిన్ల రొమాన్స్‌కు సాక్షీభూతంగా వరంగల్ నిలుస్తుంది. అంతదాకా వేయిస్తంభాల గుడి, కాకతీయ తోరణాన్ని ఎవరూ చూపించని రీతిలో ఈ సినిమాలో అందంగా చూపించారు.
అయితే కేవలం ఓ ప్రాంతాన్ని హైలైట్ చేస్తూ సినిమా తీసేస్తే కచ్చితంగా హిట్టు దక్కుతుందా? అనే ప్రశ్నకు 'కాదు' అనే జవాబే వస్తుంది. కథకు అనుగుణమైన నేపథ్యం, వాస్తవికంగా ఉండే చిత్రీకరణ మాత్రమే సినిమాను అందంగా తీర్చిదిద్దగలుగుతాయి. లేదంటే కోరి అపజయం తెచ్చుకున్నట్టే. ఉదాహరణకు అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'బద్రినాథ్'ను తీసుకోండి. ఈ సినిమా కథకు నేపథ్యంగా హిమాలయాల్లోని తక్షశిలనీ, అక్కడి బద్రీనాథ్ దేవాలయాన్నీ ఎంచుకున్నారు. అయితే కథలో లోపాలు, గురు (ప్రకాష్‌రాజ్), శిష్య (అల్లు అర్జున్) అనుబంధాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకపోవడం, ఇలాంటి సినిమాలకి అత్యవసరమైన ఎమోషన్‌ని క్యారీ చేయకపోవడం, దర్శకత్వ లోపాలు ఈ సినిమాకి ఆశించిన రీతిలో విజయాన్ని ఇవ్వలేకపోయాయి. అయితే బద్రీనాథ్ దేవాలయం సెట్లో తీసిన సన్నివేశాలు బాగుండటం గమనార్హం.
అలాగే పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన 'తీన్‌మార్' సినిమా కొంతవరకు దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ నేపథ్యంలో నడుస్తుంది. అక్కడ హీరో చెఫ్‌గా పనిచేస్తుంటాడు. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'లవ్ ఆజ్ కల్'కి రీమేక్‌గా వచ్చినప్పటికీ తెలుగు నేటివిటీని మిస్సవడం, స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా లేకపోవడం ఈ సినిమాకి మైనస్సులయ్యాయి. ఇక మహా శక్తిపీఠాల నేపథ్యంతో పాటు రాజస్థాన్, కాశ్మీర్ నేపథ్యంలో వచ్చిన ఎన్‌టీఆర్ సినిమా 'శక్తి' అసహజమైన సన్నివేశాల కారణంగా ఘోర పరాజయం పాలైంది. ఇష్టమొచ్చినట్లు భారీగా ఖర్చుపెట్టేసి, 'మగధీర'ని మించిన సినిమా తీయాలనుకునే యత్నంలో నేల విడిచి సాము చేస్తే ఫలితం ఎలా ఉంటుందో ఈ సినిమా బాక్సాఫీసు ఫలితం మరోసారి స్పష్టం చేసింది. దీన్నిబట్టి మంచి కథకు మంచి నేపథ్యం అనేది మరింత శోభను చేకూర్చిపెడుతుందనే సంగతితో పాటు కథలో దమ్ము లేకపోతే మంచి నేపథ్యం కూడా వృథా అవుతుందనే విషయం అర్థమవుతుంది.
తాజాగా కొన్ని సినిమాలు అమెరికా, మలేషియా, బ్యాంకాక్ వంటి విదేశీ నేపథ్యాలతో తయారవుతున్నాయి. ఓవర్సీస్‌లోని తెలుగువాళ్లని కూడా మెప్పించే ఉద్దేశంతో ఇప్పుడు ఈ తరహా నేపథ్యాలు తెలుగు సినిమాల్లో ఎక్కువవుతున్నాయి. అయితే ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సత్తా వీటికి ఉంటుందా?

Saturday, July 16, 2011

న్యూస్: ఇలియానా అంతేనా?

జూనియర్ సిమ్రాన్‌గా పేరు తెచ్చుకుని అచిర కాలంలోనే టాప్ రేంజికి ఎదిగి, టాలీవుడ్‌లో కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న తొలి తారగా కాంతులీనిన గోవా సుందరి ఇలియానాకు ఇప్పుడు చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం వింతే! ముఖారవిందం కంటే అందమైన నడుముతోటే యువతరాన్ని పడగొట్టేసిన ఆమె తొలి రెండు సినిమాలు 'దేవదాసు', 'పోకిరి' ఒకదాన్ని మించి మరోటి హిట్టవడంతో రాత్రికి రాత్రే క్రేజీ హీరోయిన్ అయిపోయింది. బెల్లంకొండ సురేశ్ నిర్మించిన 'భలే దొంగలు' సినిమాతో కోటి రూపాయలు తీసుకున్న తొలి టాలీవుడ్ హీరోయిన్‌గా ఆమె సంచలనం సృష్టించింది. అయితే 'కిక్' హిట్ తర్వాత ఆమె సినిమాలేవీ బాక్సాఫీసు వద్ద ఆడకపోవడం, రెమ్యూనరేషన్ విషయంలో కిందికి దిగక పోవడం వంటి కారణాలతో నిర్మాతలు ఆమెకంటే ఇతర తారల వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారు. 'రెచ్చిపో', 'సలీం', 'శక్తి' సినిమాలు ఒకదాన్ని మించి మరోటి అట్టర్‌ఫ్లాప్ కావడం, రానా సరసన చేసిన 'నేను నా రాక్షసి' మంచి పేరు తెచ్చినా, బాక్సాఫీసు వద్ద ఫ్లాపవడంతో నిన్నటి దాకా ఆమెని గోల్డెన్ లెగ్ అన్నవాళ్లే ఇవాళ ఐరన్ లెగ్ అనడం ప్రారంభించారు. ఫలితంగా కాజల్ అగర్వాల్ టాప్ హీరోయిన్ రేంజికి ఎదిగిపోయింది. మరోవైపు తమన్నా, తాప్సీ, సమంతా వంటి తారలకు గిరాకీ పెరిగింది. ప్రస్తుతం సౌతిండియా టాప్ డైరెక్టర్ శంకర్ తీస్తున్న తమిళ 'నంబన్' సినిమా మీదే ఆమె ఆశలన్నీ పెట్టుకుంది. ఇది బాలీవుడ్‌లో సూపర్‌హిట్టయిన '3 ఇడియట్స్'కి రీమేక్. ఇందులో ఆమె విజయ్‌కి జోడీగా నటిస్తోంది. ఈ సినిమా ఆడితే మొదట తమిళంలోనూ, తర్వాత తెలుగులోనూ తనకి మళ్లీ మంచి అవకాశాలొస్తాయనేది ఆమె నమ్మకం. మరోవైపు 'బర్ఫీ'తో బాలీవుడ్‌లోనూ అడుగు పెడుతున్న ఆమె, దానితో అక్కడా తనకి గుర్తింపు లభిస్తుందనే ఆశ పెట్టుకుంది. చూద్దాం ఏం జరుగుతుందో..