Thursday, October 1, 2015

Beginning Days: Actress Chandrakala

తొలి రోజుల్లో.. చంద్రకళ


చంద్రకళ తల్లిదండ్రులు ఉడిపికి చెందినవారైనా, ఆమె విశాఖపట్నంలో 1947 డిసెంబర్ 25న జన్మించింది. రెండో యేట నుంచే నటరాజ రామకృష్ణ వద్ద నాట్యంలో శిక్షణ తీసుకుంది. ఐదో యేట నుంచే ప్రదర్శనలివ్వడం మొదలుపెట్టింది. ఆ తర్వాత విఖ్యాత నర్తకి బాలసరస్వతి శిక్షణలో నృత్యశాస్త్రంలోని వివిధ పదరీతులను అభ్యసించి, 1959లో మద్రాసులో అరంగేట్రం ఇచ్చింది. ఓ వైపు నర్తకిగా పేరు మారుమోగిపోతుంటే, మరోవైపు సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. తొలిగా 'శ్రీరామాంజనేయ యుద్ధం'లో యయాతి కుమార్తెగా నటించి చిత్రరంగానికి పరిచయమైంది. 'సతీ సుకన్య' చిత్రంలో బాల యముని పాత్ర పోషించింది. 1962 ప్రాంతంలో హిందీ సినీ నిర్మాత, దర్శకుడు రమేశ్ సైగల్ తాను నిర్మించే 'షోలా ఔర్ షబ్నం' సినిమాలో యంగ్ హీరోయిన్ కేరక్టర్ ఇచ్చారు. బేబీ చంద్రకళ నుంచి కుమారి చంద్రకళగా మారాక కన్నడ చిత్రం 'ఔన్‌గూడు'లో నటించి ఉత్తమ సహాయనటి అవార్డును అందుకుంది. అప్పుడే వెంపటి చిన సత్యం వద్ద కూచిపూడిలో శిక్షణ తీసుకుంది. గోకుల్ ఆర్ట్ థియేటర్స్ నిర్మించిన 'విశాల హృదయాలు' చిత్రంలో నటించి రాణించింది. 'ఆడపడుచు' సినిమా ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. అదివరకు చేసిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే, ఈ సినిమా మరో ఎత్తు. ఆ సినిమా విడుదలయ్యాక ఆమెకు ఫ్యాన్ మెయిల్ విపరీతంగా పెరిగింది. ఎన్ఏటీ వారి 'వరకట్నం' చిత్రం ఆమెకు మరింత పేరుతెచ్చి, మరో పది సినిమా అవకాశాలను తీసుకొచ్చింది. 'అన్నదమ్ములు', 'ప్రతీకారం', 'ఆత్మీయులు', 'మాతృదేవత' వంటి చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించింది. కన్నడ, తమిళ, మరాఠీ సినిమాల్లోనూ ఆమె నటించింది. ఓ వైపు నటిస్తూనే, మరోవైపు చెన్నైలోని ఎస్.ఐ.ఇ.టి. విమెన్స్ కాలేజీ విద్యార్థినిగా ఆమె బి.ఎ. పూర్తి చేయడం విశేషం.

No comments: