తొలి రోజుల్లో.. విజయనిర్మల
పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు నిర్మల. తర్వాత నీరజగా పేరు మారింది. తిరిగి సినిమాల్లో విజయనిర్మలగా రూపాంతరం చెందింది. తెలుగు ప్రేక్షకులు తమ అభిమాన తారగా ఆమెకు సముచిత స్థానాన్ని ఇచ్చారు. విజయనిర్మల తండ్రికి మద్రాసులో ఉద్యోగం. ఆమె మద్రాసులోనే పుట్టి, అక్కడే పెరిగింది. చిన్నతనంలోనే నాటకాల్లో నటించాలని ఆమెకు కోరిక. దానికి పెద్దల ఆమోద ముద్ర లభించక ముందే తిరువెంకట మొదలియార్ వద్ద నృత్యంలో శిక్షణ తీసుకుంది. చిన్నతనంలోనే ఆమె ఇచ్చిన ఓ నృత్య ప్రదర్శనను చూసి, ఓ తమిళ చిత్ర నిర్మాత తన 'మత్స్యరేఖ' అనే చిత్రంలో చిన్నప్పటి హీరో వేషం ఇచ్చారు. ఆ సినిమాలో ప్రసిద్ధ నటి ఎస్. వరలక్ష్మి చెల్లెలు నిర్మల, చిన్న హీరో విజయనిర్మల సరసన హీరోయిన్‌గా నటించడం విశేషం. ఆ తర్వాత 'సింగారి' అనే ఇంకో తమిళ చిత్రంలో చిన్నప్పటి పద్మినిగా కనిపించింది విజయనిర్మల. 'మాంగల్యం' అనే తమిళ చిత్రంలో నటించాక, ఎన్.ఎ.టి. వారి 'పాండురంగ మహత్యం' చిత్రంలో చిన్నప్పటి పాండురంగనిగా నటించడం ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలా తన మొదటి తమిళ, తెలుగు చిత్రాల్లో ఆమె మగ పాత్రలు ధరించడం విశేషం.తల్లిదండ్రులు పెట్టిన నిర్మల పేరును బి.ఎన్. రెడ్డి 'రంగులరాట్నం'లో నీరజగా మార్చారు. ఆ పేరుతోటే శ్రీకాంత్ పిక్చర్స్ వారి 'పిన్ని' చిత్రంలోనూ నటించింది. కానీ విజయా సంస్థ 'షావుకారు' చిత్రాన్ని 1965లో 'ఎంగవీటు పెణ్' పేరుతో నిర్మిస్తూ, అందులో కథానాయిక పాత్రకు నిర్మలను తీసుకోవడంతో, ఆ సినిమాతో ఆమె 'విజయ'నిర్మలగా స్థిరపడిపోయింది. ఆ పాత్ర ద్వారా తమిళ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. ఆ తర్వాత వచ్చిన 'సాక్షి', 'భామా విజయం', 'ఉపాయంలో అపాయం' చిత్రాలు విజయనిర్మల స్థాయిని మరో మెట్టు ఎక్కించాయి. 'పూలరంగడు', 'నడమంత్రపు సిరి', 'బంగారు పిచుక', 'బంగారు గాజులు', 'లవ్ ఇన్ ఆంధ్రా' చిత్రాలు ఆమె నటనకు మెరుగులు దిద్దాయి.
తెలుగు, తమిళ చిత్రాల్లో కథానాయిక పాత్రలను ధరిస్తూనే మలయాళ చిత్రాల్లోనూ నాయికగా నటించింది విజయనిర్మల. 'భార్గవి నిలయం' చిత్రంలో నటనకు గాను అవార్డును కూడా అందుకుంది. 'కల్యాణ ఫొటో', 'కల్యాణ రాత్రయిళ్', 'పూదక్కణ్ణి', 'కండదిల్లా', 'ఉద్యోగస్తు', 'నిశాగంధి', 'కళిప్పావై', 'కరుత్తా పౌర్ణమి' వంటి మలయాళ చిత్రాల్లో నటించింది. తెలుగు చిత్రాలలో విరివిగా అవకాశాలు రావడంతో తమిళ, మలయాళ చిత్రాలను తగ్గించుకుంది. అయినా తమిళ చిత్రం 'పణమా పాశమా' సినిమా విజయఢంకా మోగించడంతో అక్కడ విజయనిర్మల పేరు మారుమోగిపోయింది. ఆ సినిమాతో 'అలేక్' అనే ముద్దుపేరు కూడా సంపాదించింది. తెలుగులో 'ముహూర్తబలం', 'బొమ్మలు చెప్పిన కథ', 'ఆత్మీయులు', 'లంకెబిందెలు', 'విచిత్ర కుటుంబం', 'ప్రేమలు పెళ్లిళ్లు' చిత్రాలు మంచిపేరు తెచ్చాయి.
మలయాళ చిత్రం 'భార్గవి నిలయం'లో నటించే ముందే ఆమెకు వివాహమైంది. ఆమె భర్త షిప్ డిజైనింగ్ ఇంజినీర్ (తర్వాత కాలంలో హీరో కృష్ణతో ఆమెకు ద్వితీయ వివాహం జరగడం వేరే సంగతి). వారికి నరేశ్ అనే కొడుకు పుట్టాడు. తొలి సినిమా 'మత్స్యరేఖ'లో నటించేప్పుడే ఆమెకు మరచిపోలేని సంఘటన ఎదురైంది. అందులో చిన్నతనంలో హీరోయిన్‌ను హీరో ఉయ్యాలలూపే సీన్ తీస్తున్నారు. హీరోగా నటిస్తోంది విజయనిర్మల. హీరోయిన్‌ను బలంగా ఊపి పక్కకు తప్పుకోమని డైరెక్టర్ చెప్పాడు. సరేనని బలంగా ఉయ్యాల ఊపాక, పక్కకు తప్పుకోవడం మరిచిపోయి అలాగే నిల్చుంది విజయనిర్మల. ఇంకేముంది, ఉయ్యాల అదే వేగంతో వెనక్కివచ్చి, ఆమె తలకు బలంగా కొట్టుకుంది. ఆమైనే ఆమె కిందపడిపోయింది. వెంటనే అక్కడున్నవాళ్లు కంగారుగా వచ్చి ఆమెను పైకి లేవనెత్తారు. అప్పుడే సినిమా షూటింగులంటే ఎన్ని కష్టాలుంటాయో అర్థమైంది విజయనిర్మలకు.
No comments:
Post a Comment