దర్శకుడు తెలుసుకోవాల్సిన ప్రాథమిక విషయం
కళల్లో సినిమాకళకున్న పాపులారిటీ మరిదేనికీ లేదు. శిల్పకళలో చెక్కడానికి ఎంత వరకు అవకాశం ఉందో అంతవరకే ప్రతిభను వ్యక్తీకరించడానికి వీలవుతుంది. సంగీతానికి నాదమే ఆధారం. చిత్రలేఖనంలో రంగులు, రేఖలతోనే చిత్రకారుడు ప్రతిభను చూపించగలడు. భాష మీదే ఆధారపడి రచన చేస్తాడు రచయిత. నాటకం కొంతవరకు సినిమాకు దగ్గరగా ఉన్నా, ప్రధానంగా అది సంభాషణలు, నటుల ప్రతిభ మీదే ఆధారపడుతుంది. నాటకాన్ని అచ్చులో చదువుకున్నా మొత్తం అర్థమవుతుంది. సినిమా కథనం అలా కాదు. సినిమాలో సంభాషణలు ఒక భాగం మాత్రమే. నాటకానికి లాగా సినిమాకి రచయిత కేవలం స్రష్ట అయితే సరిపోదు. శబ్దాలతో, సంభాషణలతో, లైటింగ్‌తో, నటుల అభినయంతో, కళాకుశలంతో, చాయాగ్రహణంతో సినిమాని సర్వాంగ సుందరంగా సినిమా కథను మలచాల్సినవాడు దర్శకుడు. 24 శాఖలను సమన్వయపరచి, కళాత్మకంగా సినిమాని రూపొందించడం దర్శకుని బాధ్యత. అన్ని శాఖలకు సంబంధించిన అవగాహన, పాత్రల చిత్రణ, సన్నివేశాల కల్పన కరతలామలకమైతేనే ఏ దర్శకుడైనా రాణిస్తాడు.వీటిలో ప్రతి ఒక్కటీ కథను వ్యక్తం చేస్తూనే ఉంటుంది. అందువల్ల వీటిని సమపాళ్లలో మేళవించడం దర్శకునికి కత్తిమీద సాము తరహా వ్యవహారం. సంభాషణలు, సందర్భం, నటీనటుల ఆహార్యం, పాత్రల ధోరణి విషయాల్లో ఔచిత్య భంగం కాకుండా జాగ్రత్తపడాలి. ఉదాహరణకు మధ్యతరగతి వాడి కథ చెబుతూ అతడి ఇంటిని సంపన్నవంతంగా, అతడి దుస్తులు ఖరీదైనవిగా చూపించడం పరస్పర విరుద్ధ విషయం. అవన్నీ అతడి ఊహల్లో భాగంగా చూపిస్తే అది సాత్విక గుణం సంపాదించుకొని కథకు ప్రయోజనకారిగా మారుతుంది. దాన్నే మనం కథన శిల్పం అంటాం. తారతమ్య ప్రదర్శనకూ, విరోధభావ ప్రదర్శనకూ మధ్య ఉండే తేడాని దర్శకుడు గ్రహించాలి. పేదింటి యువకుడు సంపన్నురాలైన ప్రేయసి ఇంటికి టిప్‌టాప్‌గా తయారై వస్తే అది విరోధభావ ప్రకటన. తన ఆర్థిక స్థితికి తగ్గ బట్టలతోనే అతడు వస్తే, ఆ తారతమ్యం వల్ల అతడి పేదరికాన్ని దుస్తులతోనే ప్రదర్శించేందుకు దర్శకుడికి వీలు దొరికినట్లవుతుంది. దీనిని దృశ్య సమ్మేళనం అంటాం.
సాధారణ దర్శకుడికీ, ప్రతిభావంతుడైన దర్శకుడికీ తేడాని సులువుగా పట్టేయవచ్చు. సాయంత్రం వేళ మించినా స్కూలుకు వెళ్లిన కూతురు ఇంటికి రాకపోతే తల్లి ఆదుర్దాతో ఇంటి బయట గడప మీద నిల్చుని దగ్గర్లో కూతురు ఎక్కడైనా ఉందేమో అని పేరుపెట్టి కేక వేస్తుంది. ఈ సన్నివేశాన్ని సాధారణ దర్శకుడైతే కూతురు రాకపోవడం వల్ల తల్లి ఆదుర్దాతో ఏడుస్తున్నట్లు చూపించి, తర్వాత ఖాళీ గడప చూపిస్తాడు. అదే ప్రతిభావంతుడైన దర్శకుడైతే, తల్లిని సన్నివేశంలో కనిపించనీయకుండా, ఆమె ఆదుర్దాతో కూతుర్ని పిలిచినట్లు చూపించి, ఖాళీ గడప చూపిస్తాడు. దీనివల్ల అక్కడ రావాల్సిన ఎమోషన్ వచ్చేస్తుంది. ఇక్కడ దృశ్యం - ఖాళీ గడప, శబ్దం - తల్లి కేక. ఈ రెండింటి సమ్మేళనంతోనే తల్లి ఆదుర్దానంతా చెప్పగలిగాడు దర్శకుడు. నిశ్శబ్దం అంటే చప్పుడు లేకపోవడమే. కానీ కేవలం చప్పుడు లేనంత మాత్రాన నిశ్శబ్దం పూర్తిగా అవగాహన కాదు. ఉదాహరణకు ఒక తోటలో ఆకులు కూడా కదలకుండా ఉన్న చెట్లు, మూసి ఉన్న ఒక ఇంటి కిటికీలు, నిద్రపోతున్న మనుషులను ఎలాంటి చప్పుడూ లేకుండా చూపి, తర్వాత ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక తుపాకీ పేలిన శబ్దం వినిపిస్తే, అప్పుటి దాకా ఉన్న నిశ్శబ్దం అప్పుడు మన అనుభవంలోకి వస్తుంది.
ఉన్న పరిమితుల్లోనే కథను వివరంగా చెప్పేందుకు దర్శకుడు ఎప్పటికప్పుడు జాగ్రత్తపడాల్సి వస్తుంది. సంభాషణలు, సంగీతం, దృశ్యం, నటీనటుల హావభావాలు.. వీటితో ఏ సందర్భంలో కథను ఆసక్తికరంగా చెప్పగలుగుతాడో ఎప్పటికప్పుడు దర్శకుడు చెక్ చేసుకుంటూనే ఉండాలి. నిజానికి ఒక సన్నివేశంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఒక్కటే ఉంటుంది. తిరిగి అందులోనే సందర్భం చెడకుండా ఇతర చిన్న విషయాల్ని కూడా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండాలి.
No comments:
Post a Comment