హిందీ 'దేవదాస్' అంటే సైగల్!
గోదావరి ఆవకాయ, గుంటూరు గోంగూర, శ్రీశ్రీ కవిత్వం, పొందూరు ఖద్దరు ఎంత ఫేమస్సో, సైగల్ పాట అంత ఫేమస్సు. 1935 నుండి 1945 వరకు పదేళ్ల కాలం భారత వెండితెరపై సైగల్ రాజ్యమేలాడు. 'సినిమా పాటనా?' అని ఈసడించుకొనే వాళ్లు సైతం ఘంటసాల పాట వింటే ఎట్లా మైమరచిపోతారో, ఆ రోజుల్లో సైగల్ పాట కూడా అంతే గొప్పగా పేరు గడించింది. ఈ రోజుల్లోనూ సైగల్ పాట వినిపిస్తే రెండు చెవులప్పగించేవాళ్లు ఎందరో. సైగల్ అంటే పాట. పాటంటే సైగల్. భాషకూ, భావానికీ ఉన్న అవినాభావ సంబంధం అందరికీ తెలిసిందే. గానానికీ, భావానికీ కూడా అదేవిధమైన బాంధవ్యం ఉంది. సైగల్‌కు మించి దాన్ని ప్రదర్శించిన మొనగాడు లేడంటే అతిశయోక్తి కాదు. నటుల్లో సైగల్‌ను మించినవాళ్లు ఎందరో ఉన్నారు. అయినప్పటికీ సైగల్ 'దేవదాస్' ప్రత్యేకతే వేరు. తర్వాత దిలీప్ కుమార్, తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు ఆ పాత్రలో రాణించారు. దిలీప్‌ను మించి అక్కినేని 'దేవదాస్'గా గొప్ప పేరు సంపాదించిన మాట నిజం. అయితే శరశ్చంద్రుని 'దేవదాస్'ను అత్యంత సహజంగా ప్రదర్శించింది సైగల్ అని నమ్మేవాళ్లు ఎక్కువే. సైగల్ పాట శాస్త్ర సంగీతమా, భావ సంగీతమా అనే చర్చకు తావేలేదు. సంగీతానికి పరాకాష్ఠ ఆయన స్వరమే. కటిక చీకట్లో పండు వెన్నెల కురిపించే ప్రభావం, యావత్ జీవరాశినీ ఏడిపించగల శక్తీ ఆయన పాటకున్న మహత్తు. సైగల్‌కున్న కంఠం ఉన్న వాళ్లు చాలామందే ఉన్నారు. కానీ ఆయనలా దాన్ని ఉపయోగించుకున్నవాళ్లు ఎంతమంది? చుక్కలెన్ని ఉన్నా చంద్రుడొక్కడే. గాయకులెందరున్నా సాటిలేని మహా గాయకుడు సైగల్ ఒక్కడే. అమృతప్రాయమైన తన పాటలో సైగల్ ఎప్పటికీ జీవించే ఉంటాడు.
No comments:
Post a Comment