
నలభై ఏళ్లపాటు అనేక సినిమాల్లో నటించినా తనకు నిజంగా తృప్తినిచ్చింది నాటకరంగమేనని మరణించకముందు అనేకమార్లు చెప్పిన నటుడు నాగభూషణం 'రక్తకన్నీరు' నాటకాన్ని 5,432 సార్లు ప్రదర్శించారు. నాటకరంగ చరిత్రలోనే ఇదొక సంచలనాత్మక సంఘటన. అందుకే ఆయన 'రక్తకన్నీరు' నాగభూషణం అయ్యారు. ఈ నాటకం చూసేందుకు పల్లెజనం ఎడ్లబండ్లు కట్టుకుని వచ్చేవారు. 'రక్తే కన్నీర్' పేరుతో తమిళంలో వేసిన ఓ నాటిక ప్రదర్శనను మద్రాసులో చూసిన నాగభూషణం దాన్ని మన తెలుగు సంప్రదాయానికి అనుగుణంగా ప్రఖ్యాత రచయిత పాలగుమ్మి పద్మరాజుతో తిరిగి రాయించారు. అదే 'రక్తకన్నీరు' నాటకంగా ఒక పెద్ద చరిత్రనే సృష్టించింది. ఇందులోని ప్రధాన పాత్రలో నాగభూషణం నటనా చాతుర్యం అనన్యసామాన్యం. 1948లో ప్రారంభించిన రక్తకన్నీరు నాటక ప్రదర్శనను1986 దాకా గ్రామ గ్రామన ప్రదర్శించారు. ఆ రోజుల్లో ఆ నాటకాన్ని చూడనివాళ్లు, నాగభూషణం నటనా కౌశలాన్ని మెచ్చుకోనివాళ్లు లేరు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ప్రతి నెలా మొదటివారంలో రాష్ట్రంలో, లేదంటే దేశంలో ఏదో ఒకచోట రక్తకన్నీరు నాటకాన్ని ప్రదర్సిస్తూ వచ్చారు నాగభూషణం. తెలుగు నాటకరంగాన్ని ఇంతగా ప్రభావితం చేసిన మరో నాటకం లేదన్నది నిర్వివాదం.
No comments:
Post a Comment