Thursday, May 24, 2012

టర్నింగ్ పాయింట్: రమాప్రభ


నేను సినిమాల్లోకి వచ్చి 45 సంవత్సరాలు. మాది మధ్య తరగతి కుటుంబం. నేను ఊటీ, చెన్నైలో పెరిగాను. మా పిన్ని వాళ్లతో ఉండటం వల్ల వాళ్లతో పాటు తిరిగాను. దాంతో నా చదువు మధ్యలోనే ఆగిపోయింది. మా బాబాయి ఆకస్మిక మరణంతో మా కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. దాంతో బతకడం కోసం నేను సినిమాల్లోకి వచ్చా. క్లాసికల్ డాన్సర్‌గా స్టేజీ మీద నేనిచ్చిన ఓ ప్రదర్శన చూసిన డైరెక్టర్ ప్రత్యగాత్మ తన 'చిలకా కోరింక' (1966) సినిమాలో హీరో కృష్ణంరాజు చెల్లెలిగా చేసే ఛాన్స్ ఇచ్చారు. 
అందులో నేను పద్మనాభం సరసన చేశా. అప్పటికే గొప్ప కమెడియన్ అయిన ఆయన నన్ను తన జోడీగా ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు చెప్పుకోకుండా ఉండలేను. అప్పట్లో ఆయనా, గీతాంజలి హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. నిజానికి పద్మనాభం నన్ను బాగా ప్రోత్సహించారు. ఆ తర్వాత నేనెక్కువగా రాజబాబు సరసన నటించాను. చలం, రమకృష్ణ, శోభన్ బాబు, కృష్ణ వంటి ఎంతోమంది హీరోల సినిమాల్లో చేసిన నేను ఒక్క రాజబాబుతోటే 100 సినిమాల దాకా చేశా. తను నాకు మంచి స్నేహితుడు.
నా పరిమితులేమిటో నాకు తెలుసు. నా ముఖం గానీ, నా ఫ్రేంవర్క్ గానీ గ్లామర్‌ని కురిపించలేవనీ, అందువల్ల హీరోయిన్‌గా నేను పనికిరాననీ తెలుసు. అందుకే కమెడియన్ల సరసనా, కేరక్టర్ ఆర్టిస్టుగా సెటిలయ్యా. దాంతో భిన్నమైన కేరక్టర్లు చేయగలిగా. ఇన్నేళ్లపాటు ఫీల్డులో ఉండగలిగా.

No comments: