Friday, May 25, 2012

నటుణ్ణి కావడం కంటే వేరే లక్ష్యాలు లేవు

"యాక్టర్ కావాలనేది నా యాంబిషన్. అయ్యాను. యాక్టర్ కాకపోయుంటే అవడానికి ప్రయత్నిస్తూ ఉండేవాణ్ణి. అంతకుమించి నేను ప్రత్యేకంగా వేరే లక్ష్యం ఏమీ పెట్టుకోలేదు'' అని చెప్పారు హీరో రామ్. తమన్నా జంటగా ఆయన నటిస్తున్న 'ఎందుకంటే ప్రేమంట!' చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో శ్రీ స్రవంతీ మూవీస్ పతాకంపై రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి  రామ్ చెప్పిన సంగతులు ఆయన మాటల్లోనే...
నా కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫిల్మ్ 'ఎందుకంటే ప్రేమంట!'. ఇదే సినిమాతో తమిళంలో పరిచయం కాబోతున్నా. ఏక కాలంలో రెండు భాషల్లో ఈ సినిమా చేశాం. తమిళ వెర్షన్ పేరు 'ఏన్ ఎండ్రాళ్ కాదల్ ఎన్బేన్'. ఇది తమిళంలో నేను నటించిన తొలి చిత్రం. ప్రేమ అనేది యూనివర్సల్ ప్లాట్. తెలుగు, తమిళ నేటివిటీకి సంబంధించిన చిన్న చిన్న మార్పులు తప్పితే ఈ రెండు సినిమాలు ఒకటే. తమిళంలో నేనే డబ్బింగ్ చెప్పా. చెన్నైలోనే పెరిగా కాబట్టి తెలుగుతో పాటు తమిళం కూడా నాకు బాగా వచ్చు. కథే బలం కథే ఈ సినిమాకి ప్రధాన బలం. ఓ అమ్మాయి ప్రేమలో పడిన అబ్బాయి ఆమె గురించి ఎంత స్థాయికి వెళతాడు, ఏం చేస్తాడనేది కథ. యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ. ఫస్టాఫ్ స్విట్జర్లాండ్, పారిస్‌లోనూ, సెకండాఫ్ హైదరాబాద్‌లోనూ కథ నడుస్తుంది. పాటలు చాలా బాగా వచ్చాయి. 'నీ చూపులే' పాట సినిమాకి ప్రత్యేకాకర్షణ. సినిమా అంతా విజువల్ ఫీస్ట్.
సమాన పాత్రలు
కరుణాకరన్ లవ్ స్టోరీస్ బాగా తీస్తారు. లవ్ స్టోరీ అంటే హీరో హీరోయిన్లు ఇద్దరికీ సమాన పాత్రలు ఉంటాయి. అంటే తమన్నా నాతో సమానమైన పాత్ర చేసింది. ఆమె ఎలాంటి నటో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పనిలేదు. ఇందులో నేను చేసింది నా వయసుకి సంబంధించిన పాత్రే. నన్ను ఇప్పటివరకూ ఎవరూ చూపించని విధంగా చూపించాడు దర్శకుడు. ఈ పాత్ర చేయడం కష్టంగానూ అనిపించింది, అదేవిధంగా ఉద్వేగంగానూ అనిపించింది. రిషి ('ఎ ఫిల్మ్ బై అరవింద్' ఫేమ్) మెయిన్ విలన్‌గా నటిస్తే, రచయిత కోన వెంకట్ మరో విలన్ కేరక్టర్ చేశారు.
బాలీవుడ్ ఆలోచన లేదు
సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఒకటి, భాస్కర్ డైరెక్షన్‌లో ఒకటి చేస్తున్నా. ప్రచారంలోకి వచ్చినట్లు శ్రీనివాస్‌తో నేను చేస్తోంది 'కందిరీగ 2' కాదు. కొత్త కథ. ఇంకా హీరోయిన్‌ని ఎంపిక చేయలేదు. భాస్కర్‌తో చేస్తున్నది ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉండే లవ్ స్టోరీ. ఇందులో కంప్లీట్ డిఫరెంట్ కేరక్టర్ చేస్తున్నా. ఈ సినిమా ద్వారా శుభా ఫుటేల్ హీరోయిన్‌గా పరిచయమవుతోంది. 'రెడీ' తర్వాత బాలీవుడ్ అవకాశాలు వచ్చాయి. అయితే అక్కడికి వెళ్లాలనే ఆలోచన ఇప్పటివరకూ కలగలేదు.

No comments: