Thursday, February 17, 2011

కథ: మిలట్రీ నరసింహులు (రెండో భాగం)

పదెకరాల తోట. అక్కడక్కడా జీడిమామిడి చెట్లు కూడా ఉన్నాయి లోపల. వాటి కొమ్మలు నేలకి సమాంతరంగా, దగ్గరగా ఉండటంతో పిల్లలు వాటి కొమ్మల మీద ఆడుకుంటున్నారు చిలకల్లా, సీతాకోక చిలకల్లా. ఫిబ్రవరి తొలి రోజులు కావటాన మామిడిచెట్లు అప్పుడే పచ్చటి పూతతో నిగనిగలాడుతున్నాయి. అక్కడక్కడా పిందెలు వేస్తున్నాయి. ఆ పిందెల్ని కోయకుండా ఆడుకోమన్నాడు తోటమాలి.
పిల్లలు కోతికొమ్మచ్చి ఆడుతుంటే తనూ పిల్లాడిలా మారిపోయి వాళ్లతో ఆడాడు నరసింహులు. పిల్లలు మామిడి పిందెలు కోయబోతుంటే తోటమాలి రాక్షసుడనీ, చూశాడంటే మింగేస్తాడనీ భయపెట్టాడు.
పిల్లలు కథ చెప్పమని మారాం చేశారు. విశాలమైన పెద్ద మామిడి చెట్టు కింద నేల శుభ్రంచేసి, పిల్లలకి 'పాతాళ భైరవి' కథ చెప్పాడు నరసింహులు. కజ్జికాయలు, మినమ్ముద్దలు తింటా ఆ కథలో నాయకుడైన తోటరాముడు చేసే సాహసాల్నీ, నేపాళ మాంత్రికుణ్ణి అతడు ఎదుర్కొనే వైనాన్నీ ఆశ్చర్యపోతూ విన్నారు పిల్లలు. కథవిని, కాస్సేపు తాము స్కూల్లో చేసిన సాహసాల్ని పిల్లలు కబుర్లుగా చెబుతుంటే నరసింహులు నవ్వుతా విన్నాడు.
ఆ తర్వాత 'డిప్పాట' ఆడతామని పిల్లలు గోలపెట్టారు. అప్పటికే సూర్యుడు కిందికి పోతున్నాడు. "ఇంక చాలు పిల్లలూ. చీకటి పడబోతోంది. ఇంటికాడ మీ అమ్మానాన్నలు ఎదురు చూస్తుంటారు. కావాల్నంటే ఇంకోసారి వొద్దురుగానీలే" అని చెప్పాడు నరసింహులు, సముదాయింపుగా.
"ఒక్క పది నిమిషాలే తాతా. ఆడుకుని యెళ్దాం" అన్నారు పిల్లలు. సరేననక తప్పలేదు నరసింహులుకి. పిల్లలు డిప్పాట ఆడుతుంటే చుట్ట వెలిగించి తోటలో తిరుగుతున్నాడు. ఒకచోట దొరువు కనిపిస్తే దానిలోకి దిగాడు. చల్లగా వున్నాయి నీళ్లు. చుట్ట ఆర్పి మొహం కడుక్కుంటున్నాడు. అతడు నిల్చున్నచోట పాచిపట్టి ఉంది. అతడు చూసుకోలేదు. సర్రున జారి దొరువులో పడిపోయాడు. రెండు అడుగుల లోతుకంటే ఎక్కువ లేవు నీళ్లు. అయినా నడుం పట్టేసినట్లయ్యింది. బట్టలన్నీ తడిసిపోయాయి. నొప్పి పెడుతుంటే నడుం పట్టుకుని వొంగిపోయి, నెమ్మదిగా దొరువులోంచి బయటకు వొస్తున్నాడు. అప్పుడే డిప్పాటలో దొంగ పాత్ర పోషిస్తున్న ఏడేళ్ల పాప మిగతా వాళ్లని కనిపెట్టడం కోసం అటేపువొచ్చింది. దొరువులోంచి మెల్లమెల్లగా నల్లటి ఆకారం పైకి వొస్తుండటం చూసింది ఆ పాప. తల్లోంచి నీళ్లుకారుతూ, బవిరిగడ్డమేసుకుని, ఒక కన్ను దాదాపు మూసుకుపోయి, వికృతంగా కనిపించిన ఆ ఆకారాన్ని చూసి దడుసుకుంది. దెయ్యమో, 'పాతాళ భైరవి'లోని నేపాళ మాంత్రికుడో వొచ్చాడనుకుంది. భయంతో నోరు తెరచి, అట్లానే వెనక్కి విరుచుకుపడిపోయింది పాప.
నరసింహులు చూశాడు. ఆ అమ్మాయి ఎందుకలా పడిపోయిందో అర్థంకాలేదు. ఆందోళనగా పాప దగ్గరికెళ్లి "పాపా.. పాపా" అని కేకవేశాడు, కుదుపుతా. పాప ఉలకలేదు, పలకలేదు. దాంతో పాప గుండెమీద చెవిపెట్టాడు. బలహీనంగా కొట్టుకుంటోంది. 'అమ్మయ్య' అనుకుని తలపైకెత్తాడు. గుండె గుభేల్మంది. ఎప్పుడు వొచ్చారో మిగతా పిల్లలంతా ఎదురుగా నిల్చొని, భయంభయంగా అతడి వొంకా, కింద ఉన్న పాప వొంకా చూస్తున్నారు. పిడచకట్టుకుపొయ్యింది నరసింహులు నాలుక. సరిగ్గా అప్పుడే తోటమాలి వొచ్చాడు అక్కడకి.
"నేనేం చెయ్యలేదు. ఎందుకో పాప ఉన్నట్టుండి యెనక్కి యిరుచుకుని పడిపోయింది" అన్నాడు నరసింహులు, బలహీనమైన గొంతుతో.
***
ఆసామి ఇంట్లో ఆ రాత్రి వొకటే గొల్లున ఏడ్పులు.
"మేం చూసేసరికి పాపమీద పడుకుని ఉన్నాడు తాతయ్య" అని చెప్పారు పిల్లలు, వాళ్లు చూసింది అదే కాబట్టి.
"నువ్వు మనిషివా, పశువ్వా. పసిపాపని పట్టుకుని.." అని శాపనార్థాలు పెట్టారు ఆడోళ్లు. అతడి మొహాన ఉమ్మేశారు. ఆసామి, అతని ఇద్దరు తమ్ముళ్లు పిడికిళ్లు బిగించి నరసింహుల్ని ఎక్కడపడితే అక్కడ కొట్టారు. నరసింహులు మొహం పచ్చడైంది. నోరు, ముక్కూ కలిసిపోయాయి, నెత్తురు కారుతూ. నరసింహుల్ని ఇంటిముందున్న వేపచెట్టుకి కట్టేశారు.
"నిన్ను ఊరికే వొదిలిపెట్టకూడదురా పశువా. అన్నెంపున్నెం ఎరగని పసిదాని మీద అఘాయిత్యం చేస్తావా ముసలి కుక్కా. నీకు ఉచ్ఛం నీచం తెలీదంట్రా దొంగనా కొడకా. నువ్వు బతక్కూడదురా" అంటా కర్రలతో మళ్లీ చావబాదారు.
ఈ మధ్యలో నరసింహులు నోరెత్తడానికి లేకపోయింది. తనేమిటి? పాప మీద అఘాయిత్యం చేయడమేమిటి? ఈ నిందతో అతని మెదడు మొద్దుబారిపోయింది. ఒళ్లంతా నెత్తురోడుతున్నా అతను అరవలేదు. ఏడవలేదు. విషయం తెలిసి పోలీసులొచ్చారు. నరసింహుల్ని పట్టుకుపోయారు. వొళ్లంతా పచ్చిపుండై పోలీస్ స్టేషన్లో జీవచ్ఛవంలా పడివున్నాడు. రెండ్రోజుల తర్వాత రాత్రివేళ "ఇక నువ్వెళ్లొచ్చు పెద్దాయనా" అన్నారు పోలీసులు అతని విడిచిపెట్టేస్తా. నరసింహులుకి ఏమీ అర్థంకాలా. జైల్లోపెట్టకుండా తనని ఎందుకు వొదిలేస్తున్నట్లు? అదే అడిగాడు.
"ఆ పాప బతికింది. తనని నువ్వేమీ చెయ్యలేదని చెప్పిందిలే" చెప్పారు పోలీసులు.
అప్పుడు తెలిసింది నొప్పి. వొళ్లంతా భరించలేని నొప్పి. ఆ చీకట్లో పరుగుపరుగున ఇంటికొచ్చాడు నరసింహులు. యానాదమ్మ ఒళ్లో తలపెట్టుకుని యెక్కెక్కి ఏడ్చాడు. అసలే ఆమె జబ్బు మనిషి. రెండు రోజుల్నించీ ఆమెకి తిండి లేదు. మొగుడి మీద బెంగతో. నరసింహులు ఎలాంటివాడో ఆమెకి తెలుసుకదా! ఈ వయసులో అతని మీద పడ్డ అపవాదు, పోలీసులు తీసుకుపొయ్యారన్న బాధ ఆమెని కుంగతీశాయి. నరసింహులుతో పాటు ఆమె కూడా ఏడ్చింది.
తెల్లారింది. రాత్రికి రాత్రే నరసింహులు ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికో వెళ్లిపోయాడని అంతా అనుకున్నారు. అక్కడ మాయమైన మనిషి పందిళ్లపల్లిలో తేలాడు. అదీ ఊరికి దూరంగా. ఇరవై ఏళ్లయ్యింది ఇక్కడికొచ్చి. ఇప్పుడు నరసింహులుకి డెబ్భై రెండేళ్లు. అయినా తొంభై ఏళ్ల వాడిలా కనిపిస్తున్నాడు. ఆర్మీనుంచి పెన్షను రావడం పర్చూరు నుంచి వొచ్చేశాక ఆగిపోయింది.
ఇరవై ఏళ్ల క్రితం జీవితంలో ఎదురైన భయానక అనుభవం అతణ్ణి మానసికంగా, శారీరకంగా కుంగదీసింది. దాంతో డ్రైవరుగానే కాదు వాచ్‌మన్‌గానూ పనికిరాకుండా పోయాడు. కూతుళ్లతో సంబంధాలూ తెగిపోయాయి. తనని తనే పోషించుకోలేని దీన స్థితి. మళ్లీ తన మెడకో డోలులాంటి యానాదమ్మ. నరసింహులు బిక్షగాడిగా మారిపోయాడు. అప్పట్నించీ ఇప్పటిదాకా పందిళ్లపల్లి వీధుల్లో 'అమ్మా కాస్త అన్నంపెట్టు తల్లీ', 'బాబూ ఒక్క పావలా ఉంటే ధర్మం చెయ్యి బాబూ' అన్న నరసింహులు గొంతు ప్రతిధ్వనిస్తూనే ఉంది.
***
"అరే పెద్దాయనా చస్తావ్. కాస్త చుట్టుపక్కల చూస్కో" అని చేయిపట్టుకు లాగాడు రాజేంద్ర. దాదాపు నరసింహుల్ని రాసుకుంటున్నట్లుగా పోయింది ఓ లారీ.
"నువ్వా బాబూ, ఇందాక కనపడకపోయేతలికి ఊళ్లో లేవేమోననుకున్నా" అన్నాడు నరసింహులు, కాస్త ఊరట చెందిన మనసుతో.
ఎందుకనో తెలీదు నరసింహులంటే రాజేంద్రకి జాలి. కనిపించినప్పుడల్లా ఐదు లేదంటే పది రూపాయల నోటు ఇస్తుంటాడు. ఇప్పుడూ ఇచ్చాడు పది రూపాయలు.
"పిల్లాపాపల్తో సల్లంగ ఉండు కొడుకా" అన్నాడు నరసింహులు అక్కడే తలుపులు వేసున్న ఓ ఇంటి అరుగుమీద కూలబడతా.
రాజేంద్ర నవ్వి "చీకటి పడింది. ఇంటికెళ్లు. ముసలామె నీకోసం ఎదురు చూస్తుంటుంది" అంటా వెళ్లిపోయాడు.
"అవునవును. వొచ్చేప్పుడు మసల్ది బిళ్లలు తెమ్మంది" అని తనలో తనే గొణుక్కుంటున్నట్లు అంటా మెడికల్ షాపుకేసి నడిచాడు మిలట్రీ నరసింహులు.
(అయిపోయింది)
-ఆంధ్రభూమి డైలీ, 30 మే 2010

No comments: