తెలుగు ప్రేక్షకులు ఇంకా 1980ల కాలంలో లేరు. కొంతైనా ఎదిగారు. వాళ్లని తక్కువగా అంచనా వేస్తే ఏమవుతుందో నిన్నటి గుణశేఖర్ 'వరుడు' నిరూపిస్తే, నేటి కృష్ణవంశీ 'మొగుడు' బలపరిచింది. 'నిన్నే పెళ్లాడతా' నుంచీ కృష్ణవంశీ తీసిన వాటిలో ఎక్కువ సినిమాలు పెళ్లిచుట్టూనే పరిభ్రమిస్తూ వస్తున్నాయి. ఆయన 'పెళ్లి ఉచ్చు'లో చిక్కుకుని బయటపడలేక పోతున్నాడు. ఇండివిడ్యువల్‌గా ఏ పాత్రకి ఆ పాత్రని 'అతి'గా చూపించే ఆయన అలవాటు 'మొగుడు'లోనూ కొనసాగింది. 'చక్రం' చిత్రం నుంచీ ఆయన పాత్రల్లో ఈ ఓవర్ డ్రమటైజేషన్ మనకి కనిపిస్తూ వస్తోంది. బయట ప్రపంచంలో ఏ తండ్రీ కొడుకులూ, అక్కా తమ్ముళ్లూ, బావా మరుదుళ్లూ ప్రవర్తించని విధంగా ఆయన పాత్రలు 'ఓవర్'గా ప్రవర్తిస్తుంటాయి. 'మొగుడు'లో ఏ పాత్రనైనా తీసుకోండి. మీకు ఇది నిఖార్సయిన నిజమని తెలుస్తుంది.
'మొగుడు'లో ఫస్టాఫ్‌లో పాత్రల ఓవరాక్షన్‌తో మతిపోయిన మనకి సెకండాఫ్ కాస్త రిలీఫ్‌నిస్తుంది. అదీ పూర్తిగా కాదు. కథకి సరిపోయే ముగింపునివ్వడంలోనూ కృష్ణవంశీ ఫెయిలయ్యాడు. 'మొగుడు' అనేది ఆంజనేయప్రసాద్ (రాజేంద్రప్రసాద్) కుటుంబం చుట్టూ అల్లిన కథ. ముగ్గురు ఆడపిల్లలు, చివర ఓ మగ పిల్లాడినీ కని భార్య చనిపోతే నలుగురు పిల్లలకీ తనే తల్లీతండ్రీ అయి పెంచాడు. అందర్నీ మంచి చదువులు చదివించాడు. అనాథల్ని చేరదీసి, తనే వాళ్లకి చదువులు చెప్పించి, అల్లుళ్లని చేసుకున్నాడు. ఇక కొడుకు రాంప్రసాద్ (గోపీచంద్) పెళ్లి చేయడమే తరువాయి. మెర్సిడెజ్ బెంజ్ కార్ల డీలర్ అయిన రాంప్రసాద్‌కి తండ్రి తెచ్చిన ఏ సంబంధమూ నచ్చదు. ఓసారి రాజరాజేశ్వరి (తాప్సీ) అనే అందాలరాశిని చూసి మనసు పారేసుకుంటాడు. ఇద్దరికీ పరిచయమవుతుంది. అంతలో తండ్రి మరో సంబంధం తెస్తాడు ప్రసాద్‌కి. తనకి కావలసింది ఆ పిల్ల కాదనీ, రాజేశ్వరి అనీ అర్థమై, ఆమెకి పెళ్లి ప్రపోజల్ చేస్తాడు. అప్పటికే అతడి పట్ల ఇష్టం ఏర్పరచుకున్న ఆమె సరేనంటుంది. రాజేశ్వరి పేరుపొందిన రాజకీయ నాయకురాలు చాముండేశ్వరి (రోజా) కూతురు. ఆమె భర్త (నరేశ్), అంజనేయప్రసాద్ బాల్య స్నేహితులనే సంగతి అప్పుడే బయటపడుతుంది. బాల్యమిత్రులిద్దరూ 'లిప్ టు లిప్ కిస్' పెట్టుకొని మనల్ని బిత్తరపోయేలా చేస్తారు. పెళ్లికి అంతా ఓకేనంటారు. పెళ్లవుతుంది. కానీ ఓ చిన్న కారణంవల్ల అప్పగింతల సమయంలో రెండు కుటుంబాలకీ గొడవవుతుంది. రాజేశ్వరితో పాటు గౌరీమాత విగ్రహాన్నీ తీసుకురమ్మంటాడు ఆంజనేయప్రసాద్. గౌరీమాత పుట్టింటే వుండాలని రాజేశ్వరి అమ్మమ్మ తేల్చిచెప్పడంతో మాటా మాటా పెరుగుతుంది. అంతలో ఆంజనేయప్రసాద్ చిన్నల్లుడు గౌరీ విగ్రహాన్ని తెస్తాడు. దాంతో అతణ్ణి చెంపమీద కొడుతుంది చాముండేశ్వరి. నా అల్లుణ్ణి కొడతావా, నువ్వసలు ఆడదానివేనా? అని ఆమె చెంప చెళ్లుమనిపిస్తాడు ఆంజనేయప్రసాద్. నన్నే కొడతావా? అంటూ అతణ్ణి చెప్పుతో కొడుతుంది చాముండేశ్వరి. మా నాన్నని చెప్పుతో కొడతావా? అంటూ అత్త గూబ గుయ్యిమనిపిస్తాడు రాంప్రసాద్. మా అమ్మనే కొడతావా? అని మొగుడి చెంప చెళ్లుమనిపిస్తుంది రాజేశ్వరి. ఆగ్రహంతో ఊగిపోతూ ఆమె మీద చెయ్యెత్తి ఆగిపోతాడు రాంప్రసాద్. నాకు ఈ పెళ్లొద్దు, ఈ మొగుడూ వద్దు - అని పుటుక్కున తాళి తెంచేసి మొగుడిమీదకు విసిరేస్తుంది రాజేశ్వరి. ఈ చెంపలు చెళ్లుమనిపించే కార్యక్రమం చకచకా సాగి మన మైండ్ బ్లాంకవుతుండగా తెరమీద 'సగం అయ్యింది' అనే ఇంటర్వెల్ కార్డ్ పడటంతో ఊపిరి తీసుకోడానికి పరుగున బయటకు వస్తాం.
రాంప్రసాద్, రాజేశ్వరికి విడాకులు మంజూరు చేయించే కార్యక్రమాన్ని చాముండేశ్వరి షురూ చేశాక మన హీరో హీరోయిన్లు మారిషస్‌కి వెళ్లి మళ్లీ ఎలా దగ్గరయ్యారు, పెద్దల్ని ఒప్పించి మళ్లీ మొగుడూ పెళ్లాలు ఎలా అయ్యారనేది మిగతా కథ. ఈ ప్రాసెస్‌లో హీరో హీరోయిన్లకి శ్రద్ధాదాస్ బాగా సాయపడుతుంది. రాజేశ్వరితో పెళ్లి ఒకవేళ జరగకపోతే నేను ఉండానని గుర్తుపెట్టుకో అని మొదట్లోనే తన సమక్షంలోనే రాంప్రసాద్‌కి చెప్పిన శ్రద్ధ మారిషస్‌లో రాంప్రసాద్‌తో రాసుకు పూసుకు తిరగడాన్ని సహించలేకపోతుంది రాజేశ్వరి. అతడిపట్ల తనలో ఎంత ప్రేముందో తెలిసి, షార్క్ చేపల్ని చంపడానికిచ్చే విషం తాగుతుంది. ఆమెని కాపాడుకోవడమే కాక, చివరకు అత్త చాముండేశ్వరిలో పరివర్తన కలిగిస్తాడు రాంప్రసాద్.
పెళ్లయ్యాక మగాడనేవాడు 'మొగుడు' అనికూడా అనిపించుకోవాలని ఈ సినిమాతో చెప్పానని కృష్ణవంశీ సినిమా విడుదలకి ముందు పదేపదే చెప్పాడు. 'మొగుడు' సినిమాలో పెళ్లయ్యాక రాంప్రసాద్ చేసిన పని చాలా సినిమాల్లో ఇప్పటికే మనం చూశాం. మరి ఇందులో కృష్ణవంశీ కొత్తగా ఏం చెప్పినట్లు? నథింగ్. పాత కథనే మరోసారి తనదైన 'ఓవర్ డోస్'తో చెప్పాడంతే. పెళ్లయి పసుపూ పారాణి ఆరకముందే ఆ మొగుడూ పెళ్లాలు విడిపోవాల్సి రావడం మంచి ఇంటర్వెల్ బ్యాంగ్. కానీ చెంపదెబ్బల ప్రహసనంతో ఆ ఫీల్ ఏమాత్రమూ మిగలదు. నిజానికి ఫస్టాఫ్‌లో హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలేవీ దాదాపుగా లేవు. సెకండాఫ్‌లో రాజేశ్వరి విషం తాగినప్పుడు మాత్రం ఆమెపట్ల సానుభూతి కలుగుతుంది. ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్‌లో రాజేశ్వరిని వాళ్లింట్లో వదిలేసిరమ్మని రాంప్రసాద్‌ని తండ్రి అన్నప్పుడూ, మేము కావాలో, రాజేశ్వరి కావాలో తేల్చుకొమ్మని ముగ్గురక్కలూ అతడిని అడకత్తెరలో పోకచెక్క చేసినప్పుడూ జాలి పడతాం. అంతకుమించి 'మొగుడు'లో మనం సహానుభూతి చెందే సన్నివేశాలు కనిపించవు. గోపీచంద్, శ్రద్ధాదాస్ మీద తీసిన బీచ్ సాంగ్, గోపీచంద్, తాప్సీ మీద సింహం పిల్లలు, చిరుత మధ్య తీసిన డ్యూయెట్ మాత్రం యువతని ఆకట్టుకుంటాయి.
కన్నతండ్రే (ఆంజనేయప్రసాద్) కన్నకొడుక్కి (రాంప్రసాద్) మగతనం ఉందో, లేదో తెలుసుకొమ్మని తన డాక్టరల్లుణ్ణే పురమాయించడం 'మొగుడు' లాంటి కృష్ణవంశీ సినిమాల్లోనే మనం చూడగలం. ఆ సంగతి అర్థమయ్యాక రాంప్రసాద్ కిందపడి దొర్లడం, ఆ ఓవరాక్షన్ చెయ్యలేక గోపీచంద్ ఇబ్బందిపడటం, అది చూడలేక మనం ఇబ్బందిపడటం... ఎందుకొచ్చిన ఇబ్బంది?
గంపగుత్తగా ఒకే సినిమాలో అందరు యాక్టర్ల ఓవరాక్షన్ చూసే అవకాశం మనకి అరుదుగా దొరుకుతుంది. ఆ ఓవరాక్షన్, ఓవర్ డ్రమటైజేషన్ ఎలా ఉంటుందో అనుభవించాలంటే 'మొగుడు' చూసి తీరాల్సిందే. సినిమాలో చెప్పుకోతగ్గది శ్రీకాంత్ నరోజ్ సినిమాటోగ్రఫీ. బాబూశంకర్ సంగీత బాణీలకన్నా పాటల చిత్రీకరణే బాగుంది. 'మొగుడు' ఫీడ్‌బాక్ తర్వాతైనా పాత్రల, సన్నివేశాల కల్పనలో కృష్ణవంశీలో మార్పు వస్తుందని ఆశించడం అత్యాశే. ఎందుకంటే ఆయన అక్కడే ఫిక్సయిపోయాడు.
No comments:
Post a Comment