Friday, November 18, 2011
అప్పుడు 'లవకుశ'.. ఇప్పుడు 'శ్రీరామరాజ్యం'
అందరి కళ్లూ ఇప్పుడు 'శ్రీరామరాజ్యం' మీదే. గురువారం (17) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఇటు సినీ వర్గాల్లో, అటు సామాన్య ప్రజానీకంలో అమితాసక్తి వ్యక్తమవుతోంది. 'శ్రీకృష్ణార్జున విజయం' (1996) తర్వాత నందమూరి బాలకృష్ణ నుంచి వస్తున్న పౌరాణిక చిత్రం ఇదే. ఉత్తరరామ చరిత్ర ఆధారంగా తండ్రీ కొడుకులు సి. పుల్లయ్య, సి.ఎస్. రావు దర్శకత్వంలో రూపొందిన 'లవకుశ'కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీసు ఫలితం తెలుగులో తిరిగి పౌరాణిక చిత్రాల రూపకల్పనపై ప్రభావం చూపబోతోంది. ఈ చిత్రం విజయం సాధిస్తే మరిన్ని పౌరాణిక చిత్రాల నిర్మాణానికి ఊతం లభిస్తుందని విశ్లేషకులు నమ్ముతున్నారు.
ఈ సందర్భంగా అఖండ విజయం సాధించిన మునుపటి చిత్రంతో, ప్రస్తుత చిత్రాన్ని పోల్చడం సహజం. 26 కేంద్రాల్లో విడుదలైన 'లవకుశ' అన్ని కేంద్రాల్లోనూ వంద రోజులు ఆడి, తెలుగులో రూ. కోటి వసూలు చేసిన తొలి చిత్రంగా (టిక్కెట్ రేట్లు పావలా నుంచి ఒక రూపాయి ఉన్న కాలంలో) రికార్డు పుటలకెక్కింది. 18 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. అప్పటి ఆంధ్రప్రదేశ్ జనాభా మూడు కోట్లు కాగా, ఈ చిత్రాన్ని 1.98 కోట్ల మంది చూసినట్లు అంచనా. అలాంటి 'లవకుశ'లో సీతారాములుగా అంజలీదేవి, నందమూరి తారకరామారావు ఎంత గొప్ప స్థాయిలో రాణించారో, అభినవ సీతారాములుగా ఎంతగా నీరాజనాలు అందుకున్నారో అప్పటి జనానికి తెలుసు. ముఖ్యంగా శ్రీరామునిగా ఎన్టీఆర్ రూపం జన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది 'లవకుశ'లో ఆయన పోషించిన ఆ పాత్రతోనే.
త్రేతాయుగంలో శ్రీరాముడు ఇలాగే ఉండేవాడేమోనని భ్రమించే రీతిలో ఆయన జనాన్ని సమ్మోహహితుల్ని చేశారు. ఇప్పుడు ఆ పాత్రని బాలకృష్ణ ఎలా చేశారనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. రూపపరంగా చూస్తే, ఎన్టీఆర్ వంటి సమ్మోహనశక్తి లేకపోయినా ఆయన తర్వాత రాముని పాత్రలో ఇమడ గలిగేది బాలకృష్ణే అనే అభిప్రాయం సర్వత్రా ఉంది. శ్రీరాముని రూపంలోని బాలకృష్ణ స్టిల్స్ ఆ విషయాన్నే ధృవీకరిస్తున్నాయి. 'లవకుశ'లో సీతగా అంజలీదేవి ప్రభావమూ అసామాన్యమైనదే. ఆ పాత్రలో ఆమె అద్భుతంగా ఒదిగిపోయారు. లక్ష్మణుడు తనని అడవులకు పంపిన కారణం తెలిశాక ఆమె పలికించిన కరుణ రసం ఎప్పటికీ మన హృదయాల్ని తాకుతూనే ఉంటుంది. ఇక పతాక సన్నివేశాల్లో ఆమె అభినయం అపూర్వమనే చెప్పాలి. అలాంటి పాత్రను ఇప్పుడు నయనతార చేయడమే ఒక విచిత్రం. తన కాలానికి అంజలి గొప్పనటిగా అప్పటికే పేరు తెచ్చుకున్నారు. ఇక్కడ నయనతార తెలుగు నటి కాదు. తెలుగు భాష సరిగా తెలీదు కూడా. అయినా ప్రచార చిత్రాల్లో సీతగా ఆమె ఆహార్యం చక్కగా ఉంది. ఇప్పటికే 'సింహా' చిత్రంలో బాలకృష్ణ, నయనతార జంట ప్రేక్షకుల్ని అలరించింది. అప్పటివరకు గ్లామర్ రోల్స్‌కి పేరుపొందిన నయనతార ఆ సినిమాల్లో చీరల్లో హుందాగా కనిపించిన తీరే ఇప్పుడు సీత పాత్రకు ఎంపిక చేసేందుకు దోహదం చేసింది. అంజలిని ఆమె ఏ తీరున మరిపిస్తుందన్నది చూడాల్సిందే.
ఇక చిత్రంలో కీలకమైంది లక్ష్మణుని పాత్ర. మునుపటి చిత్రంలో ఆ పాత్రని కాంతారావు అమోఘంగా పోషించారు. సీతను అడవులకు పంపాలని శ్రీరాముడు నిర్ణయించినప్పుడు, ఆ బాధ్యత తనమీదే పడ్డప్పుడు కాంతారావు ప్రదర్శించిన నటన అత్యుత్తమం. ఇప్పుడు ఆ సన్నివేశాల్లో శ్రీకాంత్‌ని మనం చూడబోతున్నాం. ఆయన ఓ పౌరాణిక పాత్రను పోషించడం ఇదే ప్రథమం. వాల్మీకిగా చిత్తూరు నాగయ్యను చూసిన కళ్లతో అక్కినేని నాగేశ్వరరావును చూడటం అపురూపం. నటులుగా ఇద్దరూ ఏ స్థాయి నటులో మనకు తెలిసిందే.
ఇదంతా తెరమీద మనం చూడబోయే వ్యవహారం కాగా తెరవెనుక దర్శకత్వాన్ని ప్రస్తావించుకోవడం సందర్భోచితం. 'లవకుశ'ను తలపెట్టింది సి. పుల్లయ్య. అయితే అకస్మాత్తుగా సినిమా మధ్యలో ఆయన మరణించడంతో ఆ బాధ్యతను గొప్పగా నెరవేర్చారు ఆయన కుమారుడు సి.ఎస్. రావు. అలా తండ్రీకొడుకులు ఒక పౌరాణిక చిత్రరాజాన్ని తెలుగు దేశానికి అందిస్తే, ఇప్పుడు ఆ పని నిర్వహించింది ఇప్పటికే ఎన్నో కళాఖండాల్ని అందించిన బాపు. సహచరుడు ముళ్లపూడి వెంకటరమణ ఈ సినిమా మధ్యలో అర్ధంతరంగా స్వర్గస్తులైతే, ఒంటిగానే తాననుకున్న రీతిలో 'శ్రీరామరాజ్యం'ను తీర్చిదిద్దారు బాపు. ఎనభై ఏళ్ల వయసులోనూ చెక్కుచెదరని ఏకాగ్రతతో ఈ చిత్రాన్ని ఆయన మలచిన తీరుకు ఆ సినిమా యూనిట్ అంతా జేజేలు పలుకుతున్నారు.
దీంతో పాటు సంగీతాన్నీ ప్రస్తావించుకోవాలి. 'లవకుశ' విజయంలో ఘంటసాల సంగీత బాణీలకూ ప్రత్యేక స్థానముంది. 'శ్రీరామరాజ్యం'కు ఆ బాధ్యతని అత్యంత సమర్ధంగా నిర్వహించారు ఇళయరాజా. ఇవన్నీ ఒకెత్తయితే పౌరాణికాలు తియ్యాలంటేనే బెంబేలెత్తే ఈ రోజుల్లో ఖర్చుకు వెరవకుండా, భారీ రిస్కుకు దడవకుండా ఈ సినిమాని నిర్మించి అందరి దృష్టినీ ఆకర్షించారు యలమంచిలి సాయిబాబా. ఇన్ని విశేషాలున్న 'శ్రీరామరాజ్యం' ఏ రీతిన ఆడుతుందో, 'లవకుశ'ను ఎంతగా మరిపిస్తుందో వేచి చూడాల్సిందే.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment