'బాలరాజు' (1948) చిత్ర కథాంశం
దేవకన్య మోహిని మంచి నాట్యకత్తె. యక్షుణ్ణి ప్రేమిస్తుంది. మోహిని అపురూప సౌందర్యం ఇంద్రుణ్ణి స్థిమితంగా ఉండనీయదు. ఆమె తన కొలువులో నృత్యం చేయాలని ఆమె తండ్రిని ఆజ్ఞాపిస్తాడు. మోహిని ఒప్పుకోదు. తనకు అడ్డు అయ్యాడనే కోపంతో భూలోకంలో ప్రేమంటే తెలీని జడునివికమ్మని యక్షుణ్ణి శపిస్తాడు. మోహినిని బలవంతంగా తన సభకు రప్పిస్తాడు. నాట్యానికి ససేమిరా అంటుంది మోహిని. ఆవేశంతో రగిలిపోయిన ఇంద్రుడు ఆమెను మానవ జన్మ ఎత్తి, ఫలించని ప్రేమతో అల్లాడమని శపిస్తాడు.యక్షుడు వెలమవాళ్లింట బాలరాజుగా, మోహిని కమ్మవాళ్లింట సీతమ్మగా పుట్టి పెరుగుతుంటారు. సీతమ్మను ఎవరికంటా పడకుండా ఊరి బయట ఒక ఒంటిస్తంభం మేడలో పెంచుతుంటాడు కమ్మనాయుడు. ఒకరోజు బాలరాజు తన స్నేహితుడు యలమందతో కలిసి ఆ ఇంటిమీదుగా వెళ్లడం చూస్తుంది మోహిని. తొలిచూపుతోనే పాతప్రేమ చిగురిస్తుంది. ఇల్లు విడిచి బాలరాజును కలుసుకుంటుంది సీత. ఆమె నిద్రపోతుండగా జడత్వంతో వెళ్లిపోతాడు బాలరాజు. వద్దన్న కొద్దీ తనవెంట పడుతున్న సీతను మొదట దెయ్యంగా భావిస్తాడు. తర్వాత మంచిదని నమ్ముతాడు.
అడవి దొంగలు మత్తుమందుజల్లి సీతను ఎత్తుకుపోతారు. వెతకడానికి వెళ్ళిన బాలరాజు మునిశాపంతో పాముగా మారిపోతాడు. సీత తప్పించుకువచ్చి పామైన బాలరాజును కలుసుకుంటుంది. తర్వాత వరసబెట్టి కష్టాలొస్తాయి. బాలరాజు చనిపోతాడు. అశ్వనీ దేవతలు ఇచ్చిన సంజీవిమాలతో అతణ్ణి బతికించుకుంటుంది సీత. ఇంద్రుడు మళ్లీ తయారై ఆమెను నిర్బంధిస్తాడు. దాంతోనూ ఫలితం కనిపించక మాయసీతగా మారి బాలరాజుతో సరసాలాడతాడు. ఆగ్రహంతో ఇంద్రుణ్ణి సీత శపించబోయేసరికి శచీదేవి వచ్చి భర్తను కాపాడమనటంతో కథ సుఖాంతం.
తారాగణం: అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, యస్. వరలక్ష్మి, గాడేపల్లి, డి.ఎస్. సదాశివరావు, కస్తూరి శివరావు
సంగీతం: సి.ఆర్. సుబ్బరామన్, గాలిపెంచల నరసింహారావు
నిర్మాత, దర్శకుడు: ఘంటసాల బలరామయ్య
బేనర్: ప్రతిభా ఫిలిమ్స్
విడుదల తేదీ: 26 ఫిబ్రవరి
No comments:
Post a Comment