Monday, December 26, 2011

బిగ్ స్టోరీ: సంక్రాంతికి సై

సంక్రాంతికి ఏయే సినిమాలు రానున్నాయో దాదాపు తేలిపోయింది. తెలుగు సినిమాకు సంబంధించి ఓ కేలండర్ సంవత్సరంలో వచ్చే తొలి పెద్ద సీజన్ సంక్రాంతి అనేది తెలిసిందే. సంక్రాంతికి వారం నుంచి పది రోజుల దాకా బడులకు ఇచ్చే సెలవుల్ని సొమ్ము చేసుకోవాలని నిర్మాతలు భావిస్తుంటారు. పెద్ద సినిమాలు రంగంలో ఉంటే చిన్న సినిమాలకు థియేటర్లు దొరక్క ఆ సినిమాల నిర్మాతలు నిరాశ పడటం మామూలే. ఇప్పుడూ అదే స్థితి. ఏకంగా నాలుగు పెద్ద సినిమాలు ఒకదానితో ఒకటి ఢీ అంటుండటంతో చిన్న సినిమాకు చోటెక్కెడ దొరుకుతుంది? పైగా ఈ పెద్ద సినిమాలే థియేటర్లను పంచుకోవాల్సి వస్తుండటం వల్ల వాటికీ మిగతా సమయాల్లో లభ్యమయ్యే రీతిలో థియేటర్లు దొరకవనేది నిజం. ఫలితంగా వాటి కలెక్షన్ల మీద కూడా ఇది ప్రభావం చూపడం తథ్యం. సంక్రాంతి విజేతలుగా నిలవాలనే తపనతో వస్తున్న ఆ నాలుగు సినిమాలు - 'బిజినెస్‌మేన్', 'బాడీగార్డ్', 'నిప్పు', 'పూలరంగడు'.
మళ్ళీ కలిశారు 
'దూకుడు' వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత మహేశ్ హీరోగా వస్తున్న 'బిజినెస్‌మేన్' సినిమా పట్ల వెల్లువెత్తుతున్న అంచనాలు అంబరాన్నంటుతున్నాయి. పూరి జగన్నాథ్ దర్శకుడవడం వల్ల కూడా ఈ సినిమా పట్ల ఇటు సినీ వర్గాలవారూ, అటు సాధారణ ప్రేక్షకులూ అమితాసక్తి కనపరుస్తున్నారు. ఇదివరకు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'పోకిరి' చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల్ని నెలకొల్పిన సంగతి మనకు తెలుసు. 'బిజినెస్‌మేన్' ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తోందోననే ఆసక్తి సర్వత్రా ఉంది. అందుకే దీన్ని కొనుగోలు చేసేందుకు బయ్యర్లు బారులు తీరారు. మహేశ్ సరసన కాజల్ అగర్వాల్ తొలిసారి నాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఆర్.ఆర్. మూవీమేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్నారు. 'దూకుడు' మీదున్న తమన్ సంగీతం సమకూర్చిన పాటలు ఇప్పటికే పెద్ద హిట్టయ్యాయి. ముంబై మాఫియా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సీజన్‌లో అన్నిటికంటే ముందుగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఇప్పుడు తెలుగులో... 
వెంకటేశ్ హీరోగా నటించిన 'బాడీగార్డ్' సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు నమ్ముతున్నాయి. కారణం - ఇప్పటికే ఈ సినిమా మూడు భాషల్లో జయకేతనం ఎగురవేయడం. మొదట మలయాళంలో (దిలీప్ హీరో), తర్వాత తమిళంలో (విజయ్ హీరో), ఆ పిమ్మట హిందీలో (సల్మాన్‌ఖాన్ హీరో) కలెక్షన్ల వర్షం కురిపించింది ఈ సినిమా. వాటికంటే తెలుగు వెర్షన్ మరింత బాగా వచ్చిందని శ్రీ సాయిగణేశ్ మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించిన బెల్లకొండ సురేశ్ గట్టి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఎక్కువగా కామెడీ ఎంటర్‌టైనర్స్ చేస్తూ వచ్చిన వెంక టేశ్ చాలా రోజుల తర్వాత ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటించడం ఇప్పుడే. ఆయన సరసన త్రిష హీరోయిన్‌గా చేయడం ఇది మూడోసారి. 'డాన్ శీను' ఫేమ్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాకి రామ్-లక్ష్మణ్ కూర్చిన ఫైట్లు, తమన్ సంగీతం అందించిన పాటలు హైలైట్ అవుతాయంటున్నారు. జనవరి 12న విడుదలవుతున్న ఈ సినిమా ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది.

ముగ్గురు మిత్రులు 
ముగ్గురు మిత్రుల సినిమా 'నిప్పు'. కెరీర్ తొలినాళ్లలో చెన్నైలో ఒకే ఇంట్లో ఉండి అవకాశాలు వెతుక్కున్న ఆ ముగ్గురు - గుణశేఖర్, రవితేజ, వైవీఎస్ చౌదరి. రవితేజ కథానాయకుడిగా గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు వారి పతాకంపై వైవీఎస్ నిర్మిస్తున్నారు. ఇలా ఓ అరుదైన కాంబినేషన్‌తో, ఆరోగ్యకరమైన వాతావరణంలో తయారవుతున్న ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. దీక్షాసేథ్ హీరోయిన్‌గా నటిస్తుంటే, రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. రవితేజ మార్కు వినోదానికి, గుణశేఖర్ శైలి టేకింగ్ తోడైన ఈ సినిమాకి సైతం తమన్ సంగీతం సమకూరుస్తుండటం విశేషం. ఇలా ఒకే సంగీత దర్శకుడు పనిచేసిన మూడు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీపడనుండటం అనేది కూడా అరుదైన సందర్భం. జనవరి 13న 'నిప్పు' విడుదలవుతోంది.
నవ్వులు పువ్వులు 
కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకొని, కామెడీ హీరోగా ఎదుగుతున్న సునీల్ ఇప్పుడు 'పూలరంగడు'గా అవతారమెత్తాడు. 'అందాల రాముడు', 'మర్యాద రామన్న' చిత్రాలతో ఘన విజయాలు సాధించిన ఈ భీమవరం నటుడు తనకంటూ సొంత మార్కెట్‌ని సంపాదించుకోవడం చిన్న విషయమేమీ కాదు. అందుకు తగ్గట్లే 'పూలరంగడు' పట్ల బిజినెస్ వర్గాలు ఆసక్తి కనపరుస్తున్నాయి. 'అహ నా పెళ్లంట' ఫేమ్ వీరభద్రమ్ దర్శకత్వంలో తయారవుతున్న ఈ చిత్రాన్ని ఆర్.ఆర్. మూవీమేకర్స్ సమర్పణలో దాని సోదర సంస్థ మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. జనవరి 5న ఆడియో ఆవిష్కరణ జరగనున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ వినోదాత్మక చిత్రంలో 'ప్రేమ కావాలి' ఫేమ్ ఇషా చావ్లా నాయిక. ఒకే సంస్థ నిర్మిస్తున్న రెండు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీపడుతుండటాన్నీ ఈసారి మనం చూడబోతున్నాం.
-ఆంధ్రజ్యోతి డైలీ, డిసెంబర్ 26, 2011

No comments: