టాలీవుడ్‌లో సావిత్రులు, సౌందర్యలు ఎంతమందున్నారో లెక్క తేలడం లేదు. అవును మరి. ప్రతి హీరోయిన్నీ ఎవరో ఒకరు సౌందర్యతోటో, సావిత్రితోటో, లేదంటే జయసుధతోటో పోల్చడం పరిపాటైపోయింది. ఇటీవల 'తెలుగమ్మాయి' ఆడియో ఫంక్షన్‌లో ఆ సినిమా హీరోయిన్ సలోనిని సొందర్య అంతటి నటంటూ ఆకాశానికెత్తేశాడు సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ. ఆయన పోలికని అదే ఫంక్షన్‌లో పాల్గొన్న ఆయన గురువు దాసరి నారాయణరావు సున్నితంగా తోసిపుచ్చడం గమనార్హం. "రామకృష్ణా అప్పుడే ఎందుకు తొందర. సౌందర్యకి ఎవరూ పోలిక కారు" అని ఆయన సున్నితంగా శిష్యుణ్ణి మందలించారు. కోడి రామకృష్ణ ఏ సినిమా ఫంక్షన్‌లో పాల్గొన్నా ఆ సినిమాకి సంబంధించిన వాళ్లని ఊహాతీతంగా పొగడ్తల వర్షంలో ముంచెత్తడం అలవాటే. ఆయన సంగతి అలా పక్కన పెడదాం.
సొందర్య ప్రమాదవశాత్తూ మృతి చెందాక మొదట స్నేహని ఆమెతో పోల్చడంతో ఈ పోలికల గొడవ ఎక్కువవుతూ వచ్చింది. 'అన్నమయ్య', 'రాధా గోపాలం' సినిమాలు చేసిన ఆమెని సౌందర్య అంతటి నటిగా కొంతమంది ప్రశంసల్లో ముంచెత్తారు. కానీ ఆమె ఆ సినిమాల తర్వాత సరిగా రాణించలేక పోయింది. తెలుగులో ఆమె కెరీర్ ఎదగలేదు. ఆమధ్య 'కలవరమాయే మదిలో' సినిమా చేసిన స్వాతిని ఆ చిత్ర నిర్మాత మోహన్ వడ్లపట్ల "సావిత్రి తర్వాత అంతటి నటి స్వాతే" అని తీర్మానించేశారు. అంటే వాణిశ్రీ, జయసుధ, సుహాసిని, విజయశంతి, సౌందర్య కూడా స్వాతి ముందు దిగదుడుపే అని ఆయన పరోక్షంగా చెప్పాడన్న మాట. ఆ సినిమానే కాదు, ఆ తర్వాత కూడా స్వాతి చెప్పుకోదగ్గ రీతిలో తెలుగులో రాణించలేదు. భూమిక, ఛార్మి, అనుష్క వంటి వాళ్లని కూడా సౌందర్యతో మనవాళ్లు పోల్చిన సందర్భాలున్నాయి. కొద్ది రోజుల క్రితం 'అలా మొదలైంది' నాయిక నిత్యమీనన్‌ని కూడా కొంతమంది సౌందర్యతోటీ, జయసుధతోటీ పోల్చారు. నో డౌట్. ఆ సినిమాలో నిత్య నటించలేదు, బిహేవ్ చేసింది. అయినా ఆమెని సౌందర్యతో పోల్చలేం. ఇలా చాలామంది సౌందర్యలను మనవాళ్లు తమ మాటల ద్వారా సృష్టించారు. కానీ ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ మరో సౌందర్య రాలేదన్నది నిఖార్సయిన నిజం. సినిమావాళ్లు ఊరికే సౌందర్యతో ఇతర తారల్ని పోల్చడం మానితే బెటర్.
No comments:
Post a Comment