Wednesday, July 20, 2011
న్యూస్: శత దినోత్సవ హీరో!
చిన్న హీరోల్లో మినిమం గ్యారంటీ హీరో ఎవరు? నిస్సందేహంగా నరేశ్. అదే 'అల్లరి' నరేశ్! రాజేంద్రప్రసాద్ తర్వాత కామెడీ హీరోగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఏకైక హీరో. 'అందాల రాముడు', 'మర్యాద రామన్న' సినిమాలతో సునీల్ కూడా కామెడీ హీరోగా సక్సెస్సయినా అతను నరేశ్ లాగా పూర్తి స్థాయి హీరో ఇంకా కాలేదు. కమెడియన్‌గా కొనసాగుతూనే ఉన్నాడు. నరేశ్ ఇతర హీరోల సినిమాల్లో నటిస్తున్నా వాటి సంఖ్య చాలా తక్కువ. ప్రధానంగా అతణ్ణే ఆధారం చేసుకుని ప్రొడ్యూస్ అవుతున్న సినిమాలే ఎక్కువ. అతడి చివరి ఆరు సినిమాల్లో ఫ్లాపయిన ఒకే సినిమా కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన 'శుభప్రదం'. వంశీ తీసిన 'సరదాగా కాసేపు' యావరేజ్ అయితే మిగతా నాలుగు.. 'బెట్టింగ్ బంగార్రాజు', 'కత్తి కాంతారావు', 'అహ నా పెళ్లంట', 'సీమటపాకాయ్' అందరికీ లాభాలు తీసుకొచ్చాయి. 'అహ నా పెళ్లంట' ఇటీవలే శతదినోత్సవం జరుపుకుంది. ఇప్పటి రోజుల్లో అర్థ శతదినోత్సవమే గొప్పనుకుంటే శత దినోత్సవం జరుపుకోవడం నిజంగా విశేషమే. త్వరలో 'సీమటపాకాయ్' కూడా ఆ బాటలోనే 100 రోజులు ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం నవ్వించడమే కాదు, ఏడిపించగలనని కూడా 'గమ్యం'తో అతను నిరూపించుకున్నాడు. ఇక త్వరలో అతను ఓ ఇంటరెస్టింగ్ సినిమా చేయబోతున్నాడు. గ్లామరస్ హీరోయిన్ శ్రియ అతనితో జోడీ కట్టబోతోంది. నారాయణ అనే కొత్త డైరెక్టర్ రూపొందించే ఈ సినిమా ఇప్పటికే సినీ వర్గాల్లో చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. తండ్రి ఈవీవీ సత్యనారాయణ మరణించడంతో నరేశ్ కెరీర్‌ని ఎలా ప్లాన్ చేసుకుంటాడనే సందేహాలు పొడచూపుతున్న సమయంలో అతడికి వస్తున్న సినిమాలు ఆ అనుమానాల్ని పారదోలుతున్నాయి. ఇక నరేశ్ చేయాల్సిందల్లా క్రమశిక్షణతో మెలగడమే.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment