ఎన్ని సినిమాలు చేస్తున్నా అంగుళం కూడా ఇమేజ్ పెరగని హీరోల్లో సుమంత్ ఒకరు. 1999లో రాంగోపాల్‌వర్మ డైరెక్షన్‌లో 'ప్రేమకథ'లో నటించడం ద్వారా మంచి ఆరంభమే పొందిన ఈ అక్కినేని క్యాంప్ హీరో యువకుడు, సత్యం, గౌరి, మహానంది, గోదావరి, మధుమాసం, పౌరుడు, గోల్కొండ హైస్కూల్ వంటి చెప్పుకోదగ్గ సినిమాలే చేశాడు. కానీ అదేం విచిత్రమో ప్రస్తుతం ఆయన సినిమాలకి బిజినెస్సే ఉండటం లేదు. సంగీత దర్శకుడు రమణ గోగుల నిర్మించిన 'బోణి' అతి ఘోరంగా ఫ్లాపయ్యాక ఏడాది పాటు ఖాళీగా ఉండిపోయాడు సుమంత్. ఆ తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఆయన చేసిన 'గోల్కొండ హైస్కూల్' సినిమాకి విమర్శకుల నుంచి మంచి చిత్రంగా ప్రశంసలు లభించాయి కానీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయింది. ఇక వి.ఆన్. ఆదిత్య డైరెక్షన్‌లో చివరగా వచ్చిన 'రాజ్' సినిమా ఎంతటి డిజాస్టరో తెలిసిందే. ఈ సినిమా తర్వాత ట్రేడ్ వర్గాల్లో సుమంత్ అంటే భయం మరింత పెరిగిపోయింది.
ప్రస్తుతం ఆయన 'దగ్గరగా.. దూరంగా..' అనే సినిమా చేస్తున్నాడు. వేదిక, సింధు తులానీ హీరోయినులుగా నటిస్తున్న ఈ సినిమాకి రవికుమార్ చావలి దర్శకుడు. ఈయన రక రకాల స్క్రీన్ నేమ్స్‌తో కనిపిస్తూ వచ్చాడు. మొదట రవి చావలి పేరుతో, తర్వాత రవి సి. కుమార్ పేరుతో సినిమాలు తీసిన ఆయన ఇప్పుడు మళ్లీ పూర్తి పేరుని వాడుతున్నాడు. సుధ సినిమా బేనర్‌పై జె. సాంబశివరావు అనే కొత్త నిర్మాత తీస్తున్న ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌ని గోల్కొండ హైస్కూల్ కంటే ముందే ఓకే చేశాననీ, ఇది తప్పకుండా హిట్టవుతుందనీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు సుమంత్. ఆగస్టులో ఆడియన్స్ ముందుకు వస్తున్న ఈ సినిమాతోనైనా సుమంత్ కెరీర్‌కి ఊపు వస్తుందో, లేదో?
No comments:
Post a Comment