Friday, July 22, 2011
న్యూస్: ఛార్మి 'మంత్రం' పారడం లేదు!
లేడీ ఓరియంటెడ్ మూవీ 'మంత్ర' తర్వాత ఛార్మి హీరోయిన్‌గా నటించిన ఏ తెలుగు సినిమాని ప్రేక్షకులు ఆదరించారు? ప్చ్.. ఏమీ లాభం లేదు. 'మంత్ర' (2007) తర్వాత ఛార్మి వైభవం మసకబారుతూ వచ్చింది. ఈ మధ్యలో ఆమె బాపు దర్శకత్వంలో 'సుందరకాండ', వి. ఈశ్వరరెడ్ది దర్శకత్వంలో 'మనోరమ', కొత్తవాడైన రమణ దర్శకత్వంలో 'సై ఆట', 'మంత్ర' ఫేం తులసీరాం దర్శకత్వంలో 'మంగళ', ప్రేంరాజ్ డైరెక్ట్ చేసిన 'నగరం నిద్రపోతున్న వేళ' వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. కానీ వీటిలో ఏ ఒక్కటీ ఆమెకి కమర్షియల్ సక్సెస్‌ని అందించలేదు. కొద్ది రోజుల తేడాతో ఇటీవల వచ్చిన 'నగరం నిద్రపోతున్న వేళ', 'మాయగాడు' సినిమాలు రెండూ ప్రేక్షకుల నుంచి కనీసపు స్పందన కరువవడంతో డిజాస్టర్ అయ్యాయి. గుడ్డిలో మెల్ల ఏమంటే పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో అమితాబ్‌తో కలిసి నటించిన హిందీ సినిమా 'బుడ్డా.. హోగా తేరా బాప్' ఆమెకి బాలీవుడ్‌లో కాస్త గుర్తింపును తెచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్టయ్యిందంటూ మీడియా మొదట్లో తెగ హడావుడి చేసినా, వారాంతం తర్వాత చూసుకుంటే కలెక్షన్లు బాగా డౌనయ్యాయి. ఏదేమైనా దానికి పెట్టిన పెట్టుబడి మాత్రం వచ్చేసింది. ప్రస్తుతం ఛార్మి శ్రీకాంత్ సరసన 'సేవకుడు' చిత్రంలో నటిస్తోంది. దీనికి వి. సముద్ర దర్శకుడు. ఈ సినిమా కూడా ఆడకపోతే ఛార్మిని పట్టించుకునేవాళ్లు కరువైపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment