Tuesday, July 5, 2011

న్యూస్: 'దడ'తో నాగచైతన్య మాస్ హీరో అవుతాడా?

తొలి సినిమా 'జోష్' ఫ్లాపయ్యాక నాగచైతన్య చేసిన రెండు సినిమాలు హిట్టయ్యాయి. ఆ రెండు సినిమాలు.. 'ఏ మాయ చేసావె', '100% లవ్'. వీటితో అతను లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు యాక్షన్ సినిమా చేయడం మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకోవాలనే యత్నంలో 'దడ' సినిమా చేస్తున్నాడు. నాగార్జునతో వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న ఆయన అభిమాని డి. శివప్రసాద్‌రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
దీని ద్వారా అజయ్ భుయాన్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. అజయ్ సాదాసీదా మనిషి కాడు. సినిమా మీద బాగా అధ్యయనం చేసిన యువకుడు. హై క్వాలిఫైడ్ పర్సన్. ఐఐటిలో డిగ్రీ, ఐఐఎం నుంచి ఎంబీఏ చేసిన అతను న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుంచి డిఎఫ్‌టి పట్టా తీసుకున్నాడు. నిజానికి 'దడ' అతని తొలి సినిమా కాదు. ఇదివరకే 'హౌస్‌ఫుల్' అనే సినిమాని డైరెక్ట్ చేశాడు. దీన్ని నిర్మించింది మరో డైరెక్టర్ అయిన చంద్రసిద్ధార్థ్. అయితే ఆర్థిక పరమైన కారణాలతో మూడేళ్ల క్రితమే తయారైన ఆ సినిమా ఇంతవరకు వెలుగు చూడలేదు.
ఏడాది క్రితం అతను చెప్పిన కథ నచ్చడంతో మాస్ హీరోగా జనం ముందుకు రావడానికి ఆ కథే సరైనదని నాగచైతన్యకు అనిపించింది. అలా 'దడ' మొదలైంది. ఇందులో అమెరికాలో నివసించే తెలుగు యువకుడిగా నాగచైతన్య కనిపించబోతున్నాడు. అంటే అమెరికా నేపథ్యంలోనే ఈ కథ నడుస్తుంది. అతనికి జోడీగా అందాల తార కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇంకో ఆసక్తికరమైన సంగతేమంటే నాగచైతన్య అన్నగా హీరో శ్రీరాం నటించడం. ఈ సినిమాలో ఆరు పాటలు, ఆరు ఫైట్లు ఉన్నాయి. పాటలకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తుంటే, ఫైట్లని బ్యాంకాక్‌కు చెందిన ప్రడిట్ సీలుయెం కంపోజ్ చేశాడు. ఈ నెల 20 లేదా 21న ఆడియో రిలీజ్ అవుతుండగా ఆగస్ట్ 11న ఆర్.ఆర్. ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా సినిమా విడుదలవనున్నది. మరి 'దడ'తో నాగచైతన్య మాస్ హీరో అనిపించుకుంటాడో, లేదో చూడాలి.

No comments: