Monday, July 4, 2011

న్యూస్: శ్రీకాంత్‌కి మళ్లీ నిరాశే

శ్రీకాంత్ ఆశలు మరోసారి వమ్మయ్యాయి. తప్పకుండా విజయం సాధించడంతో పాటు నటుడిగా తనకి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తుందని భావించిన 'విరోధి' సినిమాకి ప్రేక్షకులు కరువవడం అతణ్ణే కాదు సినీ వర్గాల్నే ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఎందుకటే ఆ సినిమాకి డైరెక్టర్ ప్రతిభావంతుడిగా పేరుపొందిన నీలకంఠ. కమర్షియల్‌గా పెద్ద హిట్టు కాకపోయినా క్లాస్ ఆడియెన్స్‌నీ, విమర్శకుల్నీ మెప్పిస్తుందని చాలామంది అనుకున్నారు. అయితే మేకా మీడియా బేనర్‌పై శ్రీకాంత్ తమ్ముడు అనిల్ నిర్మించిన ఈ సినిమా రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యిందని చెప్పాలి. సగటు ప్రేక్షకుడినే కాక మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌నీ ఈ సినిమా మెప్పించలేకపోతోంది. దాంతో దీనికి పెట్టిన పెట్టుబడి అంతా బూడిదలో పోసినట్లే. అంతే కాదు జర్నలిస్టుగా నటించిన శ్రీకాంత్ కంటే నక్సలైటుగా నటించిన అజయ్‌కే ఎక్కువ పేరొచ్చింది. కరెక్టుగా చెప్పాలంటే ఇది శ్రీకాంత్ సినిమా అని కాకుండా అజయ్ సినిమా అనే అంటున్నారు. ప్రధాన స్రవంతి సినిమా విధానంలో గాక కొత్త ధోరణిలో నీలకంఠ చేసిన ప్రయోగం ఎక్కువమందిని ఆకట్టుకోలేక పోతోంది. నక్సలిజం దారి తప్పిపోయిందని 'విరోధి'తో చెప్పాలని ఆయన యత్నించాడు. దానికి ఆయన ఎంచుకున్న స్క్రీన్‌ప్లే బోర్ కొట్టించింది. అందుకే ఈ సినిమా పట్ల ఎక్కువమంది ఆసక్తి కనపర్చడం లేదు.
2007లో 'ఆపరేషన్ దుర్యోధన', 'యమగోల.. మళ్లీ మొదలైంది' తర్వాత శ్రీకాంత్‌కి ఇంతవరకు మరో హిట్టు దక్కలేదు. 'మైఖేల్ మదన కామరాజు' నుంచి మొదలుకుని 'విరోధి' దాకా వరుసగా ఎనిమిది సినిమాలు అటకెక్కాయి. వీటిలో కృష్ణవంశీ డైరెక్షన్‌లో నటించిన 100వ సినిమా 'మహాత్మా' కూడా ఉంది. 'విరోధి' ఫ్లాపవడంతో శ్రీకాంత్ తన పాత్రల విషయంలో పునరాలోచించుకుంటే మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. శ్రీహరి తరహాలో ఓ వైపు హీరో పాత్రలు చేస్తూనే మరోవైపు నటనకు అవకాశమున్న ఇతర పాత్రల్ని చేసుకుంటే బెటర్ అనేది వారి అభిప్రాయం.

No comments: