చిత్ర పరిశ్రమ - ప్రభుత్వ జోక్యం
సినీ పరిశ్రమలో ప్రభుత్వ జోక్యం ఎంతవరకు ఉండాలి, అసలు ఉండవచ్చా? అనే చర్చ చాలా కాలంగా ఉంది. న్యాయానికి ఈ చర్చ రావలసింది కాదు. ఎందుకంటే, చిత్ర పరిశ్రమ ఇతర పరిశ్రమల మాదిరిగా నిత్యావసర వస్తువుల్ని ఉత్పత్తి చేసే పరిశ్రమ కాదు. వినోదం ప్రధానంగా ప్రజల్లో ఉన్నతాభిరుచులు పెంపొందించడానికి ఉపకరించేది. అంటే సాహిత్యంతో పోలినదన్న మాట. అయితే సాహిత్యం విషయంలో ప్రభుత్వ జోక్యాన్ని మనం ఏ రకంగానూ ఒప్పుకోం. ఒప్పుకుంటే సాహిత్యకారుల ప్రతిభా పాటవాలూ, పరిశీలనా దృష్టి పనికిరాకుండా పోతాయి. కానీ చిత్ర పరిశ్రమలో ఈ సమస్య వచ్చింది. ఇందులో ప్రభుత్వ జోక్యం ఎంతవరకూ, ఏ విధంగా ఉండాలనేది చూడాలి. ఇవాళ సినిమాలు తీసేవాళ్లలో నూటికి 95% మందికి ధనార్జనే లక్ష్యం. మిగతా 5% మంది కళాత్మక దృష్టి ఉన్నవాళ్లు. చక్కని సినిమాలు తీసి, చరిత్రలో నిలిచిపోవాలనేది వాళ్ల ఆశయం.ప్రభుత్వం ఈ పరిశ్రంలో జోక్యం చేసుకోవడం అంటే, నిర్మాతలకు అండగా ఉండి, వాళ్లకు చేయూతనివ్వాలి. ఇవాళ నిర్మాతలకున్న లోటుపాట్లు ప్రధానంగా పెట్టుబడి, థియేటర్ల లభ్యత. ఈ రెండింటి విషయంలో వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదనే భరోసా ఉంటే, నిర్మాతలు సమధికోత్సాహంతో చక్కని సినిమాలు తీయడానికి ముందుకు వస్తారు. ఆ ప్రకారం ప్రజల్లో నూతన భావాల వ్యాప్తికీ, ఉన్నతాభిరుచులు కలగడానికీ ప్రభుత్వం దోహదమవ్వాలి.
ప్రభుత్వం ఆ భరోసా కలిగించినా నిర్మాతలు ఇప్పటిలాగే మూస ప్రేమకథలు, మూస వినోదాత్మక చిత్రాలు, బకరా కంటెంట్ సినిమాలు తీస్తూనే ఉంటారనే సందేహం రావచ్చు. అదే జరుగుతుంది కూడా. అందుకని నిర్మాతలు తమ బాధ్యతల్ని గుర్తించేట్లు నిబంధనలు, నిషేధాలు పెట్టవచ్చు. ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఉద్దేశించిన మీడియాపైనే అలాంటి నిబంధనలు ఉన్నాయి కదా.
ఈ సందర్భంగా మీడియా ఎలాగైతే సమష్టిగా కొన్ని నియమ నిబంధనల్ని ఏర్పరచుకుందో, నిర్మాతలు కూడా అలాంటివి ఏర్పాటు చేసుకుంటే మంచిది. దీనికి ఫిల్మ్ చాంబర్ కానీ, నిర్మాతల మండలి కానీ పెద్దరికం వహించవచ్చు. అలా చేస్తే నిర్మాతలపై ప్రభుత్వం విధి నిషేధాలు పెట్టే అవసరమే కలగకపోవచ్చు. ఏదేమైనా భావ స్వేచ్ఛకూ, సినీ పరిశ్రమ అభివృద్ధికీ భంగం కలగని రీతిలోనే ప్రభుత్వ జోక్యం ఉండాలి.
సినిమాల వసూళ్ల విషయంలో థియేటర్ల లీజుదారులు/యజమానులు, సినిమాల ఏజెంట్లూ కలిసి నిర్మాతల్ని మోసం చేస్తున్నారనీ, థియేటర్‌లోని ప్రేక్షకుల సంఖ్యకూ, వసూళ్లకూ మధ్య భారీ తేడా కనిపిస్తుంటున్నదనీ తరచూ ఆరోపణలు వస్తున్నాయి. అంటే నిజంగా వసూలైన దానికంటే నిర్మాతకు లేదా డిస్ట్రిబ్యూటర్‌కు తక్కువగా వసూలైనట్లు లెక్కలు చెబుతున్నారనేది ఆరోపణ. ఈ విషయాన్ని నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు నిర్మాతలు చెప్పి బాధపడ్డారు.
దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఆన్‌లైన్ టికెటింగ్ ఒక్కటే మార్గమని అంటున్నారు. అందులో నిజముంది కానీ, మళ్లీ దానిపేరిట సర్వీస్ చార్జ్ అని అదనంగా ప్రేక్షకుల నుంచి వసూలు చేయకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత.
No comments:
Post a Comment