'సర్దార్ గబ్బర్‌సింగ్' బాధ్యతతో ప్రవర్తిస్తాడా?
పవన్‌కల్యాణ్ కెరీర్‌ను అమాంతం అందలం ఎక్కించిన సినిమా 'గబ్బర్‌సింగ్'. సల్మాన్‌ఖాన్ హిందీ సినిమా 'దబాంగ్'కు రీమేక్‌గా హరీశ్‌శంకర్ రూపొందించిన ఈ సినిమా మూడు వరుస ఫ్లాపుల తర్వాత కల్యాణ్‌కు దక్కిన ఘన విజయం. అంతకు ముందు 'పులి', 'తీన్‌మార్', 'పంజా' సినిమాల పరాజయాలతో అతను విమర్శల్ని ఎదుర్కొన్నాడు. కథల విషయంలో తప్పటడుగులు వేస్తున్నానని గ్రహించిన అతను పక్కా మాస్ మసాలా కథను ఎంచుకొని విజయాన్ని సాధించాడు. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా 'సర్దార్ గబ్బర్‌సింగ్'ను చేస్తున్నాడు. అప్పటికీ, ఇప్పటికీ తేడా ఏమంటే.. అప్పుడు ఆయన జనసేనాధినేత కాదు. ఇప్పుడు దానికి అధినేత. ఇప్పటివరకూ ఎన్నికల్లో పాల్గొనకపోయినా జనసేన రాజకీయ పార్టీయే. దానికి ఎన్నికల సంఘం గుర్తింపు వచ్చింది. ఇప్పుడు పవన్‌కల్యాణ్ కేవలం నటుడు కాదు. ఎంతో బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు కూడా. తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై స్పందిస్తూ, అవసరమైతే.. వాళ్ల వద్దకు వెళ్తూ, వాళ్లకు తానున్నానంటూ భరోసా కల్పిస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి 'సర్దార్ గబ్బర్‌సింగ్'ను చేస్తుండటం వల్ల అందరి దృష్టీ దానిపై ప్రసరిస్తోంది. ఆ సినిమాలో ఆయన ఎలా కనిపిస్తాడనే అంశం దగ్గర్నుంచీ, ఆ సినిమాతో ఆయన ఏం చెప్పబోతున్నాడో కూడా జనం గమనిస్తారు. 'గబ్బర్‌సింగ్'లో మాదిరిగా సీక్వెల్‌లోనూ కనిపిస్తే విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్ అయ్యుండీ యూనిఫాం వేసుకునే తీరు నుంచీ, అతను ప్రవర్తించే విధానం దాకా అంతా సినిమాటిక్‌గా ఉంటుందే కానీ, వాస్తవికంగా ఉండదు. ఇప్పుడు కూడా గబ్బర్‌సింగ్ కేరక్టర్ అదే తరహాలో ప్రవర్తిస్తే, బాధ్యత లేకుండా సినిమా చేశాడనే విమర్శలు తప్పవు. రాజకీయ నాయకులు కూడా దీన్ని అవకాశంగా తీసుకొని, ఆయనను దుమ్మెత్తిపోయవచ్చు. పైగా ఈ సీక్వెల్ కథా రచయిత కూడా స్వయంగా కల్యాణే. అందువల్ల సబ్జెక్ట్‌తో పాటు తన పాత్ర విషయంలోనూ ఆయన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా 2016 సంక్రాంతికి విడుదల కానున్నది.
No comments:
Post a Comment