రెట్టింపు ఉత్సాహంతో రాజమౌళి.. మరోసారి తప్పదు కాసుల బలి!
విషయపరంగా ఎలాంటి కొత్తదనం లేకపోయినా, సమాజానికి ఉపకరించే అంశాలేమీ లేకపోయినా, కేవలం భారీతనం, గ్రాఫిక్స్ మాయాజాలం, ఉచిత మీడియా ప్రచారంతో 'బాహుబలి - ది బిగినింగ్' తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త బాక్సాఫీస్ రికార్డులు సాధించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయం ఆ చిత్ర దర్శకుడు యస్.యస్. రాజమౌళికీ తెలుసు. ఈ సినిమాతో రాజమౌళికీ, కథారచయితగా ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్‌కూ అవసరానికి మించి దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు లభించాయి. కొంతమందికి ఎంత ప్రతిభ ఉన్నా కాలం కలిసిరాక పేరు రాదు, అవకాశాలూ రావు. కొంతమందికి ప్రతిభను మించి కాలం కలిసిరావడంతో అప్పనంగా పేరు వచ్చేస్తుంది. 'బాహుబలి'ని గ్రాఫిక్స్ మినహాయించి, సబ్జెక్ట్ మీద దృష్టి కేంద్రీకరించి చూస్తే, సమాజ పురోగతికి అదెంత అపకారో అర్థమవుతుంది. రాచరికాలు, స్పర్థలు, బానిసత్వం, అర్థంపర్థంలేని యుద్ధాలతో ఆ సినిమా మొత్తం ఫ్యూడల్ కంపు కొడుతూ ఉంటుంది. అలాంటి సినిమా ప్రప్రంచవ్యాప్తంగా తనకే నమ్మశక్యం కానంతగా వసూళ్లు సాధించడంతో, రెట్టింపైన ఉత్సాహంతో రాజమౌళి దీనికి సీక్వెల్ 'బాహుబలి - ద కంక్లూజన్'ను తయారుచేసే పనిలో పడ్డాడు. మొదటి భాగం చూసినవాళ్లకు రెండో భాగంలో కథ ఎలా ఉండబోతుందో అర్థమైపోతుంది. అమరేంద్ర బాహుబలి, దేవసేన మధ్య ప్రణయం, పెళ్లి, రాజ్యం కోసం బాహుబలిని భల్లాలదేవ ఎలా చంపిందీ, అతడిని చంపి మహేంద్ర బాహుబలి/శివుడు ఎలా ప్రతీకారం తీర్చుకుందీ అందులో చూడబోతున్నాం. దానిని ఎంత ఆసక్తికరంగా చూపించాలనే దానిపై రాజమౌళి కసరత్తులు చేస్తున్నాడు. 2016 జూన్ లేదా జూలైలో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే రెండు సినిమాల పెట్టుబడికి మించి లాభాలు వచ్చినందున ఆ సినిమా బిజినెస్ విషయమై నిర్మాతలకు ఎలాంటి టెన్షన్లూ లేవు. ప్రేక్షకుల చెవుల్లో పువ్వులుపెట్టి ఈ రెండో భాగం నుంచి వారి నుంచి ఎన్ని కోట్లు పిండుకోవాలనే లెక్కల్లో ఉంటారు. మొదటి భాగం మాదిరిగానే దీనికీ వద్దన్నా విపరీత ప్రచారం ఇవ్వడానికి మీడియా కూడా ఇప్పట్నించే ఆత్రుతగా ఎదురుచూస్తోంది. రాజమౌళికి ఇంతకు మించి ఏం కావాలి!
No comments:
Post a Comment