'నాన్నకు ప్రేమతో'.. ఆ ఇద్దరికీ కీలకమే!
ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' సినిమా ఎలా ఉండబోతోంది?.. ఇది ఇప్పుడు చాలామంది తెలుగు సినిమా ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న విషయం. కావాల్సినంత ప్రతిభ ఉన్నా, ఎంచుకుంటున్న కథల కారణంగా అగ్ర హీరో రేసు నుండి ఎన్టీఆర్ కాస్త దూరం జరిగిపోయాడనేది విశ్లేషకుల అభిప్రాయం. 'ఆది', 'సింహాద్రి' సినిమాలతో అతను టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అవుతాడని అప్పట్లో అంచనాలు వేశారు. కానీ ఆ తర్వాత అతను అనూహ్యంగా వెనకపడిపోయాడు. 'సింహాద్రి' తర్వాత ఆ స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించిన సినిమా అతని నుంచి రాలేదు. 'యమదొంగ', 'అదుర్స్', 'బృందావనం', 'బాద్‌షా' సినిమాలు ఆశలు కల్పించాయి కానీ అతని ఇమేజ్‌ను పెంచలేకపోయాయి. మొన్న వచ్చిన 'టెంపర్' అతని సినిమాల్లోనే భారీ ఓపెనింగ్స్ సాధించింది కానీ, చివరకు అదీ మామూలు సినిమా జాబితాలోనే చేరింది. ఎన్టీఆర్ కేరక్టర్‌ను పూరి జగన్నాథ్ తీర్చిదిద్దిన తీరు కూడా విమర్శలపాలైంది. ఇలాంటి నేపథ్యంలో 'నాన్నకు ప్రేమతో' సినిమా రాబోతోంది. ఇందులో అల్ట్రా మోడరన్ గెటప్ వేసి కుతూహలం రేపుతున్నాడు ఎన్టీఆర్. పైగా దర్శకత్వం వహిస్తోంది సుకుమార్ అయ్యే. మహేశ్‌తో చేసిన '1.. నేనొక్కడినే' సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినప్పటికీ, అతని టేకింగ్ హై క్లాస్‌లో ఉందనేది నిజం. రేజర్ ఎడ్జ్ సబ్జెక్ట్, స్క్రీన్‌ప్లేతో అతను ఆడే ఆట ఒక్కోసారి రక్తికడితే, ఇంకోసారి పక్కదారి పడుతుంటుంది. అతనితో వచ్చే సమస్య అదే. అందుకే 'నాన్నకు ప్రేమతో' సినిమాని అతను ఎలా రూపొందిస్తున్నాడనేది ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్టీఆర్ లుక్స్‌ను అతను డిజైన్ చేసిన తీరుకు పాజిటివ్ రెస్పాన్స్‌తో పాటు నెగటివ్ రెస్పాన్స్ కూడా వస్తోంది. తెలుగువాళ్లలో మాస్ ఆడియెన్స్ ఎక్కువ కాబట్టి, ఆ అల్ట్రా గెటప్‌ను వాళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారనే ప్రశ్న తలెత్తుతోంది. ఇటీవలి కాలంలో వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్న రకుల్‌ప్రీత్ సింగ్ నాయికగా నటించిన 'నాన్నకు ప్రేమతో' సినిమా ఎన్టీఆర్, సుకుమార్.. ఇద్దరి కెరీర్‌కూ ముఖ్యమైనదే. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా వాళ్లకు ఎలాంటి అనుభవాన్నిస్తుందో చూడాలి.
No comments:
Post a Comment