'నేనే మొనగాణ్ణి' చిత్ర కథాంశం
బెజవాడ భద్రయ్య (రాజనాల) బందిపోటు దొంగ. పేరుచెప్పి మరీ దోపిడీలు చేస్తుంటాడు. అతణ్ణి డీఎస్పీ నందనరావు (సత్యనారాయణ) వెంటాడుతూ ఉంటాడు. ఒక దోపిడీ సందర్భంలో ఆ ఇద్దరూ తారసపడతారు. నందనరావును చంపిన భద్రయ్య తన నాలుగేళ్ల కొడుకు నానీతో పారిపోతూ, పోలీసు తుపాకీ దెబ్బలు తిని, తన కొడుకును ఒక బావిలో పడేసి, తను పారిపోతాడు. భద్రయ్యను అతని ముఠా పోలీసుల దృషిపడని దూరప్రాంతానికి తీసుకుపోతారు. తన కొడుకు చనిపోయాడనుకున్న భద్రయ్య, దానికి కారణమైన డీఎస్పీ కుటుంబంపై కసి పెంచుకుంటాడు.
అయితే నానీ చనిపోలేదు. నందనరావు ఇంట్లో పెరుగుతున్నాడు. తన భర్తను చంపినవాడిపై కసితీర్చుకోవడానికే అతని కొడుకును తన ఇంట్లో పెట్టుకున్న ఆయన భార్య శాంత (శాంతకుమారి)లో ఆ పసివాడు మాతృత్వాన్ని రేకెత్తిస్తాడు. ఆ బాబును దేవుడిచ్చిన బిడ్డగా భావించి పెంచుతుందామె. అ పిల్లాడు వంశీధర్ (ఎన్టీఆర్)గా పెద్దవాడవుతాడు. అందమైన అమ్మాయిలతో కలిసి హుషారుగా చిందులేస్తూ ఉంటాడు. నందనరావు బావమరిది పోలీస్ కమీషనర్ (ధూళిపాళ). ఆయన కూతురు నీల (షీలా), వంశీధర్ మనసులు ఇచ్చిపుచ్చుకొని బావామరదళ్లుగా సరస సల్లాపాల్లో పడతారు.
తిరిగొచ్చిన భద్రయ్య దేశంలో అల్లకల్లోలం లేపాలనుకున్న ఒక విదేశీ ఏజెంట్ల ముఠాకు నాయకుడవుతాడు. దేశంలో అల్లర్లనూ, అరాచకాలనూ ప్రేరేపిస్తుంటాడు. తన కొడుకును బలితీసుకున్న నందనరావు కొడుకు వంశీని చంపాలని కంకణం కట్టుకుంటాడు. ఈ ముఠాను పట్టుకోవాలనుకున్న వంశీ అనుమానాస్పద పరిస్థితుల్లో పోలీసులకు చిక్కి జైలుకెళతాడు. తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాలని జైలునుంచి తప్పించుకుంటాడు. ఫలితంగా దొంగల ముఠాకు వంశీయే నాయకుడన్న అనుమానాలు బలపడతాయి. దాంతో అతనిపై నిఘా వేస్తాడు పోలీస్ కమీషనర్. వీటన్నిట్నించీ తప్పించుకుంటూ, దొంగల ముఠాను హతమార్చి తానే మొనగాణ్ణని నిరూపించుకుంటాడు వంశీ.
తారాగణం: ఎన్టీ రామారావు, షీలా, రాజనాల, ధూళిపాళ, శాంతకుమారి, గీతాంజలి, సంధ్యారాణి, జ్యోతిలక్ష్మి, రామకృష్ణ, రమణారెడ్డి, రాజబాబు, సత్యనారాయణ (గెస్ట్), బాలయ్య, అల్లు రామలింగయ్య
సంగీతం: టీవీ రాజు
నిర్మాత, దర్శకుడు: ఎస్.డి. లాల్
బేనర్: ప్రతిమా ఫిలిమ్స్
విడుదల తేదీ: 4 అక్టోబర్
No comments:
Post a Comment