'డిక్టేటర్' మరో 'లెజెండ్' అవుతాడా?
'సింహా' తర్వాత చాన్నాళ్ల దాకా మళ్లీ హిట్ లేకపోవడంతో రేస్ నుంచి బాలకృష్ణ పూర్తిగా తొలగిపోయాడనుకున్నాయి వైరి వర్గాలు (వీవీ). అవి చంకలు గుద్దుకుంటూ ఉండగానే 'లెజెండ్'ని అంటూ వచ్చాడు. ఈయనేం లెజెండ్? అందరివాడనుకున్న వాణ్ణే కొందరివాడుగా మిగిల్చిన జనం బాలయ్యను 'లెజెండ్'గా ఒప్పుకుంటారా?.. అని వైరి వర్గాలు కుప్పిగంతులు వేశాయి. ఏమైంది? మూతులు పగిలాయి. 'లెజెండ్'గా బాలయ్యను జనం ఏకగ్రీవంగా ఒప్పేసుకున్నారు. ఆ సినిమా కాస్తా ఆయన కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు వసూలుచేసి పెట్టింది. అందులో బాలయ్య డబుల్‌రోల్ చేసి మెప్పించాడు. దాని తర్వాత 'లయన్'గా వచ్చిన బాలయ్యను జనం యాక్సెప్ట్ చెయ్యలేదు. ఆల్రెడీ 'సింహా'గా నిన్ను ఒప్పేసుకున్నాం కదా, మళ్లీ భాష మార్చి 'లయన్'గా రావడమెందుకని అడిగేశారు జ్జనం. వైరి వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. ఇప్పుడు బాలయ్య 'డిక్టేటర్'ని అంటున్నాడు. ఈ రోజుల్లో డిక్టేటర్‌షిప్ నడవదు కాబట్టి జనం ఈ సినిమాని మడతపెట్టేస్తారని అప్పుడే వీవీ ప్రచారం చేసేస్తోంది. మీరెంతగా నెగటివ్ ప్రచారం చేస్తే నాకంతగా మంచిదన్నట్లు చిద్విలాసంగా ఉన్నాడు బాలయ్య. ఎందుకంటే ఆయన 'డిక్టేటర్'గా ఉండేది దుష్టులకని వీవీకి తెల్వదు కాబట్టి. ఇంతకు ముందే 'లౌక్యం' అనే జనం మెచ్చిన సినిమా తీసిన శ్రీవాస్ 'డిక్టేటర్'ను తీర్చిదిద్దుతున్నాడు. కోన వెంకట్, గోపీమోహన్ కలిసి ఇచ్చిన స్క్రిప్ట్ కాబట్టి మినిమం గ్యారంటీ సినిమా అని ఆయన బల్లలు విరిగిపోయేంత గట్టిగా చెబుతున్నాడు. పైగా ఈరోస్ ఇంటర్నేషనల్ కంపెనీతో కలిసి ఆయన స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. దానికోసం వేదాశ్వ క్రియేషన్స్ అనే బేనర్‌ని కూడా పెట్టాడు. 'డిక్టేటర్'లో బాలయ్య ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురితో జత కడుతున్నాడు. వాళ్లు.. అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష. ఇక జనానికి వినోదాల విందే అని యూనిట్‌వాళ్లు అంటున్నాయి. వీవీకి మరోసారి శృంగభంగం తప్పదని వాళ్లు ఘంటాపథంగా చెబుతున్నారు.
No comments:
Post a Comment