'అనార్కలి' చిత్ర కథాంశం:
పారశీకంలో పుట్టిన అందాల సుందరి 'నాదిరా' దురదృష్టవశాతూ తనవాళ్లతో కలిసి ఆగ్రా నగరం చేరాల్సి వస్తుంది. ఒకసారి అక్బర్ పాదుషా వారి దానిమ్మతోటలో నాదిరా పూలు కోసుకుంటూ, పాట పాడుతూ ఉంటే, ఆ మధుర గానానికి యువరాజు సలీం ముగ్ధుడవుతాడు. ఆమెను చూసి ఆ దివ్య సౌందర్యానికి దాసుడవుతాడు. నాదిరా కూడా అమాయకంగా సలీం ప్రేమలో పడుతుంది. అప్పట్నించీ రోజూ వాళ్లిద్దరూ ఆ తోటలో కలుసుకుంటూ ఉంటారు. నాదిరా పాడుతున్న సమయంలో ఒకసారి తోటకు వచ్చిన అక్బర్ ఆమె గానానికి పరవశుడై ఆమెకు 'అనార్కలి' అనే బిరుదునిస్తాడు.కాబూల్‌లో కల్లోలం చెలరేగడంతో, దాన్ని అణచడానికి అక్కడకు వెళ్తాడు సలీం. తన ప్రియుణ్ణి వెదుకుతూ బందిపోటు దొంగలకు పట్టుబడుతుంది అనార్కలి. బానిసల్ని విక్రయించే బజారులో అనార్కలిని బహిరంగంగా వేలం వేస్తాడు బందిపోటు నాయకుడు. ముసుగులో ఉన్న సలీం అధిక ధరకు పాడి ఆమెను కొనుక్కుంటాడు. తన స్వాధీనంలోకి వచ్చిన అనార్‌ను మారువేషంలోని సలీం బలాత్కరించబోతాడు. తన శీలాన్ని భంగపరచవద్దనీ, అదివరకే తన హృదయం మరొకరికి అర్పించాననీ అతన్ని ప్రాధేయపడుతుంది అనార్.
ఆమె నిష్కల్మష ప్రేమను గుర్తించి ఆనందంతో తన ముసుగు తొలగించి, ఆమెనూ ఆనందింపజేస్తాడు సలీం.
యుద్ధంలో సలీంకు బలమైన గాయం తగులుతుంది. అతన్ని ఆగ్రా తీసుకుపోతారు. అనార్ కూడా ఆగ్రా చేరుకుంటుంది. ఎన్ని మందులు వాడినా సలీంకు స్పృహ రాదు. చివరకు అనార్ మధురగానం చెవికి సోకి ఈ లోకంలోకి వస్తాడు సలీం. అనార్ చేసిన మేలుకు సంతోషించిన అక్బర్ ఆమెకు తన కోటలో ఆతిథ్యం ఇస్తాడు. ఆమె అక్కడే నివాసం ఉంటుంది. సలీం ఆరోగ్యవంతుడైన సంతోషంలో ఆగ్రాలో మహోత్సవాలు చేయిస్తాడు అక్బర్. అనార్ అద్భుత నాట్యానికి నజరానాగా ఆమెను రాజనర్తకిగా నియమిస్తాడు.
సలీంపై ఆశలు పెట్టుకున్న గుల్‌నార్‌కు అనార్‌పై అసూయ కలుగుతుంది. సలీం, అనార్ ప్రణయాన్ని భగ్నం చేయాలని కక్ష కడుతుంది. సలీం యువరాజ పట్టాభిషేక మహోత్సవంలో అనార్కలి నాట్యం ఏర్పాటు చేస్తారు. పానీయంలో మత్తుమందు కలిపి అనార్ చేత తాగిస్తుంది గుల్‌నార్. మైకంతో నాట్యంలోనే శృంగార చేష్టలు చేస్తూ యువరాజుపై పడుతుంది అనార్.
దాంతో అక్బర్ ఆమెను ఖైదుచేయిస్తాడు. ఇది తట్టుకోలేని సలీం తండ్రిపై తిరుగుబాటు చేస్తాడు. తల్లిముఖం చూసి తన యుద్ధాన్ని విరమించి బందీ అవుతాడు. దర్బార్‌లో అనార్, సలీంలను దోషులుగా నిర్ణయించి ఇద్దరికీ మరణదండన విధిస్తాడు అక్బర్. సలీంను వధించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో అక్బర్ స్వయంగా కుమారుని చంపడానికి పూనుకుంటాడు. కానీ అతనిలోని పుత్రవాత్సల్యం వెనుకంజ వేయిస్తుంది. సలీంను విడిచిపెడతారు. మరోవైపు అనార్కలిని సజీవ సమాధి చేస్తుంటారు. ఆమెను కాపాడాలని గుర్రంపై బయలుదేరుతాడు సలీం. దారిలో అతనిపై బాణం వేస్తుంది గుల్‌నార్. అది అతని వెన్నులో దిగుతుంది. అయినా తన ప్రయత్నం వీడక ముందడుగు వేస్తాడు. సలీం వచ్చేసరికి అనార్ సమాధి పూర్తయిపోతుంది. విలపిస్తూ తన తలను సమాధికేసి కొట్టుకుంటాడు.
తారాగణం: అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, ఎస్వీ రంగారావు, కన్నాంబ, చిత్తూరు నాగయ్య, పేకేటి శివరాం, సురభి బాలసరస్వతి, హేమలత
సంగీతం: ఆదినారాయణరావు
నిర్మాత: ఆదినారాయణరావు
దర్శకుడు: వేదాంతం రాఘవయ్య
బేనర్: అంజలీ పిక్చర్స్
విడుదల తేదీ: 28 ఏప్రిల్
No comments:
Post a Comment