'దేవదాసు'తో ఇలియానా పేరు ఎలా మారుమోగిందో, అలాగే 'ఝుమ్మంది నాదం'తో తాప్సీ పేరు ప్రచార మాధ్యమాల్లో మోగిపోయింది. సహజంగానే ఆమెతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు బారులు తీరారు. ప్రస్తుతానికైతే ఆమె మూడు సినిమాలు చేస్తోంది. ఒకటి ప్రభాస్‌తో దిల్ రాజు నిర్మిస్తోన్న సినిమా, రెండోది విష్ణుతో మోహన్‌బాబు నిర్మిస్తోన్న 'వస్తాడు నారాజు', మూడోది రవితేజ సినిమా 'వీర'. వచ్చే ఏడాది ఆమె డైరీలో ఖాళీ లేదనేది సమాచారం.
ఈ ఇద్దరితో పాటు మరో తార కూడా నేను సైతం అంటూ ముందుకొస్తోంది. ఆమె శేఖర్ కమ్ముల రూపొందించిన 'లీడర్' ద్వారా నాయికగా పరిచయమైన బెంగాలీ భామ రిచా గంగోపాధ్యాయ్. గతంలో శేఖరే పరిచయం చేసిన 'ఆనంద్'తో పరిచయమైన మరో బెంగాలీ తార కమలినీ ముఖర్జీ ఆ సినిమా తర్వాత అనుకున్న మేర రాణించని నేపథ్యంలో రిచా ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి. 'లీడర్'లో ఫర్వాలేదనిపించిన ఆమె, రెండో సినిమాలోనే రవితేజ వంటి స్టార్ హీరోతో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ సినిమా పేరు 'మిరపకాయ్'. హరీశ్ శంకర్ దర్శకుడు. కొత్త తారల్లో అందంతో పాటు కొద్దో గొప్పో అభినయ సామర్థ్యం వున్న తార మధురిమ. 'ఆ ఒక్కడు' అనే సినిమాలో తన నటనతో మెప్పించిన ఆమె ఇటీవల వంశీ సినిమా 'సరదాగా కాసేపు'లో నరేశ్‌కి జోడీగా ఆకట్టుకుంది. అయితే ఆమెకి చిత్రసీమ ఏమేరకు అవకాశాలు కల్పిస్తుందనే దానిపైనే ఆమె భవితవ్యం ఆధారపడి వుంది.
ఇక తెలుగు తారల సంగతికొస్తే, వారిలో ఏ ఒక్కరూ కొన్నాళ్లపాటైనా ప్రేక్షకుల్లో ఆదరణ నిలుపుకుంటారని చెప్పలేని స్థితి. 'నచ్చావులే'తో మెరిసిన మాధవీలత ఇమేజ్ ఆ తర్వాత ఒక్కసారిగా మసకబారిపోయింది. ఇప్పుడామెని తలచుకుంటున్నవాళ్లే లేరు. 'అష్టాచమ్మా'లో ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకున్న స్వాతికి స్టార్ ఇమేజ్ రావడం కష్టమే. 'ఆవకాయ్ బిర్యానీ' చేదుగా మారినా, 'బంపర్ ఆఫర్'తో ఓ మోస్తరుగా రాణించిన బిందుమాధవికి సరైన అవకాశాలు లేవు. మిగతావాళ్లకి ఆ మాత్రం పేరు కూడా లేదు. ఏదేమైనా హీరోతో పాటు హీరోయిన్ పాత్రకీ కథలో ప్రాధాన్యత ఉంటేనే నాయికలు ఎక్కువకాలం పరిశ్రమలో నిలుస్తారు. అందుకు హీరోలు, దర్శకులు, రచయితలు పెద్ద మనసు చేసుకోవాలి. (అయిపోయింది)
No comments:
Post a Comment