Sunday, November 21, 2010

ఫోకస్: నిలిచే తార ఎవరు? (రెండో భాగం)

'శశిరేఖా పరిణయం'లో ఆమె నటన కొన్ని సందర్భాల్లో చికాకుని సైతం కలిగించిన సంగతి అనుభవమే. మిగిలిన తారల్లో తమ నటనా కౌశలంతో సినిమాకి వన్నె తెచ్చిన వాళ్లెవరూ లేరు. వాళ్ల సంగతలా వుంచితే ఇప్పుడిప్పుడే వస్తోన్న తారల్లో అయినా సౌందర్య మాదిరిగానో, విజయశాంతి మాదిరిగానో నిలిచేవాళ్లెవరు?
'జోష్' కలిగిస్తుందనుకున్న రాధ కూతురు కార్తీక, 'వరుడు' సరసన కనిపించిన భానుశ్రీ మెహ్రా, 'మరో చరిత్ర' సృష్టిస్తుందనుకున్న అనిత, 'కొమరం పులి'తో పరిచయమైన నికిషా పటేల్ వంటివాళ్లు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. అందుకే వాళ్లలో ఎవరికీ ఇంతదాకా రెండో సినిమా అవకాశం రాలేదు. 'కొత్త బంగారులోకం'తో పరిచయమై, తొలి సినిమా తోటే ఆకట్టుకున్న బెంగాలీ అమ్మాయి శ్వేతాబసు ప్రసాద్ తర్వాత్తర్వాత మరింత రాణిస్తుందనుకుంటే, అందుకు విరుద్ధంగా క్రేజ్‌ని కోల్పోతూ వస్తోంది.
'ఎవరైనా ఎపుడైనా', 'గాయం 2' చిత్రాల్లో కనిపించిన విమలా రామన్; 'సిద్ధు ఫ్రం సికాకుళం', 'శుభప్రదం' చిత్రాల్లో కనిపించిన మంజరి ఫద్నిస్ కానీ, 'లీడర్', 'రామరామ కృష్ణకృష్ణ' సినిమాల్లో నటించిన ప్రియా ఆనంద్; 'ఏం పిల్లో ఏం పిల్లడో', 'బావ' సినిమాల్లో నటించిన ప్రణీత కానీ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయారు. ఇక మిగిలిన వాళ్లలో స్టార్లుగా ఎదిగే సత్తా వున్నవాళ్లు ఇప్పటికైతే ఇద్దరే కనిపిస్తున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు సమంతా కాగా, మరొకరు తాప్సీ.  
గౌతం మీనన్ డైరెక్ట్ చేసిన 'ఏ మాయ చేసావె'తో పరిచయమైన సమంతా ఎంతగా ఆకట్టుకున్నదీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జెస్సీ పాత్రలో అమోఘంగా రాణించి, యువతరాన్ని కట్టిపడేసిన ఈ సుందరి ఎన్‌టీఆర్ సినిమా 'బృందావనం'లోనూ తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించింది. కాజల్ అగర్వాల్ చేసిన భూమి పాత్రతో పోలిస్తే తను చేసిన ఇందు పాత్ర నిడివి తక్కువ. అయితేనేం, ఆ పాత్రలోనూ చక్కగా అలరించింది. ఇప్పుడామె చేతిలో రెండు క్రేజీ సినిమాలున్నాయి. రెండూ సూపర్‌స్టార్ల సినిమాలే. వాటిలో ఒకటి మహేశ్ సరసన చేస్తోన్న 'దూకుడు'. మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న శ్రీను వైట్ల రూపొందిస్తోన్న ఈ సినిమాలో సమంతా పాత్రకు తగినంత ప్రాధాన్యత ఉంది. ఇక రెండోది పవన్ కల్యాణ్‌తో చేయబోతున్న సినిమా. వీవీ వినాయక్ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించబోతున్నారు. ఇవికాక మరెన్నో ఆఫర్లు ఆమె చేతిలో ఉన్నాయి.
సమంతా లాగే తాప్సీ తెరంగేట్రం కూడా బాగానే జరిగింది. హీరోయిన్లను అతి సుందరంగా చూపించగల సీనియర్ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు రూపొందించిన 'ఝుమ్మంది నాదం' చిత్రంలో మనోజ్ సరసన నటించడం ద్వారా తెలుగు తెరకి పరిచయమైన ఉత్తరాది భామ తాప్సీ రూప లావణ్యాలు ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. ఆ సినిమా అనుకున్నంతగా ఆడకపోయినా తాప్సీకి వచ్చిన క్రేజ్ చాలా ఎక్కువే. (ఇంకావుంది)

No comments: