Tuesday, August 23, 2011

న్యూస్: కామెడీతో 'మనీ మనీ మోర్ మనీ' వస్తుందా?

గురువు రాంగోపాల్‌వర్మ్‌తో పోలిస్తే జె.డి. చక్రవర్తికి ఎన్నో పోలికలు కనిపిస్తాయి. దెయ్యాలు, భూతాల మీదా, గేంగ్‌స్టర్ల మీదా కథలల్లి సినిమాలు తియ్యడం వాటిలో ఒకటి. అయితే కొన్ని ఇతర అంశాల విషయాలకొస్తే ఇద్దరికీ ఏమాత్రం పొంతన కుదరదు. 'నిశ్శబ్ద్', 'అప్పల్రాజు' లాంటి సినిమాల్ని తానెన్నటికీ తీయనంటాడు జేడీ. వర్మ పని రాక్షసుడూ, కుటుంబ అనుబంధాలకు అతీతుడూ అయితే, జేడీ ఎమోషనల్ మేన్. రాత్రి 7.30 గంటల తర్వాత ఇంటికి వెళ్లకుండా అతణ్ణి ఏ శక్తీ ఆపలేదు. ఎందుకంటే అమ్మకోసం. ఇటీవలి కాలంలో వర్మ చాలా వివాదాల్లో ఇరుక్కొని, మీడియాలో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నా వర్మని తాను తొలిసారి చూసినప్పటికీ, ఇప్పటికీ ఆయనలో తనకి కనిపించిన మార్పేమీ లేదంటాడు జేడీ. తన తోటివాళ్లంతా ఫేస్‌బుక్‌లోనో, ట్విట్టర్ ద్వారానో తమ భావాల్ని పంచుకుంటుంటే అతను మాత్రం వాటికి చాలా దూరంగా ఉంటున్నాడు. తనెప్పుడు ఏం చేసేదీ జనానికి తెలియాల్సిన పని లేదనేది అతడి సమాధానం. ప్రస్తుతం అతను 'మనీ మనీ మోర్ మానీ' అనే తెలుగు సినిమా డైరెక్షన్‌లో మునిగి ఉన్నాడు. ఇది 'మనీ'కి రెండో సీక్వెల్ అనీ, అయితే ఇది కొత్త కథనీ అతను తెలిపాడు. ఇదివరకటి సినిమాల్లో నటించిన బ్రహ్మానందం, బ్రహ్మాజీ ఈ సినిమాలోనూ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. "ఖాన్‌దాదా (బ్రహ్మానందం) కరాటేలో బ్లాక్‌బెల్ట్ హోల్డర్. రియల్ ఎస్టేట్ బూంలో బాగా సంపాదించిన ఖాన్‌దాదా జూబ్లీహిల్స్‌లో మంచి ఇల్లు కొనుక్కుంటాడు. అయితే 2011కి వచ్చేసరికి అప్పులపాలై ఇల్లు అమ్మకానికి పెట్టాలనుకుంటాడు. ఆ టైంలో అతనింట్లోకి నలుగురు కిడ్నాపర్లు ప్రవేశించి అతనితో ఎలా ఆడుకున్నారనేదే కథ.ఈ సినిమా కథ బ్రహ్మానందం చుట్టూ నడుస్తుంది. ఆయన లేకుండా ఈ సినిమాని మెప్పించలేను. బ్రహ్మానందం విశ్వరూపం ఇందులో కనిపిస్తుంది" అని చెప్పాడు జేడీ. ముందటి సినిమాల్లో బ్రహ్మానందం మీద తీసిన 'భద్రం బే కేర్‌ఫుల్ బ్రదరూ', 'వారెవా యేమి ఫేసు' మాదిరిగానే ఈ సినిమాలోనూ బ్రహ్మానందంపై ఓ పాటని అతను తీశాడు. 'హోమం', 'సిద్ధం' వంటి యాక్షన్ సినిమాల్ని జగపతిబాబుతో తీసిన జేడీ ఇప్పుడు బాణా మార్చి కామెడీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలని ఆశిస్తున్నాడు. అతని ప్రయత్నం ఫలిస్తుందా?

No comments: