Friday, August 12, 2011
న్యూస్: 'సెగ' ఆరిపోయింది!
నానికి 'సెగ' తగిలింది. ఆ సినిమా గురించి అతను చెప్పిన గొప్పలు ఉత్తవని తేలిపోయాయి. బాక్సాఫీసు వద్ద అది ఫెయిలైంది. తమిళ వెర్షన్ 'వెప్పం' పరిస్థితి కూడా ఇదేనని తెలిసింది. 'సెగ'లో కార్తీక్ పాత్రలో నాని రాణించాడు. డైరెక్టర్ అంజన సినిమాని రియలిస్టిక్‌గా తీసింది. పెద్దల పెంపకం సరిగా లేకపోతే పిల్లలు ఎలా తయారవుతారనే కథాంశంతో ఈ సినిమాని ఆమె రూపొందించింది. అయితే ఈ సినిమాలోని పాత్రలు, సన్నివేశాలు ప్రేక్షకుల్ని మెప్పించలేక పోయాయి. అందుకే బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. ప్రధానంగా క్రైం థ్రిల్లర్‌గా కనిపించిన ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ మిస్సయ్యింది. తెలుగు ప్రేక్షకులు ఇటీవలి కాలంలో ఆదరించిన సినిమాలన్నీ ఎంటర్‌టైనర్సే కావడం గమనార్హం. ఈ సినిమా రిలీజ్‌కి ముందు "నందినీరెడ్డి తరహాలోనే అంజన చాలా ప్రతిభావంతురాలు. నాలుగు సినిమాలు చేస్తే ఆమె ఇంటర్నేషనల్ లెవల్లో పేరు తెచ్చుకుంటుంది" అని తెగ పొగిడేశాడు నాని. దాంతో 'సెగ' చాలా గొప్పగా ఉంటుందనీ, నానికి మరో హిట్టు గ్యారంటీ అని అంతా అనుకున్నారు. రిలీజయ్యాక చూస్తే ఫలితం తారమారయ్యింది. ఇటు నాని నటనని గానీ, అటు అంజన డైరెక్షన్ గురించి గానీ గొప్పగా చెప్పినవాళ్లు ఒక్కరూ లేకుండా పోయారు. 'అలా మొదలైంది'లో జంటగా ఆకట్టుకున్న నాని, నిత్యమీనన్ ఈ సినిమాలో ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేక పోయారు. ఇకనుంచైనా నాని భూమ్మీద నడిస్తే అతని కెరీరుకి మంచిదని సలహా ఇస్తున్నారు విశ్లేషకులు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment