Sunday, August 28, 2011
న్యూస్: రెండు ఫ్లాపుల తర్వాత వస్తున్న కృష్ణవంశీ 'మొగుడు'
'చందమామ' వంటి హిట్ సినిమా తర్వాత డైరెక్ట్ చేసిన 'శశిరేఖా పరిణయం', 'మహాత్మ' సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడటంతో ఇప్పుడు మరింత కసిగా 'మొగుడు'ని తీర్చిదిద్దుతున్నాడు కృష్ణవంశీ. ఈ సినిమాలో టైటిల్ రోల్‌ని గోపీచంద్ చేస్తున్నాడు. "మగ పుట్టుక పుట్టిన ప్రతి ఒక్కడూ మగాడు కాదు. అలాగే తాళి కట్టిన ప్రతివాడూ మొగుడు కాడు. బాధ్యతనెరిగినవాడు మగాడు అవుతాడు. మనసెరిగినవాడు మొగుడు అవుతాడు. 'మొగుడు' కథాంశం వెనుకవున్న విషయం ఇదే" అని చెప్పాడు కృష్ణవంశీ. గోపీచంద్‌తో ఇది ఆయనకి తొలి చిత్రం. గోపి నటన ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ అవుతుందని ఆయన చెబుతున్నాడు. ఈ సినిమాలో నాయికలుగా ఇద్దరు నటిస్తున్నారు. ఒకరు తాప్సీ అయితే, మరొకరు శ్రద్ధా దాస్. వీరిలో ప్రధాన నాయిక తాప్సీ కాబట్టి గోపీచంద్ ఆమెకే 'మొగుడు' అని అర్థమైపోతుంది. ఈ సినిమాలో మరో ఆకర్షణ రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్ర చేస్తుండటం. ఈ సినిమాని నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు. పూరి జగన్నాథ్, రానా కాంబినేషన్‌లో ఎంతో నమ్మకంతో నిర్మించిన 'నేను నా రాక్షసి' సినిమా ఆడకపోవడంతో 'మొగుడు' బాక్సాఫీసు ఫలితం మీద ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తీసిన ప్రతి సినిమాకీ ఆధ్యాత్మిక కోణాన్ని జోడిస్తూ వస్తున్న కృష్ణవంశీ ఈ సినిమాకీ ఆ కోణాన్ని జోడించి ఉంటాడని నమ్మొచ్చు. సెప్టెంబరులోనే రిలీజవుతున్న ఈ సినిమాకి ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుందో... కృష్ణవంశీ, గోపీచంద్ తొలి కాంబినేషన్ ఏమేరకు వర్కవుట్ అవుతుందో... వెయిట్ అండ్ సీ.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment