ఆంధ్ర ప్రాంతంలో ప్రపంచ రాజకీయాల పట్ల ఎలాంటి అభిప్రాయాలుండేవో తెలంగాణాలో ఉన్న కమ్యూనిస్టులకూ అవే అభిప్రాయాలుండేవి. అదేవిధంగా 'విశాలాంధ్రలో ప్రజారాజ్యం' అనే నినాదం ఇక్కడా కార్చిచ్చులా వ్యాపించింది. స్థానిక నాజీ రూప నిజాం పాలకుల్నీ, వారి తాబేదార్లనీ దించడం తక్షణ సమస్యగా ఇక్కడి వామపక్ష భావాల యువకులు భావిస్తుండేవారు.
1944 భువనగిరి సభలనుండి అతివాద భావాలకు తెలంగాణాలో గౌరవం పెరిగింది. 1945 ఖమ్మం సభలు మహాసభల చైతన్యాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లాయి. అంతవరకూ 'బాంచెను దొరా' అన్న నోళ్లు గ్రామాల్లో భూస్వాముల్ని నిలేసి ప్రశ్నించడం ఆరంభించాయి. జనం అక్రమ వసూళ్లు, వెట్టిచాకిరి, దౌర్జన్యాల్ని అడ్డుకోవడం ఆరంభించారు. అది 1946 జూలై 4, తెలంగాణా ప్రాంతంలో ఓ భూస్వామి విసునూరి రామచంద్రారెడ్డి. అతడు కర్కోటకుడు. పెల్లుబుకుతున్న కసితో కడివెండి ప్రజలు భూస్వాములకు వ్యతిరేకంగా దొడ్డి కొమరయ్య నాయకత్వాన ఓ ఊరేగింపు తీశారు. రామచంద్రారెడ్డి ఆ ఊరేగింపుమీద కాల్పులు సాగించాడు. అందులోనే కొమరయ్య నేలకొరిగాడు.
అదే దావానలంలా గ్రామాల్లో వ్యాపించి భూస్వాముల గడీల్ని పడగొట్టింది. అందిన ఆయుధాన్ని పట్టి ప్రజలు తమను తాము రక్షించుకున్నారు. 1946 నవంబరులో నిజాం ప్రభుత్వం.. ప్రజలు తమను కంటిపాపలా కాపాడుతున్నదనుకునే 'సంగాన్ని' నిషేధించింది. ఇంతలో 1947లో సంస్థానాలు మినహా దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. సంస్థానాల విలీనీకరణకు నిజాం ఎదురుతిరిగాడు. దాంతో సంస్థానంలోని కమ్యూనిస్టు పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఆంధ్ర మహాసభ, సామాన్య ప్రజానీకం నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. తెలుగు ప్రజల సమైక్యత అనే నినాదానికి బాగా బలం వచ్చింది. విశాలాంధ్ర నినాదంతో కమ్యూనిస్ట్ పార్టీ నిజాంతో పోరాటానికి సిద్ధపడింది. స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహ ఉద్యమాన్ని ఆరంభించింది. నిజాం తొత్తులుగా ఇత్తెహాదుల్ ముసల్మీన్, రజాకార్లు ఈ ప్రజా పోరాటాన్ని అణచడానికి దౌర్జన్య చర్యలు సాగించారు. అంతటితో అన్ని నినాదాలు మరుగునపడి తెలుగు జాతి సమైక్యత అనేది నిజామును గద్దె దింపడంలోనే ఉందన్న భావం ఒక్కటే విజృంభించింది.
No comments:
Post a Comment