Sunday, August 21, 2011

న్యూస్: కీరవాణి పాటలు అలరించేదెప్పుడు?

తెలుగు చిత్రసీమలో సంగీతం తెలిసిన అతికొద్దిమంది సంగీత దర్శకుల్లో అగ్రగణ్యుడైన ఎం.ఎం. కీరవాణి 2010 సంవత్సరపు నది అవార్డు విజేతల్లో ఒకరు. చిత్రమేమంటే ఆయనకు నది అవార్డు వచ్చింది సంగీత దర్శకుడిగా కాదు, గాయకుడిగా! ఎస్.ఎస్. రాజమౌళి సినిమా 'మర్యాద రామన్న'లో పాడిన 'తెలుగమ్మాయీ' అనే పాటకి గాను ఆయనకు నంది అవార్డుల జ్యూరీ ఈ అవార్డును ప్రకటించింది. ఇక సంగీత దర్శకుడిగా 'సింహా' చిత్రానికి గాను చక్రి నంది అవార్డును సాధించాడు. మిగతా వాళ్లకు లాగా కాకుండా సెలక్టివ్‌గా సినిమాలు ఎంపిక చేసుకునే కీరవాణికి 2011లో చెప్పుకోదగ్గ సినిమా ఏదంటే 'బద్రినాథ్' మాత్రమే. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతంత మాత్రంగానే ఆడటంతో అందులోని పాటలు పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేకపోయాయి. ఓవైపు మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్, లేటెస్ట్‌గా తమన్ టాలీవుడ్‌ని ఏలుతుంటే, వాళ్లందరికంటే సీనియర్ మాత్రమే కాక, సంగీత పరిజ్ఞానం ఎక్కువగా ఉన్న కీరవాణి అతి తక్కువ సినిమాలు చేస్తూ తనదైన శైలిలో ముందుకు పోతున్నారు. అయితే రానున్న రోజుల్లో ఆయన సంగీతం కూర్చిన రెండు సినిమాల పాటలు జనం నోళ్లలో నానడం ఖాయమని సంగీతజ్ఞులు భావిస్తున్నారు. ఆ రెండింటిలో మొదటగా రాబోతున్న సినిమా 'రాజన్న'. నాగార్జున కథానాయకుడిగా వి. విజయేంద్రప్రసాద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో విడుదల కాబోతోంది. అలాగే రాజమౌళి తాజా చిత్రం 'ఈగ'కి సహజంగానే ఆయన సంగీత దర్శకుడు. రాజమౌళి - కీరవాణి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్‌గా హిట్టే. అందువల్ల 'మగధీర' వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత కొంతకాలంగా వెనుకపట్టులో ఉన్నట్టనిపించిన కీరవాణి ఈ సినిమాలతో మళ్లీ తన సత్తా చూపిస్తాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.

2 comments:

D S DEVENDRANATH said...
This comment has been removed by the author.
D S DEVENDRANATH said...

I wish u a successful smooth life sir. All the best Sir.thank u..I request to u sir I want lyrics of ghambira simhagrava padyam in yamadonga movie