Monday, August 15, 2011
న్యూస్: తమిళ హీరోల బాటలో...
రజనీకాంత్, కమల్ హాసన్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం పొందాక తర్వాతి తరం నటులైన విక్రం, సూర్య, విశాల్, కార్తీ, ఇప్పుడు జీవా వంటివాళ్లు సైతం తెలుగునాట అనూహ్యమైన మార్కెట్‌ని సంపాదించారు. ఇప్పుడు వాళ్ల సినిమాలు తెలుగు మార్కెట్‌ని కూడా దృష్టిలో పెట్టుకుని తయారవుతున్నాయి. ఇది చూసి తాము కూడా టాలీవుడ్‌లో పాగా వెయ్యాలనే ఆలోచన కన్నడ హీరోలకు కలిగింది. అయితే ఇప్పటివరకు ఏ కన్నడ హీరో కూడా తెలుగులో మార్కెట్ సంపాదించలేక పోయాడు. నిన్నటికి నిన్న కన్నడ కంఠీరవ దివంగత రాజ్‌కుమార్ చిన్న కొడుకు పునీత్ రాజ్‌కుమార్ 'జాకీ'గా తెలుగు ప్రేక్షకుల మధ్యకు వచ్చాడు. అయితే మనవాళ్లు అతన్నేమాత్రమూ పట్టించుకోలేదు. విశేషమేమంటే 'జాకీ' సినిమాని పునీత్ కుటుంబమే స్వయంగా తెలుగులో విడుదల చేసింది. దాన్నిబట్టే పునీత్‌ని తెలుగువాళ్ల చేత ఆమోదింపజేయడానికి వాళ్లు గట్టిగా ప్రయత్నించారని అర్థమవుతుంది. అలాగే ఇటీవలే రాజ్ అనే నటుడు 'తిరుగుబోతు' పేరుతో తన జాతకాన్ని పరీక్షించుకున్నాడు. విలన్ పాత్రలతో కన్నడ ప్రేక్షకుల్ని ఓ మోస్తరుగా మెప్పించిన అతను హీరోగా 'సంచారి' అనే సినిమా చేసి హిట్‌కొట్టాడు. అదే సినిమాని తెలుగులో తనే స్వయంగా 'తిరుగుబోతు'గా తెచ్చాడు. ఇందుకోసం అతను మరో కన్నడ సినిమా ఏదీ చేయకుండా హైదరాబాద్‌లోనే ఎక్కువ సమయం వెచ్చించాడు. గమనించాల్సిందేమంటే 'తిరుగుబోతు' హిట్టు కాకపోయినా 'జాకీ' కంటే బెటర్‌గా ఆడింది. అంతేకాదు.. ఈ సినిమా పాటలు ఓ మోస్తరుగానైనా ఆదరణ పొందాయి. రాజ్ ఇప్పుడు స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటించేందుకు యత్నిస్తున్నాడు. ఇప్పటికే పూరి జగన్నాథ్ శిష్యుడు నాగిరెడ్డి డైరెక్షన్‌లో నటించేందుకు అంగీకారం తెలిపాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు సినిమాలన్నా, తెలుగు హీరోలన్నా విపరీతమైన అభిమానం కనపరిచే రాజ్ తెలుగులో రాణిస్తాడా?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment