తెలుగు చిత్రసీమలో ఇప్పుడు ఎక్కువమంది జపం చేస్తున్న పేరు తాప్సీ. జూలై 1న విడుదలైన 'ఝుమ్మంది నాదం' సినిమా ద్వారా ఆమె తెలుగు తెరకు పరిచయమైంది. సినిమాలో ఆమె అందచందాలు.. ముఖ్యంగా ఆమె ముఖారవిందం.. అందర్నీ ఆకట్టుకున్నాయి. మంచు మనోజ్ హీరోగా శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై మంచు లక్ష్మిప్రసన్న నిర్మించిన ఈ సినిమాకి డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు. హీరోయిన్లని ఆయన ఎంత అందంగా చూపిస్తారో అందరికీ తెలిసిందే. అయితే స్వతహాగా అందాలరాశి అయిన తాప్సీ సోయగాలు ఈ సినిమాలో మరింత సుందరంగా దర్శనమిచ్చాయి. పాటల్లో తాప్సీని చూసేందుకు రెండు కళ్లు చాల్లేదని కుర్రకారు చెబుతున్నారు. ఒకప్పుడు దివ్యభారతి, టాబు, సిమ్రాన్, నిన్న ఇలియానా తర్వాత ఒకే ఒక సినిమాతో సూపర్‌హాట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నది తాప్సీనే. వరుసపెట్టి ఆమెకి వస్తున్న ఆఫర్లే అందుకు నిదర్శనం. హీరోలు ఆమె పట్ల తెగ ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. 'ఝుమ్మంది నాదం' రిలీజ్‌కి ముందుగానే ఆమె నాలుగు సినిమాలకి సంతకం చేసిందనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ద టాలీవుడ్. వాటిలో రెండు సినిమాల సంగతులు తెలిశాయి. మరో రెండు సినిమాలేవో తెలియాల్సి ఉంది. తెలిసిన వాటిలో ఒకటి ప్రభాస్ సినిమా, రెండొది విష్ణు సినిమా. ప్రభాస్‌తో తాప్సీ నటించే సినిమాని దిల్ రాజు నిర్మిస్తుంటే, 'సంతోషం', 'సంబరం', 'స్వాగతం' చిత్రాల దర్శకుడు దశరథ్ రూపొందిస్తున్నాడు. ఇక మంచు విష్ణుతో ఆమె నటిస్తున్న సినిమాని 24 ఫ్రేంస్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా హేమంత్ మధుకర్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు.
ఇంతకీ ఎవరీ తాప్సీ? ఆమె పంజాబీ. అసలు పేరు తపసీ పన్ను. అందరూ తాప్సీ అని పిలుస్తుండటంతో అదే తెరపేరుగా మారిపోయింది. న్యూఢిల్లీలోని జి.టి.బి.ఐ.టి.లో ఇంజనీరింగ్ చదివిన తాప్సీ కాలేజీ రోజుల్లోనే తన డాన్స్ పర్ఫార్మెన్స్‌తో ఢిల్లీవాసుల్ని అలరించేసింది. యుఎస్ఐ, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, వర్ధమాన్, కోకాకోలా వంటి సంస్థలకు మోడల్‌గా పనిచేసే అవకాశాలు దక్కించుకుంది. అంతేనా.. 2008 మిస్ ఇండియా పోటీల్లో 'మిస్ ఫ్రెష్ ఫేస్', 'మిస్ బ్యూటిఫుల్ స్కిన్' అవార్డుల్ని గెలుచుకుంది. కమర్షియల్ యాడ్స్‌లో ఆమె రూపలావణ్యాల వల్లే తెలుగులో 'ఝుమ్మంది నాదం'లోనూ, తమిళంలో 'అదుకాలం'లోనూ అవకాశాలు సంపాదించేసింది. నిజానికి ధనుష్ హీరోగా నటిస్తున్న 'అదుకాలం'లో మొదట నాయికగా త్రిషని ఎంపిక చేశారు. అయితే చివరి నిమిషంలో ఆ అవకాశాన్ని తాప్సీ సంపాదించేసింది. ఈ సినిమా ఈ ఏడాది నవంబర్‌లో వచ్చే అవకాశాలున్నాయి. తెలుగులో 'ఝుమ్మంది నాదం'లో నటించేప్పుడే నిర్మాత లక్ష్మిప్రసన్నతో ఆమెకి గట్టి అనుబంధమే ఏర్పడింది. అందుకే ఆమెని తన 'ట్రూ మెంటర్'గా చెబుతోంది తాప్సీ. అందుకు తగ్గట్లే ఆమె సూచనల్ని పాటిస్తూ తెలుగులో మంచి కెరీర్ కోసం చేతులు చాస్తోంది. ఆమెకు వస్తున్న అవకాశాలు చూస్తుంటే నేటి టాప్ హీరోయిన్లకు అసూయపుట్టక తప్పదు.
No comments:
Post a Comment