Thursday, July 29, 2010
Youth: Lessons from First Love
There is nothing either good or bad but thinking makes it so.
స్నేహానికి హద్దు అవసరమా? యువతీ యువకుల మధ్య స్నేహానికి మాత్రం హద్దు అవసరమేననేది అత్యధికుల అభిప్రాయం. మనిషి జీవితంలో బాల్యం తర్వాత వచ్చే యవ్వన దశ ఎంత సంక్లిష్టంగా వుంటుందో యవ్వనాన్ని ఇప్పటికే అనుభవించిన వాళ్లందరికీ తెలుసు. మరి ఈ రాతలు ఎవరికోసమంటే యవ్వనంలో వున్న వాళ్ల కోసమే. యవ్వనంలో వున్న వాళ్లలో బాల్య చేష్టలూ పూర్తిగా ప్రతిఫలించవు, ప్రౌఢ దశలోలా పరిపక్వతా కనిపించదు. ఓ విధమైన ద్వైదీభావంతో వాళ్లు కొట్టుమిట్టాడుతూ వుంటారు. ఈ దశ యువకులకి కచ్చితంగా పరీక్షా సమయం లాంటిదే. వాళ్లలో కలిగే ఆశలూ, ఊహలూ నియంత్రణని కోల్పోతాయి. వాళ్ల ప్రవర్తన మూలంగా తల్లిదండ్రులతో, టీచర్లతో, స్నేహితులతో విభేదిస్తుంటారు.
యువకులలో కలిగే భావానుభూతులు వాళ్లని చలింప జేస్తుంటాయి. భావ సంఘర్షణలు, అస్పష్టమైన దృక్పథాలు వంటివి వాళ్లని అనేక పరీక్షలకు లోను చేస్తాయి. ఏదో ఓ కొత్త మార్గాన్ని అన్వేషించాలనీ, గుర్తింపు పొందడం కోసం ఎంతటి క్లిష్టమైన పనైనా చేయాలనీ యువకులు తలపోస్తూ వుంటారు. తన కుటుంబం, చదువు, స్నేహితులు - వాళ్లతో సంబంధాలు, వాళ్ల ప్రవర్తన యువకుల్ని మరో గమ్యం వైపుకు లాగుతుంటాయి. అందులో భాగంగానే యువతులతో స్నేహాన్ని వాళ్లు వాంఛిస్తుంటారు.
యవ్వనమంటే 'తొలిప్రేమ' నుంచి తప్పించుకోలేని దశగా కవులు వర్ణిస్తుంటారు. మనో వైజ్ఞానికులు కూడా దీన్ని రూఢిపరుస్తారు. పదహారేళ్ల అమ్మాయికీ, పదిహేడేళ్ల అబ్బాయికీ 'తొలిప్రేమ' బారి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. తమ ప్రేమని బయటకి వ్యక్తం చేయకపోయినా తప్పనిసరిగా వాళ్లు 'తొలిప్రేమ' అనుభవాన్ని పొందే వుంటారు. దాన్ని సహజమైన విషయంగానే గుర్తించాలి. తప్పించుకోలేని ఊహా జగత్తులోకి తొలిప్రేమ టీనేజర్లని తీసుకుపోతుంది. దాని ప్రభావం కూడా వారి హృదయాలపై ప్రసరిస్తుంది. ఆ స్థితిలో - ఇంద్రధనస్సులాంటి అందమైన ఆలోచనలు, తియ్యని పగటి కలలు, ప్రియురాలి ఓ చిరునవ్వు, ఆమె నుంచి చిన్న ఒప్పుకోలు, ఒక ప్రేమమాట, ఒక భాష్యం టీనేజర్ని ప్రేమజ్వరంతో కాగిపోయేట్టు చేస్తాయి. ఎట్లా జరగాలని అతడు కోరుకుంటాడో అందుకు అనుగుణమైన ఆలోచనలే అతనిలో కలుగుతుంటాయి. అతడిలో పూర్తి తాదాత్మ్య స్థితి కలుగుటుంది. ఒక కవిగా మారిపోయి ప్రేమ కవిత్వం చెబుతాడు. రచయితగా మారిపోయి తన భావాలను ప్రేమలేఖల రూపంలో వ్యక్తం చేస్తాడు. ఇవాళ సెల్ ఫోన్లతో ఎస్సెమ్మెస్సుల ద్వారా తన ప్రేమని ప్రదర్శిస్తున్నాడు. తన ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది కూడా అని అతడు తన కవిత్వం ద్వారా, తన రచన ద్వారా తెలియజేస్తాడు. శ్రీశ్రీ 15 సంవత్సరాల వయసులోనే 'పరిణయ రహస్యము' అనే నవల రాశాడంటే అది తొలిప్రేమ ప్రభావమేమో అనిపిస్తుంది.
తొలిప్రేమలో చిక్కుకున్న వాళ్లు తమ భావానుభూతుల్ని లేఖల ద్వారా మాత్రమే కాదు. డైరీల్లో నిక్షిప్తం చేసుకోవడం ద్వారా కూడా వ్యక్తం చేస్తుంటారు. వస్త్రధారణ విషయంలో కూడా వీరు అమిత శ్రద్ధ కనపరుస్తారు. ప్రేమలో పడిన యువతయితే ఆధునిక శైలిలో ఎదుటివాళ్లని ఆకట్టుకునే లాగా వస్త్రధారణ చేసుకుంటుంది. ఎంత సమయాన్నైనా దీనికోసం వెచ్చిస్తుంది. ఫ్యాషన్ దుస్తులు, హైహీల్స్, బాబ్డ్ హెయిర్, ధగధగలాడే ఇయర్ రింగ్స్ - ధరిస్తుంది. ఇక యువకుడైతే జీన్స్, కొత్త కొత్త మోడళ్ల దుస్తులు, కళ్లకి రేబాన్ గ్లాసెస్ ధరిస్తుంటాడు. మోటార్ సైకిల్ మీద ఝామ్మని పోతుంటాడు. అలాగే తాను అమితంగా అభిమానించే సచిన్ లేదా ధోనీ లాంటి క్రికెట్ స్టారునో, మహేశ్ లేదా రాంచరణ్ లాంటి సినీ హీరోనో అనుకరిస్తూ వారిలా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తుంటాడు. అయితే ఇవన్నీ చాలా త్వరగానే మరుగునపడి పోతుంటాయి. ఇలా జరగడం కూడా సహజమే. వాస్తవం తెలిశాక ఇవేవీ నిజమైన ప్రేమ భావాలకు ప్రతీకలు కాదన్న స్థితికి వాళ్లు వస్తారు. ఇది కూడా అసహజం కాదు. ఎందుకంటే యవ్వనమనేది మానసిక పరిపక్వతలేని, తన గురించి తనకే అవగాహనలేని, ఏదో గుర్తింపు కావాలని కోరుకునే దశ. తొలిప్రేమ భావాలు వాళ్లని చదువు నుంచీ, బాధ్యతల నుంచీ దూరం చేస్తాయి. ఆశ్చర్యంగా ఇవే అనుభూతులు వాళ్లకి చదువులో ఆధిక్యతనీ, గుర్తింపునీ త్వరలోనే కలిగిస్తాయి.
తొలి ప్రేమానుభూతులకి కారణం ఏమిటంటే ఎవరూ చెప్పలేరు. ఆ అనుభూతులు తప్పా, ఒప్పా కూడా చెప్పలేరు. కానీ తొలిప్రేమ సహజం. అది తప్పించుకోలేని అనుభూతి. వింతేమిటంటే తప్పొప్పులని గ్రహించడానికీ, మానసిక పరిపక్వతకీ తొలిప్రేమ బీజం వేస్తుంది.
పాశ్చాత్య దేశాల్లో యువతీ యువకుల మధ్య 'డేటింగ్' అనేది ఒక సహజమైన అంశం. మన సమాజంలో ఈ 'డేటింగ్' అనుసరించదగినదేనా? అనే ప్రశ్న టీనేజర్లలో వుంటుంది. ఈ విషయంలో మాత్రం ఏకాభిప్రాయం వ్యక్తం కావడం లేదు. ఆచారాలకీ, సంప్రదాయాలకీ విలువ ఇచ్చే పెద్దవాళ్లు మన సమాజం దృష్ట్యా 'డేటింగ్' మంచిది కాదనీ, భారతీయతకు సరిపడనిదనీ అంటారు. అయితే పాశ్చాత్య నాగరికతకు సన్నిహితమవుతున్న మనం - ముఖ్యంగా యువత దీన్నేమీ ఖాతరు చేయడం లేదు. ఇవాళ మన నగరాల్లో డేటింగ్ ఓ సాధారణ అంశం. హైదరాబాదులో ట్యాంకుబండ్ వద్దా, ఇందిరా పార్కు, ప్రసాద్ ఐమాక్స్ వద్దా పెళ్లికాని అమ్మాయిలూ అబ్బాయిలూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడం మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. పబ్బుల సంస్కృతి వచ్చాక ఏ పబ్బులో చూసినా ఇలాంటివాళ్లు కొల్లలుగా కనిపిస్తున్నారు.
ఫారిన్లో తమ పిల్లలకు తగిన జోడీని వెతకడం తల్లిదండ్రులకు చాలా కష్ట సాధ్యం. కాబట్టి తమకు నచ్చిన భాగస్వామిని వెతుక్కోవడానికి డేటింగ్ వారికి ఉపకరిస్తుంది. అదే మనదేశంలో తమ పిల్లలకు తామే జీవిత భాగస్వామిని ఎంపిక చేసే సంస్కృతి కొనసాగుతోంది. అందుచేత మన సమాజంలో డేటింగ్ ఆచరణీయం కాదని అంటారు. అయితే ఇంతకు ముందు నగరాలకు మాత్రమే పరిమితమైన డేటింగ్ ఇప్పుడు చిన్న పట్టణాలకు సైతం వ్యాపించింది. క్రమేణా ఇది పెరుగుతూ వస్తోంది. డేటింగ్ కోరుకునే యువతికి ఇదో థ్రిల్లింగుగా తోస్తుంది. ఒక్కోసారి అది సరిదిద్దుకోలేని విపత్కర పరిస్థితికి దారితీసే ప్రమాదం వుంటుందని అప్పుడామె గ్రహించకపోవచ్చు. ఆరాధనకన్నా మోహమే ఇందులో అధికంగా కనిపిస్తుంది.
సహజంగా ఒకే వయసు వున్న యువతీ యువకుల్లో ముందుగా యువతే వివాహానికి సిద్ధపడుతుంది. యువకుడికైతే చదువు పూర్తి కావాలి, ఉద్యోగం రావాలి, ఏదో ఓ ఉపాధి చూసుకోవాలి. జీవితంలో నిలదొక్కుకోవాలి. అందుకని అతడికి డేటింగ్ వివాహానికి సహకరించే సాధనంగా అనిపించదు. ఈ కారణంవల్ల డేటింగ్ మూలంగా నష్టపోయేదిఎక్కువగా ఆడవాళ్లే. ఒక యువతితో డేటింగ్ చేస్తున్నప్పటికీ తల్లిదండ్రుల వత్తిడి వల్ల ఇంకో యువతిని పెళ్లి చేసుకుంటాడు పురుషుడు. అలా కాకపోయినా మానసిక పరిపక్వతలేని వాళ్లు వివాహం చేసుకున్నా ప్రపంచానుభూతులకు ఎట్లా స్పందించాలో తెలీక తీవ్రమైన భావ సంఘర్షణకి లోనవుతారు.
కేవలం ఇద్దరు యువతీయువకుల మధ్య డేటింగ్ అనేదాన్ని ప్రోత్సహించడం కాకుండా సామూహికంగా స్కూళ్లలో, కాలేజీలలో స్త్రీ, పురుష సంబంధాలను, వాళ్ల సమస్యలను చర్చా గోష్ఠులుగా నిర్వహిస్తే యువతీ యువకుల మధ్య సరైన అవగాహన పెంపొందడానికి అవకాశం వుంది. సమభావంతో ఆటలలో కలిసి పాల్గొనడం ద్వారా వాళ్లు ఒకరి పట్ల మరొకరు ఆసక్తినీ, అవగాహననీ కలిగించుకోవచ్చు. పిక్నిక్కులు, ఎక్సుకర్షన్లు వంటివి కూడా వాళ్ల మధ్య మంచి అవగాహన ఏర్పడటానికి తోడ్పడతాయి. ఆనందాన్ని మాత్రమే కాక అవి వాళ్లలో నాయకత్వ లక్షణాల్ని కూడా ప్రేరేపిస్తాయి. ఈ సందర్భాల్లో వాళ్లు ఆడే ఆటలు, పాడే పాటలు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. హృదయాన్ని గిలిగింతలు పెడతాయి.
ఎప్పుడైతే సామూహికంగా యువతీ యువకులు కలసి వుంటారో, ఒకరికొకరు సహకరించుకుంటారో అప్పుడు మనం భయపడేదేమీ జరగదు. జంటలు జంటలుగా విడిపోయి వున్నప్పుడు మాత్రమే మనమనుకునే ప్రమాదాలు సంభవించేది. వయసు కలిగించే సహజమైన కోరికలతో వాళ్లు పెడతోవపట్టే అవకాశం అప్పుడే వుంటుంది.
యువతీ యువకులు కూడా ఎప్పుడూ ఊహా ప్రపంచంలో విహరిస్తూ గాలిలో మేడలు కట్టే పనికి స్వస్తి చెప్పాలి. అందుకుగాను చక్కగా చదువుకోవాలి. ఒక మంచి లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు పోవాలి. వాళ్ల భవిష్యత్తు సక్రమంగా వుండటానికి ఇవే ఉత్తమ మార్గాలు.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
nice boss....... i like ur post.....satya
Post a Comment