Thursday, September 23, 2010

రివ్యూ: చంద్రసిద్ధార్థ్ - టాబు సినిమా 'ఇదీ సంగతి!'


సీనియర్ జర్నలిస్టు, రచయిత కె.ఎన్.వై. పతంజలి కొన్నేళ్ల క్రితం ‘నువ్వే కాదు’ అనే నవలిక రాశారు. డబ్బు మనుషుల్ని ఎలాంటి నైచ్యానికి దిగజారుస్తుందనేది అందులోని ప్రధానాంశం. అందులో వివాదాస్పద అంశాలూ వున్నాయి. ఒక రంగమని కాకుండా న్యాయ వ్యవస్థ, మీడియా వ్యవస్థల్లోనూ అవినీతి ఎలా పేరుకు పోయిందో పతంజలి అందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. దాన్ని వెండితెర మీదకు తీసుకు రావాలనే ఆలోచన దర్శకుడు చంద్రసిద్ధార్థకు కలిగింది. ‘ఇదీ సంగతి!’ అంటూ చిత్రానువాదం చేశారు. అయితే జీవిత వాస్తవికత ఒక్కోసారి ఎంతటి ఉత్కంఠతనీ, భీతినీ కలిగిస్తుందో, అంత చేదునీ ఇస్తుంది. ‘ఇదీ సంగతి!’ మన మనసుల్ని యథాతధంగా ఆవిష్కరించింది. కానీ మనలోని నెగటివ్ అంశాల్ని ఒప్పుకునే ధైర్యం ఎంతమందికుంటుంది? అందుకే అది చేదు మాత్ర అయిపోయింది. ఎలాగంటే..

కథ:
ముంబై ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు యాక్సిడెంట్ అవుతుంది. దాన్ని కవర్ చేయడానికి వెళ్లిన ప్రజా పత్రిక క్రైమ్ రిపోర్టర్ సత్యమూర్తి (అబ్బాస్)కి అక్కడ చనిపోయిన వాళ్ల దగ్గర్నించి కొంతమంది ఏది కనపడితే అది దోచుకోవడం చూసి తనతో పాటు వచ్చిన ఫోటోగ్రాఫర్ (సునీల్)తో కలిసి తానూ దొరికినకాడికి దొచుకుంటాడు. అతడికి దొరికిన ఎర్ర సూట్‌కేస్‌లో 500 కోట్ల రూపాయల విలువచేసే వజ్రాలుంటాయి. అయితే అతడికి ఆ సంగతి తెలీకముందే అతడి భార్య స్వరాజ్యలక్ష్మి (టాబు) వాటిని దాచేస్తుంది. తను తెచ్చిన సూట్‌కేస్‌లో కోట్ల రూపాయల విలువచేసే వజ్రాలున్నాయని తెలిసిన సత్యమూర్తి వాటికోసం చూస్తే అవి కనిపించవు. ఆ సూట్‌కేస్‌లో బట్టలు తప్ప వజ్రాల్లాంటివేవీ లేవని స్వరాజ్యం చెబుతుంది. నిజమే అనుకుంటాడు సత్యమూర్తి. భర్తకి వాటి గురించి చెబితే వాటిని తనకు చెందకుండా చేస్తాడనేది స్వరాజ్యం భయం. ఆ వజ్రాలు సాక్షాత్తూ ప్రధాన మంత్రివి. ఆ స్థాయి వ్యక్తికి చెందిన వజ్రాలు విమానంలో కాకుండా, రైలుబండిలో ఎందుకు రవాణా అవుతున్నాయి? అసలు అవి ప్రధానివనే సంగతి లోకానికి తెలుసా? వాటివల్ల సత్యమూర్తి కుటుంబం ఎలాంటి ప్రమాదంలో చిక్కుకుంది? స్వరాజ్యలక్ష్మి అత్యాశ చివరికి ఎటువంటి పరిణామాలకు దారి తీసింది? అనే ప్రశ్నలకు సమాధానం మిగతా సినిమా.

కథనం:
మనిషిలోని డార్క్‌నెస్‌ని ఆకర్షణీయంగా చెప్పడం అంత తేలికైన సంగతి కాదు. డబ్బనేది మనిషిని ఎంత నైచ్యానికీ, దుర్మార్గానికీ లోను చేస్తుందో ‘ఇదీ సంగతి!’ బాగా ఆవిష్కరించిందనడంలో సందేహం లేదు. అయితే ఆ చెప్పడంలో ఆకర్షణీయత లోపించడమే ఆ సినిమాకు ప్రతికూలంగా మార్చింది. ముంబై ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురై, అందులోని ప్రయాణీకులు చాలామంది శవాలుగా మారి, మరెంతో మంది క్షతగాత్రులై కళ్లముందు కనిపిస్తుంటే సాధారణంగా హృదయాలు అవిసిపోతాయి. వారికి సాయం చేయాలన్న తపన కలుగుతుంది. దానికి రెండో కోణం.. అందినకాడికి దోచుకోవాలనే దుర్బుద్ధి కలగడం. ఇలాంటివి జరుగుతున్నాయని మనం చాలా సందర్భాల్లో వింటున్నాం. చదువుతున్నాం. ఈ సినిమాలో మనం దాన్ని ప్రత్యక్షంగా చూస్తాం. సత్యమూర్తి, ఫోటోగ్రాఫర్ కలిసి శవాలనుంచి ఆభరణాలు వొలుచుకోవడం వంటిని జలదరింపజేస్తుంది. ఇలాంటివే అనేక ఊహకందని సన్నివేశాలు ఈ సినిమాలో వున్నాయి. దొంగతనానికి గురైన వజ్రాల్ని కనిపెట్టడానికి దొంగలతో పొలీసు అధికారులు సమావేశం ఏర్పాటు చేసి, వాటాల గురించి మాట్లాడుకోవడం.. దొంగలకీ, పోలీసులకీ మధ్యవర్తిగా ఒక మాజీ న్యాయమూర్తి వ్యవహరించడం, అలా మధ్యవర్తిగా వుండేందుకు ఆయనా వాటా అడగడం.. వూళ్లోని ఇళ్లలో దొంగతనం చేయడానికి దొంగలకి పోలీసులే వ్యానుని ఏర్పాటు చేయడం.. ఆ వ్యానులో దొంగలతో పాటు మాజీ న్యాయమూర్తి కూడా ప్రయాణించడం.. వంటివి ఆ తరహా సన్నివేశాలు.
ఈ సినిమాలో సెంట్రల్ క్యారెక్టర్లు రెండు. సత్యమూర్తి, స్వరాజ్యలక్ష్మి. ఇద్దరూ డబ్బు మనుషులే. నేటి జర్నలిస్టులు ఎలాంటి బ్రోకర్ పనులు చేస్తున్నారనేందుకు సత్యమూర్తి పాత్ర నిదర్శనం. సహజంగానే ఆ పాత్ర మీడియా వ్యక్తులకి నచ్చదు. అతను శవాలని దొచుకు తెస్తే, అతన్నే దోచుకోవాలని అతని భార్య స్వరాజ్యలక్ష్మి భావిస్తుంది. వంటినిండా నగలు పెట్టుకుని తిరగాలనీ, కోటి రూపాయల ఖరీదు చేసే కారులో తిరగాలనీ, లంకంత ఇంటిలో కాపురముండాలనీ.. ఆమె కలలు కంటూ వుంటుంది. దొరికిన వజ్రాలతో అవి సమకూర్చుకోవచ్చనుకుంటుంది. కానీ వాటి గురించి పోలీసులు ఆరా తీస్తుండడం, మీడియాలో కథనాలు వస్తుండడంతో వాటిని కాపాడుకోవడానికి ఆమెపడే ఆదుర్దా సహేతుకమే. తన భర్త ప్రమాదంలో చిక్కుకున్నాక గానీ ఆమెకు తన తప్పు తెలిసిరాలేదు. అందుకే స్వార్థం స్థానంలో తన భర్తని కాపాడుకోవాలనే తపన ఆమెలో కలిగింది. వజ్రాలకంటే తన భర్తే తనకు ముఖ్యమనే విచక్షణ కలిగింది. తన మునుపటి ప్రశాంత జీవితం కావాలనే స్పృహ కలిగింది. ఆ పాత్రని దర్శకుడు చక్కగా మలిచాడు. డబ్బాశ ఒక స్త్రీని ఎలాంటి పనులకు పురికొల్పుతుందనే దానికి స్వరాజ్యలక్ష్మి నిలువెత్తు నిదర్శనం. పోలీస్ ఇన్‌స్పెక్టర్ దగ్గర్నుంచి ప్రధాన మంత్రి దాకా వజ్రాల కోసం చేసే పనులు ‘ఔరా’ అనిపిస్తాయి. అయితే అన్నీ నెగటివ్ పాత్రలు కావడమే ‘ఇదీ సంగతి!’కి కమర్షియల్ పరంగా ప్రతికూలంగా మారింది. సన్నివేశాల్ని దేనికి దానికి విడిగా చూసినప్పుడు బాగా వున్నట్లనిపిస్తాయి. పాత్రలు చెప్పే డైలాగులు మెప్పిస్తాయి. కానీ అన్నిటినీ కలిపి చూసినప్పుడు వెలితిగా తోస్తుంది. క్లైమాక్స్ కూడా అసంపూర్ణంగా ఆగినట్లు తోస్తుంది. కొన్ని పాత్రలు చివరకు ఏమయ్యాయనే సంగతిని దర్శకుడు ప్రేక్షకుడి ఊహకే వదిలేశాడు. సత్యమూర్తి కుటుంబాన్ని చంపాలనుకున్న డిఐజి (చలపతిరావు), అతని బావమరిది (రాజా రవీంద్ర), మంచివాడిగా నటిస్తూ వజ్రాలు కాజేయాలనుకున్న లాయర్ చందర్రావు (బ్రహ్మాజీ), మాజీ న్యాయమూర్తి (మేల్కోటే), ఇన్‌స్పెక్టర్ సూర్రెడ్డి (సూర్య) పాత్రలను దర్శకుడు అర్ధంతరంగా ముగించేశాడు. అందుకే క్లైమాక్స్ అసంతృప్తి కలిగిస్తుంది.

పాత్రధారుల అభినయం:
స్వరాజ్యలక్ష్మి పాత్రని టాబు ఉన్నత స్థాయిలో పోషించింది. ఆ పాత్రలోని రకరకాల ఎమోషన్స్‌ని బాగా పలికించింది. డబ్బాశ కలిగిన మధ్యతరగతి గృహిణిగా, చివరకు కనువిప్పు కలిగి వజ్రాలకంటే తన భర్తే తనకు ముఖ్యమనుకునే సగటు స్త్రీగా ఆమె అభినయం మెచ్చతగ్గది. ఒక పాటలోనూ, కొన్ని సన్నివేశాల్లోనూ దర్శకుడు ఆమెలోని గ్లామర్ కోణాన్నీ చూపించాడు. క్రైమ్ రిపోర్టర్ సత్యమూర్తిగా అబ్బాస్ కూడ మెరుగైన నటని ప్రదర్శించాడు. చాలా రోజుల తర్వాత అతడికి నటనను చూపించే పాత్ర లభించింది. అబ్బాస్ వెంటవుండే ఫోటోగ్రాఫర్‌గా సునీల్ మెప్పించాడు. అతనికి భార్యగా హేమను చూపించడం నప్పలేదు. ఆమె అతనికి అక్కలా కనిపించింది. కళావర్ కింగ్ అనే దొంగ పాత్రలో రాజా ఆశ్చర్యపరుస్తాడు. ఆ తరహా మాస్ పాత్రకి అతను సూట్ కాడని స్పష్టమైంది. అతని పాత్ర ముగిసే తీరు చూశాక అతని పట్ల మనకు జాలి కలుగుతుంది. ఇన్‌స్పెక్టర్ సూర్రెడ్డిగా సూర్య, లాయర్ చందర్రావుగా బ్రహ్మాజీ పాత్రోచితంగా నటించారు. ప్రధానమంత్రిగా కోట శ్రీనివాసరావు నటనకు మనం వంక చెప్పేదేముంది! కానీ ప్రధానిగా అతను పరిచయమయ్యే సన్నివేశాలు ఆ స్థాయికి తగ్గట్లు లేవు. చలపతిరావు, మేల్కోటే, రాజారవీంద్ర ఓకే.

టెక్నీషియన్ల పనితనం:
కథతో పాటు ఈ సినిమాకి మాటల్ని కూడా పతంజలే రాశారు. సన్నివేశాలకు తగ్గట్లు ఆయన కలం చురుగ్గా సంభాషణలు పలికించింది. వ్యవస్థ మీద ఆయన విసిరిన చెణుకులు, వ్యంగ్యాస్త్రాలు చప్పట్లు కొట్టేలా చేస్తాయి. చాలా సన్నివేశాలకు ఆయన సంభాషణలే టానిక్. పాటలకు నూతన సంగీత దర్శకుడు జాన్ పి. వర్గి బాగానే బాణీలిచ్చాడు. టైటిల్ సాంగ్‌లో వచ్చే బాణీలు మెచ్చదగ్గ రీతిలో వున్నాయి. అనూప్ నేపథ్య సంగీతం ఎఫెక్టివ్‌గా వుంది. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ బాగుంది. సన్నివేశాల్లోని వాతావరణానికి తగ్గట్లు లైటింగ్ వుపయోగించి సన్నివేశాలకు గాఢతని తెచ్చాడు.

బలాలు, లోపాలు:
కథాంశంలోని నవ్యత, టాబు పాత్ర, ఆమె నటన, పతంజలి సంభాషణలు, సంగీతం, రీ రికార్డింగ్, సినిమాటోగ్రఫీ బలాలు. అన్నీ నెగటివ్ పాత్రలు కావడం, సీరియస్‌నెస్ ఎక్కువై ఆహ్లాదాన్ని కలిగించే సన్నివేశాలు లేకపోవడం, కమర్షియాలిటీని మిస్సవడం, కథనంలో స్పీడు లేకపోవడం, క్లైమాక్స్ అసంపూర్ణంగా వుండడం.. లోపాలు. సీరియస్ సినిమాల్ని ఇష్టపడే వాళ్లని మాత్రమే ఈ సినిమా సంతృప్తిపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

No comments: