Tuesday, September 21, 2010
సినిమా: సిద్ధార్థ్ పని బాగుంది!
తెలుగు హీరోగానే తనని పరిగణించాలని కోరుకుంటున్న తమిళుడు సిద్ధార్థ్ ఆ లక్ష్యంలో భాగంగా తెలుగు ప్రేక్షకుల్లో తన ఇమేజిని పెంచుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు. 2006లో వచ్చిన 'బొమ్మరిల్లు' తర్వాత మళ్లీ ఆ స్థాయి హిట్ లేని అతను త్వరలో 'బావ'గా ఆకట్టుకోడానికి వస్తున్నాడు. బాలీవుడ్ లో 'రంగ్ దే బసంతి' (2006) తర్వాత చేసిన 'స్ట్రైకర్' సినిమా ఆడకపోవడంతో ఇప్పుడు పూర్తిగా టాలీవుడ్ లోనే దృష్టిని కేంద్రీకరిస్తున్నాడు. 'బొమ్మరిల్లు' తర్వాత అతను చేసిన మూడు సినిమాలు - 'ఆట', 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' (కెఐకెకె), 'ఓయ్'లలో - 'కెఐకెకె' ఓ మోస్తరుగా ఆడితే మిగిలిన రెండూ ఫ్లాపయ్యాయి. 'బావ'లో సిద్ధార్థ్ సరసన 'ఏం పిల్లో ఏం పిల్లడో' ఫేమ్ ప్రణీత నాయిక. కొత్త దర్శకుడు రాంబాబు డైరెక్టరుగా పరిచయమవుతున్న ఈ సినిమా దీపావళికి రానున్నది. ఈ సినిమా కాకుండా రెండు సినిమాలు సెట్స్ మీదున్నాయి. వాటిలో ఒకటి కోవెలమూడి సూర్యప్రకాశ్ డైరెక్ట్ చేస్తున్న 'అనగనగా ఒక ధీరుడు' (ఇంకా నిర్ధారించలేదు), రెండోది జయేంద్ర డైరెక్ట్ చేస్తున్న '180'. లేటెస్టుగా సిద్ధార్థ్ తో మరో సినిమా చేయబోతున్నామని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఈ సినిమా ద్వారా వేణు శ్రీరామ్ దర్శకుడిగా పరిచయమ్వనున్నాడు. ఇలా చేతిలో నిండుగా సినిమాలతో తెలుగులో సిద్ధు పని బాగానే ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment