
సమాజంలో మహిళలపై హింస పెరుగుతూ ఉంది. ఇది ఎన్నో కొత్త రూపాలు తీసుకుంటూ ఉంది. అందులో ఈమధ్య పెరుగుతున్న యాసిడ్ దాడులు ఒకటి. వీటిని అరికట్టడానికి ప్రభుత్వం చట్టాన్ని కఠినతరం చేస్తూ సవరణలు తీసుకు వచ్చింది. హింసకు వ్యతిరేకంగా నిరసనలు వచ్చిన ప్రతి సందర్భంలో ఒక చట్టం రావడం, ఆ తర్వాత ఆందోళనలు ఆగిపోవడం పరిపాటి అయిపోయింది. ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు వస్తాయి.
ఇప్పటికే ఉన్న శిక్షలు కఠినంగా లేకపోవడం వల్ల యాసిడ్ దాడులు జరుగుతున్నాయా? మహిళలపై హింసను నిరోధించడానికి ఇప్పటికే ఉద్దేశించిన చట్టాలు సక్రమంగా అమలవుతున్నాయా? వాటిని అమలు చేయడానికి కావాల్సిన బలమైన, సున్నితమైన, శిక్షణగల నేర న్యాయవ్యవస్థ మనకు ఉందా? లేనప్పుడు కఠినమైన చట్టాలు చేసినంత మాత్రాన పభుత్వం మహిళలపై హింసను నిరోధించడానికి కంకణం కట్టుకొని ఉన్నట్టు అర్థమొస్తుందా?
వాస్తవం ఏమిటంటే, చట్టాలు కఠినతరమయ్యే కొద్దీ నేర నిరూపణకు బలమైన, ప్రామాణికమైన సాక్ష్యాలు అవసరమవుతాయి. వాటిని తేలేకపోతే ఆ మేరకు శిక్షలు పడే అవకాశాలు తగ్గిపోతాయి. చట్టాన్ని న్యాయ దృష్టితో అమలు చేయడానికి కావాల్సిన యంత్రాంగాన్ని సిద్దం చేయకుండా, కఠినమైన చట్టాల్ని మాత్రం చేస్తే, అది ప్రజల్లో ప్రతీకార వాంఛకు విజ్ఞప్తి చేయడమే తప్ప, వాస్తవంలో ఫలితముండదు.
యాసిడ్ దాడి జరగగానే అన్ని సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాయి. ఏదో ఒక చట్టం చేయగానే అన్ని ఆందోళనలు గప్చిప్ అయిపోతాయి. చట్టాలు అమలు చేయడానికి సరైన యంత్రాంగం లేదు. చట్టాలు కాదు, దాడులు జరగకుండా ఏం చేయాలి అనేది ప్రభుత్వం గుర్తించి ఆలోచించాలి. ప్రభుత్వానికి స్త్రీల సమస్యల మీద పని చేయాలనే సరైన ఉద్దేశం ఉంటే పని త్వరగా జరుగుతుంది.
No comments:
Post a Comment