1960ల కాలంలో మన తెలుగు సినిమాలకి అయ్యే ఖర్చు ఒక్కోదానికి ఐదారు లక్షల రూపాయలైతే ఆగస్ట్ 5, 1960న విడుదలై అఖండ విజయం సాధించడమే కాక, ఆల్ టైమ్ క్లాసిక్స్ లో ఒకటిగా పేరుపొందిన హిందీ సినిమా 'మొగల్-ఎ-ఆజమ్' అయిన ఖర్చెంతో తెలుసా? అక్షరాలా 125 లక్షల రూపాయలు. 17,200 అడుగుల పొడవైన ఈ సినిమాని అప్పట్లోనే 150 ప్రింట్లతో విడుదల చేశారు. ఈ సినిమాకి నిర్మాతలు చెల్లించిన ఎక్సైజ్ డ్యూటీ రెండు లక్షల రూపాయలు. అక్బర్ గా పృథ్వీరాజ్ కపూర్, సలీమ్ గా దిలీప్ కుమార్, అనార్కలిగా మధుబాల నటించిన ఈ సినిమా నిర్మాణానికి ఏళ్లు పట్టింది.
ఇంత ఖర్చు, ఇంత కాలం, ఇంత పబ్లిసిటీతో విడుదలైన భారతీయ చిత్రం అప్పటివరకు మరోటి లేదు. సినిమా విడుదలయ్యే తేదీకి అడ్వాన్స్ బుకింగ్ గానే దేశం మొత్తంపై 50 లక్షల రూపాయలు వసూలైంది. దొంగ నోట్ల మాదిరిగా దొంగ టిక్కెట్లు ముద్రిస్తారేమోనన్న ఉద్దేశంతో బొంబాయిలో పది రంగుల టిక్కెట్లు తయారుచేసి వాడారు. వ్యాపార ఆంక్షల పుణ్యమా అని పాకిస్తానులో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం అప్పట్లో లేనందున పాకిస్తాన్ నుంచి ప్రేక్షకులు భారత్ కు వచ్చారు. బొంబాయిలో వెయ్యిమంది పాకిస్తాన్ పౌరులు తమ పాస్ పోర్ట్ చూపి, కేవలం ఈ సినిమా కోసం వచ్చామని చెప్పి టిక్కెట్లు సంపాదించి, సినిమా చూడటం పెద్ద విశేషం.
ఇంతాచేసి 'మొగల్-ఎ-ఆజమ్' షూటింగ్ జరిగింది కేవలం 5 వేల గజాల్లోనే. అందులో రంగుల్లో తీసిన శీష్ మహల్ సెట్టు నిర్మాణానికి దాదాపు రెండేళ్లు పట్టింది. ఆ సెట్టు నిర్మాణానికి అయిన వ్యయం 15 లక్షల రూపాయలని ఆ సినిమా దర్శకుడు, నిర్మాత అయిన కరీముద్దీన్ అసిఫ్ చెప్పారు. ఇంతకీ ఆ సెట్లో షూటింగ్ జరిగింది కేవలం ఐదు వారాలే.
ఈ సినిమాలో అక్బరుగా నటించిన పృథ్వీరాజ్ కపూర్ వాడాల్సిన మీసం మోడళ్లను మేకప్ డిపార్టుమెంట్ వాళ్లు అనేకం తయారుచేసి దర్శకుడు అసిఫ్ కు చూపితే ఆయనకు వాటిలో ఏదీ నచ్చలేదు. ఉన్న వాటిలో సూచించిన మోడల్ లోనే ఆధారం చేసుకుని మేకప్ వాళ్లు 13 రోజులు నిర్విరామంగా పాటుపడి తయారుచేసిన మీసాన్ని అసిఫ్ చివరికి ఓ.కే. చేశారు.
No comments:
Post a Comment