బాలనటుడిగా ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్న తరుణ్ హీరోగా మాత్రం దాన్ని కొనసాగించలేక నానా తంటాలు పడుతున్నాడు. రోజులు అతననుకున్న విధంగా సాగడం లేదు. హీరోగా నటించిన తొలి చిత్రం 'నువ్వే కావాలి' (2000) సూపర్ డూపర్ హిట్ కావడంతో లవర్ బాయ్‌గా అమ్మాయిల హృదయాల్లో చోటు సంపాదించిన అతను, ఆ తర్వాత క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చాడు. అంకుల్, చిరుజల్లు, అదృష్టం, ఎలా చెప్పను, నీ మనసు నాకు తెలుసు, నిన్నే ఇష్టపడ్డాను, ఎలా చెప్పను, సఖియా, సోగ్గాడు, ఒక ఊరిలో, నవ వసంతం, భలే దొంగలు, శశిరేఖా పరిణయం సినిమాలు బాక్సాఫీసు వద్ద వైఫల్యాల్ని చవిచూడటం అతని ఇమేజ్‌ని దెబ్బతీశాయి. 'నువ్వే కావాలి' కాక మరో రెండు సినిమాలు 'ప్రియమైన నీకు', 'నువ్వే నువ్వే' మాత్రమే హిట్టయ్యాయి.
వాస్తవానికి మంచి ఈజ్‌తో నటించగల సమర్థుడిగా తరుణ్ మంచి పేరే పొందాడు. తల్లిదండ్రులు రోజారమణి, చక్రపాణి ఇద్దరూ నటులే కావడంతో నటన అతనికి సహజంగా అబ్బింది. అలా అని చిన్నతనంలో సినిమాల్లో నటించాలని అతను అనుకోలేదు. ఎప్పుడైతే మణిరత్నం సినిమా 'నాయకుడు' చూశాడో అప్పట్నించీ సినిమాలపై అతని ధ్యాస మళ్లింది. మణిరత్నం రూపొందించిన 'అంజలి' చిత్రం ద్వారా బాలనటుడిగా సినిమాల్లోకి ప్రవేశించి, తొలి సినిమాతోనే ఉత్తమ బాలనటునిగా జాతీయ అవార్డును పొందాడు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, ఒరియా భాషల్లో మొత్తం 17 సినిమాల్లో బాలనటునిగా నటించిన తరుణ్ మలయాళ సినిమా 'నీరం' ఆధారంగా రూపొందిన 'నువ్వే కావాలి'తో హీరోగా రంగప్రవేశం చేసి ప్రేక్షకాదరణ పొందాడు. అలాంటి అతను ఇవాళ కెరీర్ క్రైసిస్‌ని చవిచూస్తుండటం ఆశ్చర్యకరమే. సబ్జెక్టుల ఎంపికలో తెలివిగా నడచుకోకపోవడమే దీనికి కారణమని విశ్లేషకుల అభిప్రాయం. చాలా రోజుల క్రితమే పూర్తయిన 'చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి', షూటింగులో ఉన్న 'అనుచరుడు' సినిమాల మీదే అతని ఆశలన్నీ ఉన్నాయి. వీటితోనైనా ఒకప్పటి ఈ బెస్ట్ చైల్డ్ యాక్టర్ బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా పేరు తెచ్చుకుంటాడా?
No comments:
Post a Comment