యాంగ్రీ యంగ్‌మ్యాన్ ఆఫ్ ఇండియన్ సినిమా ఎవరంటే ఠక్కున స్ఫురించే పేరు అమితాబ్ బచ్చన్. తన కెరీర్‌లో రొమాంటిక్ హీరోగా, కమెడియన్‌గా, 'షరాబీ'గా, డ్రమటిక్ హీరోగా, ఇప్పుడు వయసుమళ్లిన వ్యక్తిగా... ఎన్నో పాత్రలు చేసినా యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గానే ఆయన ప్రేక్షకుల ఆరాధ్యతారగా మారారనడంలో సందేహం లేదు. 1970, '80ల్లో చేసిన అనేక సినిమాల్లో 'విజయ్'గా కనిపించి, విజయ సోపానాలు అధిరోహించి, తన సినీ జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు అమితాబ్. ఇందులో 'విజయ్' పాత్ర సృష్టికర్తలైన సలీమ్ (ఖాన్) - జావెద్ (అఖ్తర్) ద్వయం పాత్ర ఎంతో ఉంది. ఈ విజయ్ పాత్రల్ని ఓసారి పరిశీలిస్తే, వాటికీ, మహాభారతంలోని కర్ణ పాత్రకీ సారూప్యత కనిపిస్తుంది. చిన్నతనంలోనే అన్యాయానికి గురైన యువకుడిగా ఆ పాత్రల్లో దర్శనమిచ్చారు అమితాబ్. 'జంజీర్'లో చిన్నప్పుడే తల్లిదండ్రుల హత్యని కళ్లారా చూసిన ఆయన, అవివాహిత పుత్రుడిగా, తండ్రి ఎవరో తెలీకుండా పెరిగిన యువకుడిగా 'త్రిశూల్'లో కనిపించారు. 'దీవార్'లో అయితే ఓ గొడవలో మొత్తం కుటుంబాన్నే కోల్పోయినవాడిగా కనిపించారు. ఇలాంటి నేపథ్యాలతో యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా రూపొందాడు 'విజయ్'. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దుష్టుల అంతం చూసే ఆ పాత్రతో ప్రేక్షకులు సహానుభూతి చెందారు. విజయ్ నవ్వితే వారూ నవ్వారు. విజయ్ ఏడిస్తే వారూ ఏడ్చారు. అతను దుష్టుల్ని వెంటాడి వేటాడి చంపుతుంటే తామే వాళ్లని చంపుతున్నట్లు ఆ పాత్రలో మమేకమయ్యారు. ఆ పాత్రల పోషణతో అంతగా ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేశారు అమితాబ్.
అప్పుడే కాదు, అరవై ఏళ్లు దాటినా కూడా ఆయన పట్ల ప్రేక్షకుల్లో అభిమానం తగ్గలేదనడానికి ఆయన చేసిన సినిమాలే నిదర్శనం. 'సర్కార్', 'కభీ అల్విదా నా కెహనా', 'నిశ్శబ్డ్', 'చీనీ కుమ్', 'భూత్‌నాథ్', 'సర్కార్ రాజ్', 'పా', 'ఆరక్షణ్' వంటి ఒకదానికొకటి పూర్తి భిన్నమైన చిత్రాలతో ఆయన ఇటు ప్రేక్షకుల, అటు విమర్శకుల ప్రశంసల్ని పొందారు. 'పా' చిత్రంలో చూపులకి అరవై ఏళ్ల వృద్ధుడిగా కనిపించే పన్నెండేళ్ల పిల్లాడి పాత్రను అమోఘంగా పోషించి, జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సాధించడం అపూర్వం. ఇక ఇటీవలే 69 సంవత్సరాల వయసులో 'బుడ్డా... హోగా తేరా బాప్' సినిమాలో యాక్షన్ రోల్ చేసి అబ్బుర పరచడం అమితాబ్‌కే చెల్లింది. ఎన్నిసార్లు ఆరోగ్య సమస్యలు తలెత్తినా మొక్కవోని దీక్షతో, అంకితభావంతో, చలాకీతనంతో నటనా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న బిగ్ బి రానున్న రోజుల్లో మరిన్ని వైవిధ్యభరిత పాత్రలతో మనల్ని ఆశ్చర్యపరచడం ఖాయం.
(అక్టోబర్ 11న అమితాబ్ 70వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా)
No comments:
Post a Comment