అంతదాకా జానపద, పౌరాణిక, కుటుంబ కథాచిత్రాలే రాజ్యం చేస్తూ వుంటే 'గూఢచారి 116'తో యాక్షన్ సినిమాల ఒరవడి మొదలైంది. కృష్ణ నటించిన ఈ సినిమా భారతదేశ చలనచిత్ర చరిత్రలోనే తొలి జేంస్‌బాండ్ తరహా చిత్రం. ఈ చిత్రకథ ఆరుద్ర కలం నుంచి రూపుదిద్దుకోవడం మరో విశేషం. ఆ తర్వాత ప్రేమ కథాచిత్రాలు, యాక్షన్ సినిమాలు సమానంగా ఆదరణ పొందుతూ వచ్చాయి. 70వ దశకంలో వీటి జోరు ఎక్కువగా కొనసాగుతుండగానే పాశ్చాత్య సినిమాల ప్రభావం తెలుగు సీమకి కూడా సోకింది. దాంతో పగ, ప్రతీకారం అంశాలతో సినిమాలు నిర్మించడం మొదలై, అవే సినిమాకి తప్పనిసరి వస్తువులకింద మారిపోయాయి. అయినప్పటికీ 'కాలం మారింది' వంటి అభ్యుదయ చిత్రాలు కొన్ని వచ్చాయి. దేశంలోనే మొట్టమొదటి కౌబాయ్ సినిమా 'మోసగాళ్లకి మోసగాడు' వచ్చింది. యాదృచ్ఛికంగా ఈ సినిమాకి రచన చేసింది కూడా ఆరుద్ర, హీరోగా నటించింది కృష్ణ. 1974లో సొంత నిర్మాణ సంస్థ పద్మాలయా స్టూడియోస్‌పై కృష్ణ 'అల్లూరి సీతారామరాజు' సినిమా నిర్మించి ఆ పాత్రలో తానే నటించాడు. తెలుగులో ఇది తొలి సినిమా స్కోప్ సినిమాగా చరిత్రకెక్కింది. స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా చెప్పుకోదగ్గ ఘన విజయాన్నే సాధించింది. ఈ దశకంలోనూ కొన్ని పౌరాణిక సినిమాలు వచ్చాయి. ఎన్‌టీ రామారావు స్వయంగా దర్శకత్వం వహించి త్రిపాత్రల్లో (కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు) నటించిన 'దానవీరశూర కర్ణ' కలెక్షన్ల వర్షం కురిపించింది. భారతంలో దుష్టపాత్రగా చిత్రీకరణకు గురైన దుర్యోధనుణ్ణి కొత్త కోణంలో ఆవిష్కరించి ఆ పాత్రకి హీరో ఇమేజ్ తీసుకొచ్చిన ఘనత ఎన్‌టీఆర్‌దే.
80వ దశకంలో తెలుగు సినిమా పూర్తిగా కమర్షియల్ మయమైపోయింది. డాన్సులూ, ఫైట్లూ లేకపోతే సినిమా జనంలోకి పోదన్న అభిప్రాయానికి వచ్చారు నిర్మాతలూ, దర్శకులూ, హీరోలూ. బూతు సంభాషణలూ, శృంగార సన్నివేశాలూ వున్న సినిమాలు తామరతంపరగా వచ్చాయి. క్లబ్ డాన్సులు సాధారణమయ్యాయి. 70వ దశకం ఆఖర్లో నటుడిగా రంగప్రవేశం చేసిన చిరంజీవి హీరోగా మారి నిలదొక్కుకొంటున్న సమయంలో 'ఖైదీ' అతడి స్థాయిని అనూహ్యంగా పెంచేసింది. యాక్షన్ చిత్రాల్లొ 'ఖైదీ' సరికొత్త ట్రెండుని నెలకొల్పింది. తెలుగులో హీరోల డాన్సులకి అక్కినేని ఆద్యులైనప్పటికీ వాటికి ఎక్కువ ప్రాచుర్యం కలిపించింది చిరంజీవే. ఓ వైపు యాక్షన్ సినిమాలు వెల్లువగా వస్తున్నా, మరోవైపు కళాత్మక విలువలున్న చిత్రాలు కొద్ది సంఖ్యలో అయినా వచ్చాయి. కె. విశ్వనాథ్ సృష్టి 'శంకరాభరణం' తెలుగు సినిమాకే గర్వకారణమైన చిత్రంగా చరిత్రలో సుస్థిరస్థానం సంపాదించింది. శాస్త్రీయ సంగీతమే హీరోగా తీసిన ఈ చిత్రం దేశ విదేశాల్లో విమర్శకుల ప్రశంసలు అందుకొంది. అక్కినేనితో దాసరి నారాయణరావు రూపొందించిన 'మేఘసందేశం' కూడా ఈ కోవలోకే వస్తుంది. ఈ దశకంలోనే మాదాల రంగారావు నటించిన 'యువతరం కదిలింది', 'ఎర్ర మల్లెలు', 'విప్లవ శంఖం' వంటి విప్లవాత్మక చిత్రాలు కూడా వచ్చాయి. అభ్యుదయ చిత్రాల సృష్టికర్తగా టి. కృష్ణ 'వందేమాతరం', 'నేటి భారతం', 'ప్రతిఘటన', 'రేపటి పౌరులు' వంటి సినిమాలు రూపొందించాడు. (ఇంకావుంది)
No comments:
Post a Comment