ఇంతమంది నటులు విలన్‌గా రాణించి హీరోలతో పాటే (తక్కువగానైనా) స్థిరంగా పేరు తెచ్చుకున్నా ఇప్పుడు అట్లాంటి స్థిరమైన విలన్ వేషధారులు కనిపించకపోవడమే బాధాకరం. జయప్రకాశ్‌రెడ్డి, తనికెళ్ల భరణి వంటి నటులు విలన్ వేషాల్లో మెప్పిస్తున్నా వాళ్లు ఎక్కువ సినిమాల్లో కనిపించడం లేదు. 'ప్రేమించుకుందాం రా' చిత్రంలో జయప్రకాశ్‌రెడ్డి విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నా తగినన్ని అవకాశాలు మన నిర్మాతలు, హీరోలు ఇవ్వడం లేదు. అతను ఆహార్యంలో కానీ, హావభావాల్లో కాన్నీ పచ్చి దుర్మార్గాన్ని పలికించడంలో నేర్పరి. ఇతన్ని తెలుగు చిత్రసీమ సరైన రీతిలో వినియోగించుకుంటే ఈసరికే తిరుగులేని విలన్ అయ్యుండేవాడు. 'మాతృదేవోభవ', 'నువ్వు నేను' సినిమాల్లో అతి క్రూరమైన విలన్ పాత్రల్లో బాగా రాణించిన తనికెళ్ల భరణిని విలన్‌గా కంటే హాస్య నటుడి పాత్రల్లోనే ప్రేక్షకులు ఎక్కువగా చూస్తున్నారు. కాబట్టి భరణిని హాస్యనటుల జాబితాలోనే వేసుకోవాలి. చలపతిరావుది మరో రకం కథ. పక్కా విలన్‌గా కనిపించే రూపం వున్నా ఎందుకనో పరిశ్రమ ఆయన్ని సరిగా ప్రమోట్ చేయలేదు. తెలుగులో ద్వితీయ శ్రేణి సినిమాల్లోనే ఎక్కువగా ప్రధాన విలన్ పాత్రలు వేసిన ఆయన 'నిన్నే పెళ్లాడుతా' నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడ్డాడు.
ప్రస్తుతం విలన్ వేషాల్లో పేరు తెచ్చుకుంటున్న వాళ్లంతా హీరో వేషాలు వేయడానికే ఆసక్తి చూపిస్తూ రావడం గమనార్హం. హీరోగా పరిచయమై, మళ్లీ అవకాశాలు లేకపోవడంతో 'జయం'తో విలన్‌గా మారిన గోపీచంద్ ఆ పాత్రలకి అచ్చుగుద్దినట్లు సరిపోయాడు. 'వర్షం', 'నిజం' సినిమాలు ఆ కోవలేనివే. తెలుగు సినిమాకి మంచి తెలుగు విలన్ లభించాడని అందరూ ఆనందిస్తున్న కాలంలోనే అనూహ్యంగా 'యజ్ఞం'తో హీరో అయిపోయాడు గోపీచంద్. ఇప్పుడు ఆ పాత్రల్లో తనకంటూ సొంత ఇమేజ్ కూడా సంపాదించేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన కుర్ర విలన్లు అజయ్, సుబ్బరాజు కూడా హీరో పాత్రల కోసం ట్రై చేస్తున్నారు. అజయ్ ఇప్పటికే రెండు సినిమాల్లో హీరోగా నటించేశాడు కూడా. సుబ్బరాజు కూడా అదే బాటలో పయనించాలని చూస్తున్నాడు.
మనం ఇక్కడ ఇంకో ఇద్దరు నటుల గురించి కూడా చెప్పుకోవాలి. విలన్లుగా పేరు తెచ్చుకుని, తర్వాత హీరోలుగా కూడా రూపాంతరం చెంది, అట్లా కూడా పేరు తెచ్చుకున్న ఆ నటులు - మోహన్‌బాబు, శ్రీహరి. కొత్తరకం డైలాగ్ మాడ్యులేషన్‌తో మోహన్‌బాబు, యాక్షన్ విలన్‌గా శ్రీహరి బాగానే పేరు తెచ్చుకున్నారు. కానీ మరింతకాలం విలన్లుగా వాళ్లు నటించి వుంటే వాళ్ల సేవలు అటు పరిశ్రమకీ, ఇటు ప్రేక్షకులకీ దక్కేవి. సో, ఇద్దరు మంచి విలన్లని అట్లా మిస్సయ్యాం. పోతే ఇప్పుడు మన పెద్ద నిర్మాతలు, పెద్ద హీరోలు తమ చిత్రాల్లో విలన్లుగా మన నటుల్ని కాక ఇతర భాషల నుంచే ఎక్కువగా దిగుమతి చేసుకుంటుండటం వల్ల కూడా మన 'విలన్' నటులకి మంచి అవకాశాలు దక్కడం లేదు. ముఖేష్‌రుషి, మోహన్‌రాజ్, ఆనంద్‌రాజ్, సాయికుమార్ (మలయాళీ), సాయాజీ షిండే, ప్రదీప్ రావత్, రాహుల్‌దేవ్, ముకుల్‌దేవ్, దండపాణి వంటి పరభాషా విలన్లనే మన అగ్రహీరోలు కోరుకుంటున్నారు. ఈ పరిస్థితి మారాలి. పెద్ద హీరోలు మన వాళ్లలోని టాలెంటుని గుర్తించి అవకాశాలు ఇవ్వాలి. నిర్మాతలు కూడా ఈ విషయంలో ఒత్తిడికి లోంగిపోకూడదు. అలా జరిగితే మరికొందరు మంచి తెలుగు 'విలన్లు' తయారవుతారు. వాళ్లలో కొందరైనా చరిత్రలో స్థానం పొందగలిగే అవకాశం వుంటుంది. (అయిపోయింది)
No comments:
Post a Comment