తారాగణం: కాంతారావు, కృష్ణకుమారి, రాజనాల, సత్యనారాయణ
రచన: జి. కృష్ణమూర్తి
సంగీతం: రాజన్-నాగేంద్ర
నిర్మాత, దర్శకుడు: బి. విఠలాచార్య
బేనర్: విఠల్ ప్రొడక్షన్స్
కథ: మణిశిలాదేశపు మహారాణి ఎంతో కాలానికి గర్భం ధరించిందన్న సంతోషంలో మహారాజు కులదేవతైన కనకదుర్గ పూజకు వెళ్లక ఆ తల్లిని చులకన చేస్తాడు. దాంతో నిండు చూలాలైన మహారాణి అడవుల పాలయ్యింది. రాజ్యభారం బావమరిది సేనాధిపతి నరేంద్రునికి అప్పగించి మహారాణికి వెదకడానికి బయలుదేరి దారీతెన్నూ తోచక అల్లాడుతుంటాడు రాజు. అరణ్యాలలో కుమారుణ్ణి కన్న రాణి ఒక ముని కోపానికి గురై ఆయన శాపంవల్ల భల్లూకమై పోతుంది. ఆ దారిని కనకదుర్గ పూజ చేసుకుని వస్తున్న ఒక పుణ్యదంపతులకు ఆ బిడ్డ దొరకగా మాధవుడని పేరుపెట్టి అల్లారుముద్దుగా తమ కుమారుడైన త్రిలోకంతో పెంచుకొస్తారు. రాజులేని రాజ్యానికి నరేంద్రుడు రాజైపోతాడు. అతనికి మాలతి ఒక్కతే సంతానం. రోజురోజుకి దేశంలో మారుమోగిపోతున్న మాధవుని వీరత్వం ఆమె వింటుంది. ఒకనాడు తన ప్రాణాలు మాధవుడు కాపాడగా అతనికి హృదయం అర్పిస్తుంది.
సిద్ధేంద్రుడనే కపాలకుని వద్ద శిష్యరికం చేసి సకల విద్యలూ సంపాదించిన మేఘనాథుడనే వీరుడు మాయావతి అనే మునికన్యను బలవంతం చేస్తాడు. గురువు మందలిస్తే ఆ శిష్యుడు గురువునే మంత్రబద్ధునిగా చేస్తాడు. ఆ గురుద్రోహికి తగిన శిక్ష విధించాలని సిద్ధేంద్రుడు సర్వసిద్ధికి మార్గం చెబుతాడు. దానికి ఒక అదృష్టజాతకుడైన మహారాజు అవసరం పడుతుంది. మేఘనాథుని దృష్టికి నరేంద్రుడు గోచరిస్తాడు. భార్యావిహీనుడైన ఆ మహారాజును మాయావతి మూలంగా వశం చేసుకోవచ్చని ఆలోచించి మాయావతిని మంత్రబద్ధం చేసి మారురూపంతో మేఘనాథుడు మణిశిలాదేశం ప్రవేశిస్తాడు.
మేఘనాథుని ప్రగల్భాలు విని మాధవుడు అతనిని ఓడించాలని ప్రయత్నించి మంత్రశక్తివల్ల ఓడిపోతాడు. మహారాజు మేఘనాథునికి పాదపూజ చేయ నిశ్చయించుకుంటాడు. కాని మాధవుడు మందలిస్తూ మేఘనాథుని ఓడించడానికి ఒక సంవత్సరం గడువు తీసుకుంటాడు. రాకుమారి అతని పట్టుదలకు ఆనందిస్తుంది. కృతజ్ఞతగా అతనిని ఆనాడే గాంధర్వ వివాహం చేసుకుంటుంది.
ఈలోగా సేనాని మార్తాండవర్మ రాజ్య ప్రలోభంతో మేఘనాథుడు పన్నిన వలలోపడి మహారాజును హత్యచేయ యత్నిస్తాడు. యత్నం విఫలంకాగానే నేర్పుగా నేరం నిర్దోషియైన మాధవుని మీదికి తోస్తాడు. మాధవునికి మహారాజు ఉరిశిక్ష విధిస్తాడు. మాధవుడు తన తమ్ముని సహాయంతో వధ్యస్థానం నుంచి తప్పించుకుని పారిపోతాడు.
మేఘనాథుని ఆటకట్టే అధినాధుడే లేకపోతాడు. ప్రతి పౌర్ణమినాడు మాయను నాగుగా మార్చి తన బాటకు అడ్డుగావున్న వారిని తొలగిస్తుంటాడు. ప్రతి పర్ణమినాడు ఒక్కొక్కరు సర్పద్రష్టలై చనిపోతుంటారు.
పారిపోయిన మాధవుడు తన తమ్మునితో నానా అగచాట్లు పడతాడు. మోహిని చేతిలో చిక్కి తన తమ్ముని వల్ల ప్రమాదం నుంచి బయటపడతాడు. చివరకు సిద్ధేంద్రుడున్న గుహకు చేరుకుంటాడు.
మేఘనాథుడు అమాత్యుని, సేనానిని పాముకాట్లతో చంపిస్తాడు. రాకుమారి గర్భిణీ అని గ్రహించి ఆమె అంతఃపురంలో వుంటే దేశానికే అరిష్టమని రాజుతో చెబుతాడు. రాజు అతని సలహా ప్రకారం కుమార్తెను జలపాతంలో తోయిస్తాడు. నదిలో కొట్టుకుపోతున్న ఆ చూలాలిని ఒక భల్లూకం రక్షిస్తుంది.
మాధవుడు త్రిలోకంతో ఎన్నో అవాంతరాలు గడచి భూతాల్ని పిశాచాల్ని జయించి సిద్ధేంద్రుని కనిపెడతాడు. మంత్రబద్ధుడైన అతన్ని విడుదలచేసి అతని వద్దనున్న అన్ని విద్యలూ అభ్యసిస్తాడు. కానీ అతనికి సర్వసిద్ధి లభించదు. కనకదుర్గ కనికరం లేనందున సిద్ధి లభించలేదని గురువు చెప్పగా మాధవుడు నిరాశ చెందుతాడు.
No comments:
Post a Comment