Thursday, August 15, 2013
ఆనాటి సంగతి: అంజలి ఎందరికో అమ్మ, వదిన!
అంజలీదేవి కథానాయికగా నటించినప్పటి కంటే 'లవకుశ'లో సీతగా, 'రంగుల రాట్నం'లో తల్లిగా నటించినప్పటి నుంచే ఆమెకు అభిమానులు ఎక్కువయ్యారు. ఆమె నటించిన చిత్రాలు ప్రజల మనసులపై ఎంతటి అమోఘమైన ప్రభావాన్ని చూపించాయో ఆమె ఔట్‌డోర్ షూటింగులకు వెళ్లిన అనేక సందర్భాల్లో వెల్లడైంది. ఒకసారి ఆమె శ్రీశైలం వెళ్లి వస్తుండగా ఒక గ్రామం దగ్గర జనం దారికి అడ్డుగా నిల్చుని, కారు రాగానే ఆపారు. కొందరు ఆడవాళ్లు "సీతమ్మ తల్లీ కారు దిగమ్మా" అని ఆప్యాయతతో కోరారు. దిగిన వెంటనే కొంతమంది ఆమె కాళ్లకు నమస్కరించారు. ధాన్యపు కంకుల గుత్తులు కానుకగా సమర్పిస్తూ, నుదుట కుంకుమ తిలకం దిద్ది "తొలి పంటమ్మా! నీకిస్తున్నాం. నీకు జయం కలగాలి" అని అంతా ఏకకంఠంతో పలకడమో ఆమె పరవశించి పోయారు. జీవితం చరితార్థమైందని భావించారు. ఇది 'లవకుశ' విడుదలయ్యాక ప్రజల్లో ఆమెపై ఏర్పడిన పవిత్ర భావం. ఇలాగే 'వదినగారి గాజులు' చూసిన కొంతమంది మగవాళ్లు "నీలాంటి వదిన కావాలని కోరుకుంటున్నాం" అని ఉత్తరాలు రాశారు. 'ఇలవేల్పు', 'రుణానుబంధం', 'రంగుల రాట్నం', 'బడిపంతులు' సినిమాలు వచ్చాక ఆమెను వదినగా, తల్లిగా, సోదరిగా ఊహించుకుని సంబోధిస్తూ వచ్చారు జనం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment