Thursday, August 29, 2013
ఆనాటి సంగతి: 'నేరము-శిక్ష'తో కేరక్టర్ ఆర్టిస్టుగా మారిన కత్తి వీరుడు
ఎం. బాలయ్య నిర్మించిన 'నేరము-శిక్ష' సినిమా నుంచి కేరక్టర్ ఆర్టిస్టుగా మారారు కత్తి వీరుడు కాంతారావు. అంతకు ముందు ఆయనతో తయారైన జానపద చిత్రాలన్నీ తక్కువ బడ్జెట్‌తో నిర్మితమైనవే. నిర్మాతలకు బాగా లాభాలు వచ్చేవి. పుష్కలంగా డబ్బు రావడంతో నిర్మాతల దృష్టి సహజంగానే భారీ బడ్జెట్ సినిమాల మీద పడేది. ఆయనకూ భారీ తారాగణంతో సినిమాలు తీయాలనిపించేది. తీశారు. చెయ్యి కాల్చుకున్నారు. సంపాదించిన డబ్బంతా హారతి కర్పూరంలా హరించుకుపోయింది. మరోవైపు జానపద చిత్రాలు ఉధృతంగా తయారై ఒకదాని మీదొకటి పోటీగా విడుదలవడంతో చాలా వరకు దెబ్బతిన్నాయి. దాంతో ఆ నిర్మాతల దృష్టి సాంఘిక చిత్రాల వైపు మళ్లింది. జానపద చిత్రాల నాయకుడన్న ముద్ర పడటంతో కాంతారావుకు సాంఘిక చిత్రాల్లో నాయకుడిగా సరైన అవకాశాలు రాలేదు. ఆయనతో బాలయ్య "మీరేమీ అనుకోకపోతే మా సినిమాలో ఒక ఫాదర్ రోల్ ఉంది. మీరే వెయ్యాలి" అన్నారు. ఒకప్పుడు బాలయ్య కూడా హీరోనే. నిర్మాత అయ్యాక కేరక్టర్స్ అడపాదడపా వేస్తూ వస్తున్నారు. ఆయన వచ్చి అడిగితే కాదనలేకపోయారు కాంతారావు. కానీ ఆయన మిత్రులు కొందరు "హీరో వేషాలు వేసిన మీరు ఒకసారి వయసు మళ్లిన పాత్రలు వేస్తే మీ మీద అదే ముద్ర పడిపోతుంది. ఒప్పుకోకండి" అని చెప్పారు. మరి జరుగుబాటయ్యేది ఎలా? ఒక రాత్రంతా తీవ్రంగా ఆలోచించి అక్కినేని నాగేశ్వరరావును సలహా అడిగారు. "తప్పకుండా ఒప్పుకోండి. మీకిది టర్నింగ్ పాయింట్ కావచ్చు" అని నాగేశ్వరరావు చెప్పారు. ఆయన చెప్పింది నిజమేననీ, ఇండస్ట్రీకి దూరం కాకుండా ఉండాలంటే, కాలానికి తగ్గట్లు సర్దుకు పోవాలనీ తనకు తనే నచ్చచెప్పుకున్నారు కాంతారావు. అలా 'నేరము-శిక్ష'లో తొలిసారి తండ్రి వేషం వేశారు. అదిచూసి దుక్కిపాటి మధుసూదనరావు, ఆదుర్తి సుబ్బారావు 'బంగారు కలలు'లో కేరక్టర్ ఇచ్చారు. ఆ తర్వాత 'గుణవంతుడు', 'ఓ సీత కథ', 'ముత్యాల ముగ్గు' వంటి సినిమాలు ఆయనను కేరక్టర్ ఆర్టిస్టుగా నిలబెట్టాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment