తెలుగు సినిమా కథల కరువుతో అల్లాడుతోంది. మూస కథలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక బొక్క బోర్లా పడుతోంది. యూత్ సినిమాలు, ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు, యాక్షన్ సినిమాలు... ఏవీ జనాన్ని అలరించలేక పోతున్నాయి. నావెల్టీ, లేదా వెరైటీ సినిమాలు ఏడాదికి ఒకట్రెండు కంటే మించడం లేదు. తలా తోకాలేని, అర్థం పర్థంకాని కథల్ని తెరకెక్కించేందుకు కోట్లాది రూపాయల్ని ఖర్చుపెట్టేందుకు దర్శకులూ, నిర్మాతలూ తెగ తాపత్రయపడుతున్నారు. విమర్శని ఏమాత్రం సహించలేక 'మేం తీసేదే సినిమా. మీరు దాన్ని చూడాల్సిందే' అన్న తరహాలో వ్యవహరిస్తుండటం వల్ల విడుదలైన వారానికే రీళ్ల డబ్బాలు నిర్మాత ఇంటికి తిరుగుముఖం పడుతున్నాయి.
హీరోల కాల్షీట్లు, లొకేషన్లు, భారీ సెట్లు, ఇతర హంగామాల గురించి తప్ప నిర్మాతలు కానీ, దర్శకులు కానీ సరైన కథ గురించి పట్టించుకోవడం లేదన్నది ఏ సినిమా చూసినా తెలిసిపోతుంది. 2011లో ఎనిమిది నెలల కాలంలో విడుదలైన సినిమాల్లో 10 శాతం సినిమాలు కూడా సక్సెస్‌కి నోచుకోకపోవడానికి కారణం? కథ, కథనం విషయంలో దర్శకులు ఏ మాత్రం శ్రద్ధ వహించనందువల్లే.
పొరుగున ఉన్న తమిళ రంగంలో ప్రతిభావంతులైన రచయితలు, దర్శకులు కొత్త కథలకు, సృజనాత్మక చిత్రాలకు శ్రీకారం చుడుతుంటే మనం మాత్రం కొత్త సీసాలో పాత సారాలాగా రసం కోల్పోయిన చెరుకు పిప్పిలాంటి కథల్నే మార్చి మార్చి తీసుకుంటూ ఎంతో విలువైన కాలాన్నీ, డబ్బునీ వృథా చేసుకుంటున్నాం. లేటెస్టుగా తమిళం నుండి వచ్చిన 'రంగం', '1947 ఎ లవ్‌స్టోరీ' సినిమాల్నే తీసుకోండి. ఒకదానికొకటి పూర్తి భిన్నమైన ఈ సినిమాలు అక్కడివాళ్ల సృజనాత్మక శక్తిని చాటుతున్నాయి. '1947 ఎ లవ్‌స్టోరీ'ని దాని డైరెక్టర్ ఎ.ఎల్. విజయ్ రూపొందించిన విధానం అత్యుత్తమం. టైటిల్లో ఉన్నట్లు అప్పటి నేపథ్యాన్ని గొప్పగా కళ్లముందుంచాడు. ఓ చాకలి కుర్రాడికీ, బ్రిటీష్ గవర్నర్ కుమార్తెకీ మధ్య కలిగే అనురాగాన్ని అతి సుందరంగా, గుండెల్ని హత్తుకునేట్లు చిత్రించాడు. మనవాళ్ల నుంచి ఎప్పటికీ అలాంటి చిత్రాన్ని ఊహించలేం. కె. రాఘవేంద్రరావు వంటి గొప్ప దర్శకుడు వెంకటేశ్‌తో 'సుభాష్ చంద్రబోస్'ని ఎలా తీశాడో చూశాం కదా. టాలీవుడ్ బాక్సాఫీస్ తమిళ డబ్బింగులతో నిండిపోతున్నదని గగ్గోలు పెడుతున్నవాళ్లంతా ఆ సమయాన్ని తెలుగు సినిమా నాణ్యత మీద పెడితే బాగుంటుంది. సరైన కథ లేకుండా భారీ హంగులు ఆర్భాటాలు, క్రేజీ కాంబినేషన్లతో సినిమా తీస్తే వాటికి ఓపెనింగ్స్ తప్ప నిలకడైన 'రన్' ఉండదు. వారం రోజులకే థియేటర్లన్నీ ఖాళీ ఐపోతాయి.
తెలుగు చిత్రసీమలో కథారచయితలే లేరా? మంచి కథల్ని సృజించే సత్తా మనవాళ్లలో లేదా? ఇదివరలో ఎన్ని మంచి కథలు మన రచయితల నుంచి రాలేదు? ఆణిముత్యాల్లంటి సినిమాలెన్నో, కళాఖండాల్లాంటి సినిమాలెన్నో తెలుగు నుంచి వచ్చాయి కదా! ఒకటిన్నర దశాబ్దం నుంచే టాలీవుడ్‌లో కథాదారిద్ర్యం రాజ్యమేలుతోంది. ఇందుకు కారణం సత్తా కలిగిన రచయితలు తమలోని శక్తి సామర్థ్యాల్ని పూర్తిగా ప్రదర్శించలేక పోవడమే. శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, మిష్టర్ పెళ్లాం, పెళ్లి పుస్తకం, లేడీస్ టైలర్, ప్రతిఘటన, మయూరి, పెళ్లి సందడి, తలంబ్రాలు, అంకుశం, అరుంధతి, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, ఒక్కడు, మగధీర, ఆర్య, కొత్త బంగారులోకం వంటి హిట్ సినిమాలకు కథల్ని అందించింది మన రచయితలే కదా. అవకాశాలు కల్పించాలే కానీ 'హ్యాపీడేస్'ని తీసుకొచ్చే కథల్ని తయారు చెయ్యడానికి వర్థమాన రచయితలెందరో సినీ ఫీల్డులో ఛాన్సుల కోసం నిర్మాతల, దర్శకుల ఇళ్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. బిజీగా ఉండే రచయితల్ని మరింత బిజీ చెయ్యడం వల్ల మంచి కథలు పుట్టవు. కొత్తగా పెన్ను చేతబట్టిన ఔత్సాహిక రచయితలకి ప్రోత్సాహం అందజేస్తే రజతోత్సవ, శతదినోత్సవ చిత్రాలకు కథలు దొరుకుతాయి.
మన సోకాల్డ్ అగ్ర నిర్మాతలు మొదలు చిన్న నిర్మాతల దాకా, దర్శకులకు సైతం కథ గురించి తీరిగ్గా చర్చించే అవకాశమే ఉండటం లేదు. ఒకవేళ అవకాశం ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నారు. కథ తయారు చేయడంలో ఎక్కువ సమయాన్ని వెచ్చించడానికి ఎవరూ ఇష్టపడనట్లే కనిపిస్తోంది. ఎంతసేపూ లొకేషన్లు లేదా హీరో డేట్లు లేదా భారీ సెట్టింగులు - వీటి మీద ఉండే ఆసక్తి కథను ఎంపిక చేసుకునేప్పుడు ఉండటం లేదు. ఇంకా చెప్పాలంటే కొత్త కథలు ఎక్కడుంటాయి అంటూ తిరిగి ప్రశ్నిస్తుంటారు. కొత్త కథలు, కొత్త ప్రయోగాలు తెలుగు ప్రేక్షకులు మెచ్చరంటూ స్టేట్‌మెంట్లు కూడా ఇస్తుంటారు. అయితే 2011లో జనం మెచ్చిన సినిమాల్లో ఎక్కువగా రెగ్యులర్ సినిమాలకు భిన్నమైనవే కావడం గమనార్హం. 'రంగం', 'కాంచన', 'బ్రమ్మిగాడి కథ', '100% లవ్', 'మిస్టర్ పర్ఫెక్ట్', 'అలా మొదలైంది', 'గోల్కొండ హైస్కూల్' వంటివి ప్రజాదరణ పొందడం గమనించయినా కథల విషయంలో నిర్మాతలు, దర్శకులు మరింత శ్రద్ధ వహించాలి. లేకపోతే తెలుగు సినిమా ఒక హిట్టు, పది ఫ్లాపుల సంప్రదాయం నుంచి ఎన్నటికీ బయటపడదు.
No comments:
Post a Comment