'దూకుడు' సబ్జెక్ట్ ఎలా పుట్టింది?
'దూకుడు' సబ్జెక్టుకి పెద్ద కథే ఉంది. మహేశ్‌తో సినిమా చెయ్యాలనేది శ్రీను వైట్ల గారికి ఎప్పట్నించో ఉన్న కోరిక. 'ఖలేజా' షూటింగ్ జరుగుతున్న సమయంలో మహేశ్ గారు పిలిచి "మీరు స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టండి. నా తర్వాతి సినిమా మీతోనే" అన్నారు. అప్పటిదాకా ఆయన తర్వాతి సినిమా ఏదో క్లారిటీ లేదు. రెండు మూడు పేర్లు వినపడుతూ ఉన్నాయి. మహేశ్ ఎప్పుడైతే తర్వాతి సినిమా మీదే అన్నారో శ్రీను ఆ బాధ్యతని ఎలా ఫీలయ్యారంటే ఈ సినిమాకి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చెయ్యకూడదు. కథ పరంగా, అన్ని విషయాల పరంగా జాగ్రత్తగా ఉండాలి - అనే ఆలోచనతో స్పాన్ ఉన్న హీరో కాబట్టి 'మగధీర'లాగా గ్రాండియర్‌గా వెళ్దామా అనుకున్నారు. తర్వాత అది ఈయన శైలికి దూరంగా ఉండే సినిమా, అందులో ఎంటర్‌టైన్‌మెంట్‌కి అంటే కామెడీకి పెద్దగా స్కోప్ కనిపించడం లేదు, హెవీ బ్యాక్‌గ్రౌండ్స్ అసలు సూటవుతాయా అనుకుంటూ దాన్నుంచి డ్రాప్ అయ్యాం. తర్వాత ఓ లవ్‌స్టోరీ అనుకున్నాం. దాని మీద చాలా కాలం కూర్చున్నాం. మహేశ్‌కి లైన్ చెబితే ఆయనకి నచ్చింది. తాను కూడా పూర్తి స్థాయి లవ్‌స్టోరీని అంతదాకా చెయ్యలేదనీ, చెయ్యమనీ చెప్పారు. మా ఉద్దేశంలో 'ఆనందం' తర్వాత శ్రీను గారు మళ్లీ ఆ తరహా సినిమా చెయ్యలేదు అనేది మా ఫీలింగ్. మహేశ్‌కి అలాంటి బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్‌స్టోరీని ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీ పెట్టుకుని చేస్తే బాగుంటుందనుకుని మేం ప్లాన్ చేశాం. కానీ మహేశ్ అంటే యాక్షన్ కూడా కోరుకుంటున్నారు జనం. మా ప్రొడ్యూసర్లు కూడా కొంచెం పంచ్ ఉన్న సినిమా చేస్తే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ వ్యక్తం చేశారు. రెండు మూడు నెలల డిస్కషన్ల తర్వాత ఆ లవ్‌స్టోరీని పక్కనపెట్టి ఎంతో తర్జనభర్జన తర్వాత ఓ అద్భుతమైన లైన్‌ని సెట్ చేశాం. 'ఇది తప్పు చెయ్యదు. జనాలకి ఇది బాగా నచ్చే అవకాశం 100% ఉంది. దీంట్లో అన్ని రకాల అంశాలూ ఉన్నాయి' అనుకుని దీన్ని హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్ చేయడం కోసం ఈ ఆర్నెల్లూ శ్రమించాం.
మహేశ్‌కి ఎన్ని వెర్షన్స్ వినిపించారు?
నిజానికి మహేశ్ ఒక మనిషిని నమ్మిన తర్వాత - అది శ్రీను వైట్ల కానివ్వండి, గుణశేఖర్ కానివ్వండి, త్రివిక్రం కానివ్వండి - లైన్ ఓకే చెప్పాక ఆయన ఇంక జోక్యం చేసుకోరు. ప్రతి విషయాన్నీ అదెలా వచ్చిందీ, ఇదెలా వచ్చిందీ అని అడగరు. ఫుల్ ఫ్రీడం ఇచ్చేస్తారు. "నా కెరీర్లో 'ఒక్కడు', 'పోకిరి' సినిమాల రేంజిలో నిలబడే అవకాశం ఉంది. నేను ఇంతకుముందు చేసిన సినిమాలకు ఇలా చెప్పలేదు. మీరెంత చేసుకుంటే అంత ఈ సినిమా పొటెన్షియాలిటీ ఉంటుంది. మీ మార్క్ మిస్ కాకుండా చెయ్యండి" అన్నారు. దాంతో దాన్ని మేమే ఓ ఛాలెంజిగా తీసుకుని ఫస్టాఫ్ ఆరేడు వెర్షన్లు చేశాం. మహేశ్‌కి ఫైనల్ వెర్షన్ వినిపించాం. షూటింగుకి వెళ్తున్న దశలో ఆయనకి మొత్తం కథ చెప్పాం. ఆయన 'గో ఎ హెడ్' అన్నారు. అప్పట్నించి ఇప్పటివరకు ఆయన నుంచి పూర్తి సహకారం. ఆయనకి యాక్షన్ మీద మంచి కమాండ్ ఉంది. వాటి మీద ఆయన చిన్న చిన్నవే అయినా మంచి డౌట్స్ అడిగారు. ఆ మార్పులు కూడా బాగా జరిగాయి. అలాగే స్క్రీన్‌ప్లేలో రెండు మూడు చిన్న సూచనలు చేశారు. కన్ఫ్యూజన్‌కి తావులేకుండా అవి బాగా హెల్ప్ అయ్యాయి. ఎడిటింగ్ తర్వాత చూసుకున్నాక వాటికి చాలా సంతోషపడ్డాం.
మహేశ్ కోసం ప్రత్యేకించి ఈ సబ్జెక్టులో ఏవైనా విశేషాల్ని ప్రవేశపెట్టారా?
మహేశ్‌బాబు అనగనే ప్రేక్షకులు క్లాస్, యాక్షన్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అలాంటి ఆయన్ని కొంత మోతాదు తగ్గించి లోకల్‌గా చూపించారు 'పోకిరి'లో పూరి జగన్నాథ్ గారు. ఆ తర్వాత మేము బాగా లోకల్ టోన్ ఉన్న డైరెక్టర్ అండ్ రైటర్. మా స్క్రిప్ట్స్ అన్నిట్నీ మీరు గమనిస్తే మన ఇంటీరియర్ పీపుల్ హావభావాలకి దగ్గరగానే అవుతా ఉంటాం. ఈ సినిమాలోనూ అలాగే ఓపెన్ అయ్యి చూపిద్దాం అని ఫిక్సయి చేశాం.
మహేశ్ కేరక్టరైజేషన్ ఎలా ఉండబోతోంది?
మహేశ్ క్యారెక్టరైజేషన్ మంచి యాటిట్యూడ్‌తో ఉంటుంది. ఆ యాటిట్యూడ్ సినిమాలో చాలా హైలైట్‌గా అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన నిల్చునే స్టైల్ గానీ, ఆయన మాట్లాడే విధానం గానీ, ఆయన ఇగో ఫీలయ్యే విధానం గానీ, లేకపోతే ఆయన డైలాగ్ చెప్పే టోన్ గానీ ఇవన్నీ బయటివాళ్లు అనుకరించే స్థాయిలోనే ఉంటాయి.
'కింగ్'కి ఆర్నెల్లే టైం ఉండటం వల్ల కొన్ని తప్పులు సరిచేయలేకపోయామన్నారు. ఇప్పుడు 'దూకుడు'ని కూడా ఆర్నెల్లలోనే తీశారు...
కాదండీ. ఈ సినిమా వర్క్ మొదలై దాదాపు రెండేళ్లయ్యిందండీ. 'నమో వెంకటేశ' 2010 జనవరిలో రిలీజయ్యింది. అప్పట్నించీ మేం ఈ ప్రాజెక్టు మీదే స్ట్రగులవుతూ ఉన్నాం. సెకండాఫ్ మీదైతే ఏడెనిమిది నెలలు కూర్చున్నాం. షూటింగుకి వెళ్లేటప్పటికి ఫస్టాఫ్ పక్కాగా రెడీ అయ్యింది. సెకండాఫ్ మేమో వెర్షన్ అనుకుని చెప్పాం. కానీ మధ్యలో ఇండస్ట్రీ స్ట్రైక్ రావడం, అప్పుడు కూడా కాంప్రమైజ్ కాకుండా కంటిన్యూగా సిట్టింగ్స్ వేస్తూ వచ్చాం.
సంభాషణల రచయితగా కోన వెంకట్ పాత్రేమిటి?
ఎంటర్‌టైన్‌మెంట్ సబ్జెక్ట్ కాబట్టి ముందే ట్రీట్‌మెంట్ అనుకునేటప్పటికే 70% దాకా సంభాషణలు ఎలా ఉండాలనే దానిపై క్లారిటీ వచ్చేస్తుంది. డైలాగులు ఎలా ఉండాలో డైరెక్టర్ గారే చెబుతారు. 'వెంకీ' నుంచి మా అన్ని సినిమాలకి కోన గారే మాటల రచయిత. మాటల విషయంలో ఆయనకీ, మాకూ బ్రహ్మాండంగా సింకవుతుంది. ఈ సినిమాలో అద్భుతమైన మాటలు రాశారు. ఈ మాటల్లో శ్రీను వైట్ల గారి భాగస్వామ్యం కూడా ఉంది.
పంచ్ డైలాగుల గురించి చెప్పండి..
ఫ్రాంకుగా చెప్పాలంటే కొన్ని డైలాగులు నాకు శ్రీను గారు చెప్పేటప్పుడు "ఈ డైలాగుల్లో ఇంత పంచ్ ఉందా?" అనిపించింది. ఉదాహరణకి "మైండులో ఫిక్సయితే బ్లైండుగా వెళ్లిపోతాను' అనేది. ఆయన 'ఇది చూడండి. భలే ఉంటుంది' అనేవారు. డబ్బింగ్ అయిపోయి ట్రైలర్ వదిలినప్పుడు దానికొచ్చిన రియాక్షన్ చూసి నేనే షాకయ్యా 'ఇంత రియాక్షన్ ఉంటుందా' అని. ఇలాంటివి సినిమాలో చాలా ఉన్నాయి. ఆయన పర్టిక్యులర్‌గా ఫిక్సయి రాశారు. శ్రీను గారు చెబుతూ వచ్చారు - "ఇప్పటివరకు మనం సాఫ్ట్ సినిమాలు చేస్తూ వచ్చాం. కామెడీ సీన్లలో తప్ప పవర్‌ఫుల్ డైలాగ్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చెయ్యలేదు. ఈ సినిమా దానికి లాంచింగ్‌గా ఉండాలి. ఇక నుంచీ మనల్ని కూడా అలాంటి డైలాగ్స్ పెట్టమనేటట్లుండాలి" అని. ఇందులో డైలాగ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సైడ్ వచ్చేసరికి శ్రీను వైట్ల తరహాలోనే ఉంటాయి. యాక్షన్, పవర్‌ఫుల్ సైడ్ వచ్చేసరికి మహేశ్ తరహాకి మేం వెళ్లాం. ఆయన కూడా అదే స్టైల్‌కి మలుచుకుని చెప్పారు. ఇందులోని డైలాగుల్లో 'పోకిరి' షేడ్స్, 'రెడీ' షేడ్స్ రెండూ కనిపిస్తాయి. అయితే ప్రేక్షకులకి ఇది కావాలని చేసినట్లు ఏమాత్రం అనిపించదు. కథే బలంగా ఎలివేట్ అవుతూ వెళ్తుంది. మీరు చూసినప్పుడు కూడా అదే ఫీలవుతారు.
మీకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి చెబుతారా?
బేసిగ్గా నేను కృష్ణగారి అభిమానిని. కృష్ణగారు సాహసానికి మరో పేరని అంటుంటారు. ఈ సినిమాలో హీరో ఓ డైలాగ్ చెబుతాడు "మా నాన్నెప్పుడూ ఒకటంటుండేవాడు 'సాహసమే ఊపిరిగా బతికేవాడికి దారితో పనిలేదు దమ్ముతోనే పని' అని". ఈ డైలాగ్ మంచి సందర్భంలో వస్తుంది. దాన్ని అందరూ కృష్ణగారితో ఐడెంటిఫై చేసుకుంటారు.
'నమో వెంకటేశ' దాకా మీ సినిమాలన్నీ ఓకే పేటర్న్‌లో ఉన్నాయనే పేరొచ్చింది. 'దూకుడు' ఎలా ఉండబోతోంది?
ఆ పేటర్న్ లేకపోతే జనాలు చూడరేమో అనే ఫీలింగ్ ఉంటుండేది. కానీ అదే చేసుకుంటూ పోతే మొనాటనీ ఫీలయ్యే అవకాశం ఉంది. మీరు గమనిస్తే మేం ఎక్కువగా ఇళ్లల్లోనే సినిమా చేసుకుంటూ వస్తున్నాం. దాని వల్ల ఓ గ్రూప్ మధ్య కథ సెటిలవుతుంది. మంచి కమెడీకి ఆస్కారం కలుగుతుంది. బడ్జెట్ కూడా తగ్గుతుంది. ఈ పేటర్న్‌ని మరికొంత మంది కూడా ఫాలో అయ్యారు. ఇలా బోల్డన్ని సినిమాలు రావడంతో మేం కూడా రిపిటిషన్ చేసినట్లయ్యింది. అందుకే 'దూకుడు'కి పెద్ద స్పాన్ పెట్టుకున్నాం. టర్కీ లొకేషన్లకి వెళ్లాం. ఎమోషన్స్‌కి కూడా రకరకాలుగా డీల్ చేశాం. ఇదివరకు డీల్ చెయ్యని ఎమోషన్స్‌ని డీల్ చేశాం. ఇదివరకు ఏ సినిమాలో చెయ్యని రీతిలో ఇందులో శ్రీను హ్యూమన్ ఎమోషన్స్‌ని బాగా డీల్ చేశారు. ఓ పర్పస్ కోసం సినిమా జరుగుతుంటుంది. ఇదివరకు ఎందులోనూ లేని విధంగా ఇందులో ఆ పర్పస్‌ని చాలా స్ట్రాంగ్‌గా పెట్టాం. 'ఢీ', 'రెడీ'లో లవర్ కోసం చేసేదుంటుంది. ఇందులో లవర్ కోసమని కాకుండా స్ట్రాంగ్ హ్యూమన్ యాంగిల్ ఉంటుంది. అది సినిమాలో చూస్తేనే బాగుంటుంది. దసరా పండక్కి అందరూ ఎంజాయ్ చేసే రీతిలో 'దూకుడు' ఉంటుంది. 'రెడీ' తర్వాత అంత హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్. మొదట్నుంచీ చివరి దాకా మహేశ్ కేరక్టర్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. మా సినిమా అంటే ఎక్స్‌పెక్ట్ చేసే బ్రహ్మానందం గారికి 'ఢీ', 'రెడీ', 'కింగ్' కంటే మంచి కేరక్టర్ కుదిరింది. డెఫినెట్‌గా అది కొత్తగా ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్లినా ఇందులోని పాత్ర పేరుతో పిలుస్తారు. బ్రహ్మానందం గారి లానే హాట్ ఫేవరేట్ ఎమ్మెస్ నారాయణ. మా ప్రతి సినిమాలో ఆయన ఓ సీను చేసినా అది పేలుతుంటుంది. ఇందులో ఆయన కేరక్టర్‌ని ఫుల్ ఫోకస్డ్‌గా రాశాం. ఆయన పాత్రకి థియేటర్లో వచ్చే రెస్పాన్స్ ఏమిటో మీరో చెప్పాలి. అంత బాగా ఎంజాయ్ చేస్తారు.
తమన్ చాయిస్ ఎవరిది?
శ్రీను గారిదే. తమన్ నిజానికి ఫ్రెండ్. నల్లమలుపు బుజ్జి దగ్గర నేను 'లక్ష్యం' చేస్తున్నప్పుడు తమన్ ఓ ఆల్బం తీసుకువచ్చి పరిచయమయ్యాడు. అప్పుడతను మణిశర్మ వద్ద కీబోర్డు ప్లేయర్‌గా పనిచేస్తున్నాడు. 'రెడీ' అప్పుడు నా ద్వారా శ్రీనుకి ఓ ఆల్బం వినిపించాడు. అతని రిదం తీరు, ఇన్‌స్ట్రుమెంటైజేషన్ చూసి శ్రీను చిన్న షాక్‌కు గురయ్యారు. డిఫినెట్‌గా ఎంకరేజ్ చేస్తాననీ, ట్యూన్స్ మంచిగా పట్టుకోమనీ చెప్పారు. ప్రస్తుతం తను దేవిశ్రీ ప్రసాద్‌తో చేస్తున్నాను కాబట్టి వీలు చేసుకుని అవకాశమిస్తానన్నారు. ఈలోగా తమన్ 'కిక్', 'బృందావనం' వంటి హిట్లతో లైంలైట్‌లోకి వచ్చాడు. 'నమో వెంకటేశ' పాటలు క్లిక్ కాకపోవడంతో దేవికి తను సరిగా చెప్పలేకపోతున్నానా లేక దేవి నాకు చెప్పలేకపోతున్నాడా అని ఫీలయ్యారు శ్రీను. దాంతో ఈసారి మారుద్దాం అనుకుని తమన్‌తో చేయించారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. వి ఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్.
గుహన్ పనితనం గురించి చెప్పండి.
ఈ సినిమాకి గుహన్ చాలా ప్లస్సవుతారు. అది కచ్చితంగా చెప్పగలను. ఇదివరకు మా సినిమాల్లో ఎన్నడూ లేనిరీతిలో సినిమాటోగ్రఫీ ఇందులో గొప్పగా ఉండబోతోంది. లొకేషన్లు ఎక్కువ ఉండటం, సెట్లు వైబ్రంట్‌గా ఉండటం వల్ల సినిమాటోగ్రఫీకి పాత్ర ఎక్కువ. విజువల్స్ అదరగొట్టారు. 'ఇటు రాయే ఇటు రాయే' పాటలో మహేశ్ స్టెప్స్ విరగదేశాడు. అలాగే 'చుల్‌బులీ', టైటిల్ సాంగ్ కూడా చాలా బాగుంటాయి.
ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అనుకున్నారు?
బడ్జెట్ మాకు సంబంధం లేని మేటర్. మహేశ్ సినిమాల్లో కాస్ట్లీ సినిమా. సాంగ్స్, ఫైట్లకి ఎక్కువ టైం తీసుకున్నాం. ఒక్కో సాంగ్ 8 నుంచి 10 రోజుల పాటు చేశాం. శ్రీను వైట్ల సినిమాల్లో ఫైట్స్ అంటే మాగ్జిమం నాలుగు రోజులు ఉంటుంది. పాట అంటే మూడు లేదా నాలుగు రోజులు. ఈ సినిమాలో అలా లెక్కలేమీ వేసుకోలేదు. బాగా రావాలనే ఉద్దేశంతో నెంబర్ ఆఫ్ షాట్స్ చేశాం.
అసెస్టెంట్ డైరెక్టర్‌గా కూడా చేశారు కదా. డైరెక్షన్ చేయబోతున్నారా?
ఇప్పుడు చాలామంది రైటర్లు డైరెక్టర్‌లుగా రాణిస్తారు. త్రివిక్రం, హరీశ్ శంకర్, వీరు పోట్ల సక్సెస్ అయ్యారు. రైటర్స్ డైరెక్టర్లు కావడానికి మంచి వాతావరణమే ఉంది. నేను కూడా వచ్చే యేడాది డైరెక్టర్ కాబోతున్నా. మళ్ల విజయప్రసాద్ గారికి సినిమా చేయబోతున్నా. 2012 మేలో అది మొదలు కావచ్చు. పెద్ద హీరోతోటే ఉంటుంది. ఆయన డేట్ల కోసం ఎదురు చూస్తున్నాం. ఈలోపల ఎన్టీఆర్, శ్రీను వైట్ల సినిమాకి పనిచేస్తా.
No comments:
Post a Comment